power polls
-
పక్షుల కోసం చీకట్లో గ్రామస్తులు
చెన్నై,టీ.నగర్: శివగంగై జిల్లా, కాళయర్కోవిల్ సమీపంలోని బొత్తముడిలో గ్రామస్తులు పక్షుల కోసం అంధకారంలో జీవనం సాగిస్తున్నారు. ఇక్కడున్న ఓ విద్యుత్ స్తంభం జాయింట్ బాక్స్‌లో ఓ పిచ్చుక గూడు కట్టి గుడ్లు పెట్టింది. దీన్ని గమనించిన గ్రామ యువకులు దానిని సంరక్షించేందుకు పూనుకున్నారు. రోజురోజుకీ పిచ్చుకలు ఆ స్తంభంలో అధికంగా గుడ్లు పెట్టసాగాయి. ఇలావుండగా గ్రామంలోని వీధి దీపాలను స్విచాన్ చేయాలంటే గూళ్లను తొలగించాల్సి ఉంటుంది. దీంతో 30 రోజులుగా గ్రామస్తులు చీకట్లోనే మగ్గుతున్నారు. ఈ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో గ్రామస్తులకు పలువురు ప్రశంసలందిస్తున్నారు. -
స్తంభం పటిష్టత గాలికెరుక
కడప అగ్రికల్చర్ : కోట్లాది రూపాయలు ఏటా ఖర్చు చేసి విద్యుత్ స్తంభాలు తయారు చేస్తున్నారు. అయితే నాణ్యత ప్రమాణాలు గాలికొదిలేశారు. ఫలితంగా కొద్దిపాటి గాలి, వానలకే నేలకొరుగుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. గ్రామీణ ప్రాంతాలు అంధకారంలో అలమటిస్తున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకుడబ్బులు చేతులు మారుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. వారం రోజుల కిందట గాలివానల కారణంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాల పటిష్టత, భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్తంభాలు, తీగలు పటిష్టత కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే కాసింత గాలివీచినా, వర్షపు చినుకులు రాలినా విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. అదేమంటే విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, ట్రాన్స్ఫార్మర్లలో ఫీజులు పోయాయని, పెద్దలైన్లు మెలికపడ్డాయని, స్తంభాలు కూలిపోయాయని అధికారులు, సిబ్బంది సాకులు చెబుపుతుండటం నిత్యకృత్యమైపోయింది. వారం రోజుల కిందట జిల్లాలో వీచిన గాలులకు జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, కొండాపురం, ముద్దనూరు, పోరుమావిళ్ల, బద్వేలు, కాశినాయన, చిన్నమండెం, రైల్వేకోడూరు, అట్లూరు, రాయచోటి, పులివెందుల, లింగాల, ఎర్రగుంట్ల, చెన్నూరు మండలాల్లో కలిపి 1392 స్తంభాలు విరిగిపోగా, 60 కిలో మీటర్ల వైర్లు పనికిరాకుండా పోయింది. మరో 200 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీని కారణంగా విద్యుత్ సంస్థకు రూ.3.05 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు నష్ట నివేదికలు తయారు చేశారు. ఇదిలా ఉండగా ఆయా గ్రామాలు మూడు రోజులపాటు అంధకారంలో ఉండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. దీనికి ప్రధాన కారణం అధికారుల అవినీతి, అక్రమాలు, విద్యుత్ స్తంభాల తయారీ కాంట్రాక్టర్ల ఆశ వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కమలాపురం, సిద్ధవటం మండల కేంద్రాల్లో ప్రభుత్వ పర్యవేక్షణలో విద్యుత్‌స్తంభాల తయారీ కేంద్రాలుండగా, రాయచోటి, ప్రొద్దుటూరు పట్టణాల్లో ప్రయివేటు ఆద్వర్యం లో ఉన్నాయి. ఇక్కడ తయారు చేసిన స్తంభా లు జిల్లాకు సరఫరా చేస్తున్నారు. తయారీలో నాణ్యత పాటించకపోవడం వల్లే చిరుగాలి వీచినా ఒరిగిపోతున్నాయి. దీంతో కోట్లాది రూపాయలు సంస్థకు నష్టంతోపాటు ప్రజల ఆస్తులకు నష్టవాటిల్లుతోంది. ♦ 8 మీటర్ల స్తంభాల తయారీకి కంకర 0.139 క్యూబిక్ మీటర్లు, ఇసుక 0.0739 క్యూబిక్ మీటర్లు, సిమెంటు 73.92 కిలోలు, ఇనుము (హెచ్‌టీ 4 ఎం)10.25 కిలోలు వాడతారు. ♦ 9.1 మీటర్ల స్తంభాల తయారీలో కంకర 0.237 క్యూబిక్ మీటర్లు, ఇసుక 0.126 క్యూబిక్ మీటర్లు, సిమెంటు 126.5 కిలోలు, ఇనుము (హెచ్‌టీ 4 ఎం) 16 కిలోలు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. 8 మీటర్ల స్తంభం తయారీకి రూ.2000 ఖర్చు అవుతుందని, అదే 9.1 మీటర్ల స్తంభం తయారీకి రూ.3600 అవుతుందని చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు తయారు చేసే సంస్థలు సరైన పరిమాణంలో సిమెంటు, ఇనుము, కంకర వాడడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొలాల్లో సేద్యాలకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ స్తంభాలకు సపోర్టుగా ఉన్న స్టే వైర్లను రైతులు తొలగించడం వల్లనే వాలిపోతున్నాయని అధికారులు సాకు చూపుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా వీటిని సరిచేయాలనే ధ్యాస అధికారులకు లేదనే విమర్శలున్నాయి. ఒక్కో సెక్షన్ ఆఫీసర్ పరిధిలో 3 నుంచి 6 సబ్స్టేషన్లు ఉండడంతో పర్యవేక్షణ భారంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఒకటి రెండు సబ్స్టేషన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఏడీఈలు, ఏఈలు ఫ్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ పనులు చేపట్టడం లేదు. ఫలితంగా సరఫరా ఆగిపోతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్తంభం ఎక్కేవారేరీ? విద్యుత్ లైన్లలో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు స్తంభం ఎక్కేవారు కరువయ్యారు. ట్రాన్స్ఫార్మర్లలో ఫీజులు వేయాలన్నా, ఇన్సులేటర్లు, డిస్కులు మార్చాలన్నా, చుట్టాలన్నా సిబ్బంది ఉండడం లేదు. హెల్పర్లు, లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు స్తంభాలు ఎక్కలేకపోతున్నారు. తప్పదనిపిస్తే ఇలాంటి పనులను ప్రయివేటు వ్యక్తులతో చేయిస్తున్నారు. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్‌శాఖ అధికారులు ఫ్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్(పీఎం) నిర్వహించాలి. ఇందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తారని అంచనా. రుతుపవనాలు, గాలి దుమారాలు రాకముందే విద్యుత్ స్తంభాలు, లైన్ల పటిష్టత పనులు పూర్తి చేయాలి. ఇందులో భాగంగా అన్ని లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలి. అయితే కొమ్మలు తొలగించడానికి, ఇతర మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ భారం అధికారులపై పడుతోందని అంటున్నారు. అయినా కూడా పల్లెల్లో ఆయా పనులు చేపట్టడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడేదిలేదు..: విద్యుత్ స్తంభాల నాణ్యత ప్రమాణ విషయంలో రాజీపడం. దగ్గర ఉండి ఇసుక, సిమెంటు, కంకర, ఇనుప కడ్డీలు తగు పరిమాణంలో ఉన్నాయా? లేదా? అని పరీక్షించిన తర్వాతే తయారీకి అనుమతులు ఇస్తాం. ఇందులో ఎలాంటి ప్రలోభాలకు లొంగేదిలేదు.–మధుసూదన్‌రావు, ఏడీఈ,నిర్మాణరంగం, జిల్లా విద్యుత్‌శాఖ. -
లైన్మన్లు.. స్తంభం ఎక్కాల్సిందే!
ఒంగోలు సెంట్రల్: విద్యుత్ సంస్థలో పనిచేసే జూనియర్ లైన్మన్లు, సహాయ లైన్మన్లు, లైన్మన్లు ఇక నుంచి విద్యుత్ స్తంభం ఎక్కాల్సిందేనని సదరన్ డిస్కం ముఖ్య ఇంజినీరు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత డివిజినల్ ఇంజినీరు వారానికి ఒక సెక్షన్‌కు వెళ్లి ప్రతి ఉద్యోగి స్తంభం ఎక్కగల సామర్థ్యం ఉందో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ, క్షేత్రస్థాయిలో ఎక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలన్నా, గడువులోపు బిల్లులు చెల్లించని వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపేయడం, పునురుద్ధరణ తదితర పనుల్లో స్తంభాలు ఎక్కేందుకు కొందరు శాశ్వత ఉద్యోగులు ఇష్టపడటం లేదని, మరికొందరికి స్తంభాలు ఎక్కే నైపుణ్యం లేదని తిరుపతిలోని సదరన్ డిస్కిం ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులతో ఆ పనులు చేయిస్తున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. నైపుణ్యం లేనందున పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు జాప్యం జరుగుతోందని గుర్తించారు. పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా నివారించేందుకు సిబ్బందిలో జవాదుదారీతనం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించకుండా శాశ్వత ఉద్యోగులే అన్ని పనులు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం విద్యుత్ స్తంభాలు ఎక్కలేని వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. 50 ఏళ్లు దాటిన లైన్మన్లు చాలామంది ప్రస్తుతం స్తంభాలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. జిల్లాలో జూనియర్ లైన్మన్లు–305 మంది. అసిస్టెంట్ లైన్మన్లు–380 మంది, లైన్మన్లు–365 మంది వరకు ఉన్నట్లు ఆ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. -
‘షాక్’ కొడుతున్నా చలనం లేదు..
రంపచోడవరం: విరిగిన ఎముకను అతికించడానికి కట్టుకట్టినట్టు..ఫొటోలో అట్టపెట్టెల్ని మడిచి, కట్టి ఉన్నది ఓ కరెంటు స్తంభం. ఆ స్తంభం పటిష్టంగా లేదని, అందుకే అలా అట్టపెట్టెల్ని కట్టారని ఎవరైనా అనుకోవచ్చు. నిజానికి విద్యుత్ స్తంభం బలహీనంగా ఉంటే.. అట్టపెట్టెలతో పటిష్టంగా ఉంటుందనుకుంటే అంతకన్నా తింగరితనం ఉండదు. అయితే.. ఆ స్తంభానికి అట్టపెట్టెల్ని కట్టడంలో ఉన్నది అలాంటి తెలివితక్కువతనం కానేకాదు. ఎవరికీ ప్రాణాపాయం జరక్కుండా అడ్డుకోవాలనే తపనతో తోచిన తరుణోపాయం. అంతేకాదు.. ఆ అట్టకట్లు..జనం ప్రాణాలను తృణప్రాయంగా చూసే విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి సాక్ష్యం. రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని ఈ విద్యుత్ స్తంభానికి విద్యుత్ ప్రవహిస్తూ.. తాకిన వారికి షాక్ కొడుతోంది. ఈ విషయమై ఆ శాఖ కార్యాలయానికి పలువురు పలుమార్లు ఫోన్ చేసి చెప్పినా అధికారుల్లో చలనం లేదు. ఆ స్తంభానికి విద్యుత్ ప్రవహించడం మొదలై పది రోజులు గడిచింది. అయినా ఆ శాఖ సిబ్బంది, అధికారులు అటు తొంగి చూడలేదు. ప్రస్తుతం స్తంభం కొద్దిపాటి షాక్ కొడుతున్నా.. అది తీవ్రతరమైతే ప్రాణాంతకమవుతుందన్న భయంతో స్థానికులు.. తోచింది చేశారు. స్తంభానికి దాదాపు ఏడడుగుల ఎత్తు వరకూ అట్టపెట్టెల్ని మడిచి కట్టారు. అయినా అదే రోడ్డులో తిరిగే విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోలేదు. జరగరానిది జరగకముందే కదలిక వచ్చేందుకు..విద్యుత్ శాఖకూ ఓ మోస్తరు షాక్ అవసరమయ్యేలా ఉంది. -
ఏటీ అగ్రహారంలో తప్పిన ప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఏటీ అగ్రహారంలో ఓ చెట్లకొమ్మ విరిగి పడటంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పెద్ద ఎత్తునా మంటలు చెలరేగాయి. ఘటన స్థలికి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. -
హోరు గాలి.. జోరు వాన
జిల్లాలో గాలివాన బీభత్సం పలుచోట్ల కూలిన భారీ వృక్షాలు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు అంధకారంలో గ్రామాలు పటాన్చెరు/చేగుంట/భెల్/ శివ్వంపేట: జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన గాలికి వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పటాన్చెరు పట్టణం వెంకటేశ్వర కాలనీ,ఆల్విన్ కాలనీల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. అమీన్పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ ప్రాంతాల్లోని 50 కాలనీలు అంధకారంలో ఉండిపోయాయి. చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో మామిడిచెట్టు ఈదురుగాలులకు కూలిపోయింది. దీంతో పాడిగేదె చె ట్టుకింద పడి మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన జంగం కృష్ణ, జంగం స్వామిలకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో సుమారు వంద చెట్లు నేలకూలాయి. అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివ్వంపేట మండలం పోతారంలో పౌల్ట్రీఫాం కూలిపోయింది. సుమారు 500 కోళ్లు మృతి చెందాయి. రూ. 6లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. దొంతి, మగ్దుంపూర్, ఉసిరికపల్లిలో రేకుల ఇళ్ల పైకప్పులు కూలాయి. దీంతో భయభ్రాంతులకు గరైన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహధారి పక్కన చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.