
సంక్రాంతి వేడుకలో మాగంటి చిందులు
డ్యాన్సర్లతో కలసి స్టెప్పులేసిన ఎంపీ
కైకలూరు: సంక్రాంతి పండుగ ముగింపు వేడుకలను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కైకలూరులోని తన స్వగృహంలో పార్టీ నాయకులకు, తన అనుయాయులకు సోమవారం రాత్రి పసందైన మందు–విందు ఏర్పాటు చేశారు.
ఈ విందుకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు అధికారులు సైతం హాజరయ్యారు. కోరుకున్నవారికి కోరుకున్న బ్రాండు మందును అందజేశారు. చేపల పులుసు, చికెన్, మటన్ వంటి మాంసాహారాలను వడ్డించారు. సినిమా పాటలకు యాంకర్లతో డ్యాన్సులు చేయించారు. ఎంపీ బాబు కూడా డ్యాన్సర్లతో కలసి స్టెప్పులు వేశారు. భోగి పండుగ మొదలు కైకలూరు స్వగృహంలో కోడిపందాలు వేయించిన మాగంటి.. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.