సాక్షి ప్రతినిధి, కడప: వరుసగా మంత్రుల ప్రకటనలు టీడీపీ నాయకుల ప్రసంగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కడప ఉక్కుపైన స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా దీక్షలకు ముగింపు పలికారు. నాలుగేళ్లు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. జిల్లా ఉన్నతికి కృషి చేయనున్నామంటూ గతంలో జిల్లాలో పర్యటించిన 23 సార్లు ఇదే విషయం చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం కూడా నిర్ధిష్టమైన స్పష్టత ప్రభుత్వ ఉత్తర్వులుంటాయని ఆశించిన వారి ఆశలు అడియాశలే అయ్యాయి.
ఇదివరకే మెకాన్ సంస్థ నేతృత్వంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు ప్రకటించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి 2నెలలు గడువు అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తుందా అంటే అదీ లేదు, నాలుగైదు మార్గాలున్నాయి, అన్వేషిస్తామని.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఉద్యమబాట పట్టింది. నాలుగేళ్లుగా కలిసి కాపురం చేసిన టీడీపీకి అకస్మాత్తుగా విభజన చట్టంలోని అంశాలు గుర్తుకు వచ్చాయి.
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా రాజకీయ పార్టీల ఉద్యమాలతో నిమిత్తం లేకుండా కార్యాచరణ రూపొందించింది. రాజకీయ ప్రయోజనాలు మినహా ప్రజాప్రయోజనాలు కాదని గుర్తిం చిన వామపక్షపార్టీలు, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీలు టీడీపీ తీరును ఎండగట్టాయి. కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉద్యమాలు చేసిన రాజకీయ పక్షాలను అవమానపర్చిన టీడీపీ ముందుగా బహిరంగ క్షమాపణ కోరి ఆపై ఉద్యమ కార్యచరణ చేపట్టింటే ప్రజలు కాస్తోకూస్తో అభిమానించే వారని విశ్లేషకులు అభిప్రాయపడుతోన్నారు.
వక్రభాష్యం పలకడంలో టీడీపీ ముందంజ..
‘తాము చేస్తే ఒప్పు..ఎదుటోళ్లు చేస్తే తప్పు’ అన్న ధోరణిని టీడీపీ ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఉక్కు ఉద్యమం చేపట్టిన అఖిలపక్షం వినతి పత్రం స్వీకరించేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించని పరిస్థితి. ఎయిర్‌పోర్టులో 2నిమిషాలు సమయం కేటాయించాలని కోరినా తిరస్కరించి, పోలీసులను ఉసిగొల్పారు. పైగా ఉద్యమకారులందరినీ వైఎస్సార్‌సీపీ వర్గీయులుగా చిత్రీకరించారు. అప్పట్లో బీజేపీ నాయకత్వంలోని ఏన్డీయే భాగస్వామ్యపక్షంలో టీడీపీ కూడా ఉండడమే అసలు కారణం. ఇక్కడ ఉద్యమాలు చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటంటూ పోలీసుల ద్వారా వాటిని నీరుగార్చేవారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో సీఎం రమేష్ దీక్షలో ప్రసంగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు నిన్ననే బంద్ చేపట్టాయి. ఇక్కడ బంద్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటూ ప్రశ్నించారు. మరి రమేష్ కడప కేంద్రంగా ఆమరణదీక్ష చేపట్టడం వెనుక మతలబు ఏమిటని పలువురు నిలదీస్తున్నారు.
మంత్రుల పరేడ్..ఎంపీల హల్‌చల్....
జిల్లా కేంద్రమైన కడప జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్షకు మంత్రుల పరేడ్ నిర్వహించారు. దీక్ష చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. మంత్రులు, ఎంపీలు,ప్రముఖులు దీక్షాశిబిరం సందర్శించేలా ప్రణాళిక రచించారు.ఎవరు ఎప్పుడు హాజరు కావాలి, ఎవరి ప్రసంగం ఎలా ఉండాలి అన్న విషయం సీఎంఓ ఆదేశాల మేరకు జిల్లాలో ఆచరించారు. ఉక్కు దీక్ష చేపట్టిన టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఉద్యమించాల్సి ఉండగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నే అధికంగా టార్గెట్ చేశారు.రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించి హాజరైన మంత్రులు ప్రతి ఒక్కరూ ప్రతిపక్షనేతనే విమర్శించడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 22 మంది రాష్ట్ర మంత్రులు, 15మంది ఎంపీలు పర్యటించడం మొత్తం వ్యవహారం పక్కా ప్రణాళికబద్ధంగా చేపట్టారని విశ్లేషకులు వివరిస్తున్నారు.
11రోజుల దీక్షాపరుడు గంటలో డిశ్చార్జి...!?
11రోజులు తిండి లేకుండా ఆమరణదీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యుడు రమేష్ రిమ్స్‌లో గంటలోపు చికిత్సల అనంతరం డిశ్చార్జి అయ్యారు. శనివారం సాయంత్రం 3.35 గంటలకు ఆస్పత్రిలో చేరిన ఆయన, 4.20 డిశ్చార్జి అయ్యారు. 11రోజులుపాటు ఆమరణదీక్ష చేపట్టిన వ్యక్తి గంటలోపే ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేయించుకొని హుషారుగా ఇంటికి వెళ్లడంపై వైద్యవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘రాజ్యసభ సభ్యుడు రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్ష ఓ బూటకం’ అనేందుకు అనేక కారణాలు బలపడుతున్నాయి. బీటెక్ రవి షుగర్ పేషేంట్, తొలిరోజు సాయంత్రానికే తీవ్రంగా నీరసించిపోయారు. అలాంటి వ్యక్తి 7రోజులు దీక్షను కొనసాగించారు. షుగర్ పేపేంట్ వరుసగా మూడు రోజులు ఏమి తినకుండా ఉంటే కోమాకు వెళ్తారని వైద్యులు వివరిస్తున్నారు.
అలాగే రమేష్ బ్లడ్ రిపోర్టు పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మూడోరోజు నుంచి ఐదోరోజు వరకు ఆయన బరువులో ఒక గ్రాము కూడా తేడా కన్పించలేదు. ఏమి తినకుండా నీరు మాత్రమే తాగుతూ ఆమరణదీక్ష చేపట్టే వ్యక్తి బరువులో వ్యత్యాసం లేకపోవడం ఆయన చేపట్టిన దీక్ష ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. బ్లడ్ షుగర్ తగ్గిపోవాల్సి ఉండగా మధ్యలో పెరుగుతూ రావడాన్ని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిమ్మరసం ఇచ్చి రమేష్ దీక్ష విరమింపజేయగా మాట్లాడే పరిస్థితిలో లేనంటూ మైకు తీసుకున్న ఆయన దాదాపు ఏడున్నర్ర నిమిషాలు ప్రసంగించారు. ఆపై రిమ్స్‌కు వెళ్లిన ఆయన 45 నిమిషాలకే డిశ్చార్జి అయ్యారు. 7రోజులు దీక్ష అనంతరం ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించగా నాలుగురోజులు చికిత్స పొందారు.దీనిని బట్టి వీరి దీక్ష ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చుని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ఎలా ఉన్నా పట్టులేని జిల్లాలో రాజకీయంగా పట్టుసాధించడమే లక్ష్యంగా కొనసాగిందని విశ్లేషకులు వెల్లడిస్తుండడం విశేషం.
కడప దశ మారుస్తా!
సాక్షి, కడప : రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కడపజిల్లా దశ మారుస్తా నని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద ఉక్కు దీక్షలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను పరామర్శించిన అనంతరం సీఎం మాట్లాడుతూ తలసరిఆదాయంలో రాష్ట్రం దూసుకుపోతోందని, 2022 నాటికి దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.కేంద్రంపై ఉక్కు కోసం పోరాటం సాగిస్తానని...తాడోపేడో తేల్చుకుంటానని తెలియజేశారు.
చప్పట్లు కొట్టండి..హర్షాన్ని తెలియజేయండి..
సీఎం మాట్లాడుతూ అనేక సందర్భాల్లో రాష్ట్రానికి అన్నీ తానే చేసినట్లు చెప్పడంతో వదిలి పెట్టకుండా మీరు నమ్మినట్లయితే చప్పట్లు కొట్టండంటూ అడిగి కొట్టించుకోవడం కనిపించింది. సరిగా వినిపించడం లేదు....గట్టిగా వినిపించేలా కొట్టండి..జిల్లా నలుమూలలకు వినిపించాలన్నా పెద్దగా సభికుల నుంచి స్పందన లేదు. పదేపదే హర్షం ప్రకటించాలంటూ సీఎం స్థాయిలో అడిగి ఆమోదం తెలుపమని కోరడం కనిపించింది. ఉక్కు పరిశ్రమ నెలకొల్పొతాం...మీరు నమ్ముతున్నారా అంటూ జనాలను అడిగినపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు పరిశ్రమతోపాటు టీడీపీ నేతల దీక్ష.. ధర్మపోరాటమంటూ ఊకదంపుడు ఉపన్యాసం చేస్తున్న బాబుకు పలుమార్లు ప్రత్యేక హైకోర్టు నినాదం వినిపించింది. సభలో బాబు మాట్లాడుతున్న సందర్భలో పలువురు న్యాయవాదులు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
ఉక్కు దీక్షలో కనిపించని వరద
టీడీపీ మైలేజ్‌కోసం చేపట్టిన ఉక్కు దీక్షలో మాజీమంత్రి వరదరాజులరెడ్డి కనిపించలేదు. దీక్షకు వారంరోజుల ముందే సీఎం రమేష్‌పై విమర్శల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే అదే పట్టుదలతో హాజరు కాలేదు. 11 రోజులపాటు దీక్ష చేసినా ఏ ఒక్క రోజూ సంఘీభావం తెలుపడానికి రాలేదు. సీఎం వచ్చినా ఎయిర్ పోర్టు వద్ద కలిసి మాట్లాడిన వరద అనంతరం వెళ్లిపోయారు.జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు, మైదకూరు, కడప, కమలాపురం తదితర ప్రాంతాల నుంచి జనాలను భారీగా తరలించారు. డ్వాక్రా మహిళలతోపాటు పార్టీ కార్యకర్తలను ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వారికి ఇక్కడ స్థలం లేకపోవడంతో అగచాట్లు పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 30న జిల్లాకు వస్తున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సంఘీభావం ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి తెలివైన నాయకుడు ఎప్పుడు ఏమి చేయాలో అది చేస్తాడు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారు.
–మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి.
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేసింది. హక్కుగా వచ్చిన అంశాలను కూడా అమలు చేయలేదు. రమేష్ చేపట్టిన ఆమరణదీక్ష సందర్శనకు ముఖ్యమంత్రి రానున్నారు. ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
–మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment