పెందుర్తి టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసిన చంద్రబాబు
ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్లకు దాదాపు ఖరారు
రెండు వారాలుగా పత్తా లేని బండారు సత్యనారాయణమూర్తి
టీడీపీ–జనసేన కీలక బీసీ, జెండా సభలకు డుమ్మా
నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌కు కూడా మొహం చాటేసిన మాజీ మంత్రి
పెందుర్తి (విశాఖ జిల్లా): బండారు సత్య నారాయణమూర్తి... 40 ఏళ్ల రాజకీయానుభవం. ఐదుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి.. కానీ ఏం లాభం. చంద్రబాబు ఛీ పొమ్మన్నారు. టికెట్ లేదనేశారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్లకు టికెట్ దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో బండారు భవిష్యత్తు డోలాయమానంలో పడింది. బీసీలపై చంద్రబాబు చూపించే కపట ప్రేమకు బండారు ఉదంతమే తాజా ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం అధికార పక్షంపై, మహిళా మంత్రి రోజాపై బండారు నోరు పారేసుకుని అభాసుపాలయ్యారు.
పార్టీ కోసం చేతి చమురు వదిలించుకున్నారు. అయినా వాడుకుని వదిలేసే చంద్రబాబు చివరకు అదే చేశారు. తన అల్లుడైన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు, వియ్యంకుడైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుల సిఫార్సులు కూడా బండారును గట్టెక్కించలేక పోయాయి. దీంతో టికెట్ రేసు నుంచి తప్పుకుని పత్తాలేకుండా పోయారు. రెండు వారాలుగా కార్యకర్తలకు అందుబాటులో లేరు. ముఖ్యమైన ఏ సమావేశంలోనూ కనిపించడం లేదు. ఇటీవల టీడీపీ–జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జెండా, జయహో బీసీ సభలకు కూడా దూరంగా ఉండడంతో కేడర్‌కు ఏమీ పాలుపోవడంలేదు.
ఒక్కసారిగా సీన్ రివర్స్
పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోనేందుకు ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకోవడంతో గత కొన్నాళ్లుగా ‘టికెట్ మాదంటే మాది’ అంటూ జనసేన, టీడీపీలు ప్రచారం చేసుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ చరమాంకంలో ఉన్న టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గంపెడాసలు పెట్టుకున్నారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో టికెట్ రేసులో పోటీ పడ్డారు. ‘తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే ఆఖరి కదా.. చంద్రబాబు కూడా అవకాశం ఇస్తారు’ అన్న నమ్మకంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేడర్‌తో సమావేశాలు నిర్వహించారు. బహిరంగ వేదికలపై అధికార పక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో టికెట్ బండారుదేనని టీడీపీ కేడర్ కూడా ధీమాగా ఉంది. అయితే పెందుర్తి టికెట్ కోసం పంచకర్ల రమేష్‌బాబు పట్టుపట్టడం, సీట్ల పంపకాల్లో కచ్చితంగా పెందుర్తిని జనసేనకే కేటాయిస్తారని బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పంచకర్ల కూడా నియోజకవర్గంలో జోరు పెంచడంతో అవమానభారంతో కేడర్‌కు బండారు మొహం చూపించట్లేదు.
వరుస ఓటములతో అవమానం
ఒకప్పుడు రాజకీయంగా వైభవం చూసిన బండారులో 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత మరింత జోష్ కనిపించింది. అయితే టీడీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో లెక్కలేని అవినీతి.. కొడుకు అప్పలనాయుడు వ్యవహారశైలి కారణంగా సత్యనారాయణమూర్తి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేతిలో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2022పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామం వెన్నెలపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన భార్య మాధవీలత సహా పంచాయతీలో పది వార్డుల్లోనూ బండారు అనుచరులు చిత్తుగా ఓడిపోయారు.
దెబ్బ మీద దెబ్బ.. చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెన్నెలపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ప్రజాతీర్పును గౌరవించని బండారు ఆ తరువాత పూర్తిగా అదుపు తప్పారు. వరుస ఓటముల అవమానభారంతో అధికార పార్టీపై నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా అని బయటకు ప్రచారం చేసుకుంటున్నా.. జనంలో పూర్తిగా గుర్తింపు కోల్పోయారన్న కారణంతోనే బండారును చంద్రబాబు పక్కన పెట్టారని టీడీపీ నాయకులే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment