కడప రూరల్ : కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ సీఎం రమేశ్‌నాయుడు చేపట్టిన ఉక్కు దీక్షలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా జిల్లాలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోలు ఉండగా, మొత్తం 800 బస్సులు ఉన్నాయి. అందులో ఉక్కు దీక్షలకు 281 బస్సులను ఉపయోగించారు. ఇక ఇతర వాహనాల సంగతైతే లెక్కే లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా చాలా మార్గాల్లో బస్సు సర్వీసులను రద్దు చేశారు.
ఉదయం వేళ ఈ నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర సమస్య నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వివిధ రకాల పనులపై రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడపకు వచ్చిన బస్సులు మూడు గంటల తర్వాత తిరుగుముఖం పట్టాయి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం సేవలోనే ఆర్టీసీ బస్సులు తరించాయి. అధికార పార్టీ చేపట్టిన ఉక్కు దీక్ష తమకు పెద్ద ‘పరీక్ష’గా మారిందని పలువురు వాపోయారు.
బాగా లేదంటూనే.. ఎనిమిది నిమిషాలకుపైగా సీఎం రమేష్ ప్రసంగం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో 11 రోజులపాటు దీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అతని శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయని సీఎం పేర్కొన్నారు. అతను కోమాలోకి వెళ్లే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అనంతరం ఉక్కు దీక్షల నుంచి సీఎం రమేష్‌ను విరమింపజేసి తాను నెల్లూరుకు వెళ్లిపోయారు.ముఖ్యమంత్రి వెళ్లగానే సీఎం రమేష్ తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల 20 సెకండ్ల ప్రాంతంలో ప్రారంభించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెబుతూనే.. దాదాపు ఎనిమిది నిమిషాలకు పైగా మాట్లాడారు. ఈ ప్రసంగంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. కోమా దరిదాపుల్లోకి వెళ్లే వ్యక్తి ఇంత సేపు ఎలా మాట్లాడగలిగారు..? అంటూ ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment