ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు
ఆరింట్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే
కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్‌కు తిరుపతి సీటు
కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేశ్ పోటీ
ఈ మధ్యే చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట
పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు
నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు
సాక్షి, అమరావతి : ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని దానికోసమే అహరహం శ్రమిస్తున్న అసలు సిసలైన బీజేపీ నేతలకు ఊహించినట్లుగానే షాక్ తగిలింది. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ సీట్లలో ఒక్క నరసాపురం మినహా మిగిలిన అరకు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేట, తిరుపతి స్థానాలను వలస పక్షులే దక్కించుకున్నాయి. దీంతో బీజేపీకి అసలైన పార్టీ అభ్యర్థులే కరువయ్యారా అన్న అంశం ఇప్పుడు కరడుగట్టిన కమలనాథుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. 2019లో టీడీపీ ఘోరంగా ఓటమి చవిచూసిన తర్వాత చంద్రబాబు డైరెక్షన్‌లో హుటాహుటిన బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన నమ్మినబంటు సీఎం రమేశ్‌కు అనకాపల్లి ఎంపీ స్థానం కేటాయించారు.
ఈయన నిజానికి వైఎస్సార్ జిల్లా వ్యక్తి. ఎక్కడో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు వలస నేతను దిగుమతి చేయాల్సిన ఖర్మ ఏంటని 20–30 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న వారుప్రశ్నిస్తున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు వదిన అయిన పురందేశ్వరి కూడా 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పరాజయం పాలయ్యాక బీజేపీలోకి వచ్చిన వ్యక్తే. ఈమెకు రాజమహేంద్రవరం టికెట్ దక్కింది. అలాగే, రాజంపేట టికెట్ దక్కిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈమధ్యే బీజేపీలో చేరారు. అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత అయితే గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించారు.
ఆ తర్వాత ఆమె జనజాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుని అనంతరం దానిని బీజేపీలో విలీనం చేశారు. ఇక గూడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అయితే బీజేపీ కండువా కప్పుకున్న రోజే పార్టీ ఆయనకు తిరుపతి టికెట్ కేటాయించింది. ఇలా.. ఒక్క నరసాపురం అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మినహా మిగిలిన అందరూ వలస నేతలకే టికెట్లు దక్కాయి. ఎక్కువగా తన మనుషులకే టికెట్లు వచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దీంతో పొత్తులున్నా.. లేకున్నా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసేందుకు రెండు మూడేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి వంటి బీజేపీ సీనియర్లు ఎంపీ అభ్యర్థుల జాబితా చూసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇక నిన్నటివరకూ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని తిరుపతి జిల్లా గూడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఒక్కసారిగా తిరుపతి లోక్‌సభ సీటు దక్కడం వారిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేయడమే కాక పార్టీలో ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
బాబు, పవన్ చుట్టూ వరప్రసాద్ చక్కర్లు..
వాస్తవానికి.. వరప్రసాద్‌కు ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. 20 రోజుల క్రితం బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరక ముందు తిరుపతి లోకసభ సీటును జనసేనకు కేటాయించాలని భావిస్తున్న సమయంలో చంద్రబాబు సూచన మేరకు వరప్రసాద్ నెలరోజుల క్రితమే మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిశారు.
ఆ తర్వాత.. పొత్తులో బీజేపీ కూడా చేరడంతో తిరుపతి లోకసభ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. దీంతో చంద్రబాబు డైరెక్షన్‌లోనే వరప్రసాద్ మళ్లీ బీజేపీ చుట్టూ తిరగడం మొదలుపెట్టినట్లు కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐదారు రోజులుగా ఢిల్లీలో వరప్రసాద్‌ను వెంటబెట్టుకుని కొందరు జాతీయ పెద్దల వద్ద లాబీయింగ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె ప్రతిపాదన మేరకే బీజేపీ జాతీయ నాయకత్వం వరప్రసాద్‌కు బీజేపీలో చేరక మునుపే తిరుపతి లోకసభ సీటు కేటాయించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీజేపీలో చేరేందుకు బద్వేలు అభ్యర్థి ‘నో’..
మరోవైపు.. పొత్తులో బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో బద్వేలు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ స్థానంలో బీజేపీకి సరైన అభ్యర్థి కూడా లేనందున ఆ సీటును బలవంతంగా బీజేపీకి అంటగట్టారని మొదటి నుంచి పార్టీలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ సీటులో బీజేపీ తరఫున పోటీచేసేందుకు పురందేశ్వరి ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించారని.. ఆ ముగ్గురూ ఇప్పటిదాకా పార్టీలో చేరని వారేనని వారంటున్నారు.
ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరైన రోశన్న పేరుకు ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో రోశన్నను బీజేపీలో చేర్చేందుకు పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లా నాయకులు ఆదివారం ప్రయత్నించగా, ఆయన అందుకు విముఖత చూపారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సీటు వ్యవహారాన్ని కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తున్నారు.
సీనియర్ల ఆగ్రహావేశాలు..
ఇదిలా ఉంటే.. పొత్తు ఉన్నా, లేకపోయినా పార్టీ తరఫున పోటీచేసేందుకు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న చాలామంది ఆసక్తి వ్యక్తంచేశారని.. అలాంటప్పుడు పార్టీకి మంచి అభ్యర్థులున్న నియోజకవర్గాలే కేటాయించాలని పట్టుబట్టి ఉండొచ్చు కదా అని పలువురు సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కానీ, చంద్రబాబు ఇస్తామన్న నియోజకవర్గాలను ఒప్పుకుని, ఇప్పుడా స్థానాల్లో పార్టీ సభ్యత్వంలేని వారికి సీట్లు కేటాయిస్తే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న నాయకుల పరిస్థితి, పార్టీ పరువు ఏం కావాలని పార్టీ హార్డ్‌కోర్ సీనియర్లు రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment