టీడీపీ మరో రాజకీయ హత్య
గుంటూరు జిల్లా చినగార్లపాడులో పట్టపగలే దారుణం
నడిరోడ్డుపై వైఎస్సార్ సీపీ నేతను నరికి చంపిన టీడీపీ వర్గీయులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో టీడీపీ సాగిస్తున్న హత్యా రాజకీయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత బలయ్యాడు. గురువారం చినగార్లపాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు పట్టపగలు కత్తులు, బరిసెలు, వేట కొడవళ్లతో స్వైర విహారం చేసి, వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేసే వేంపాటి గోవిందరెడ్డి (45)ని హత్య చేశారు. ఆయన భార్యను, మరో ఇద్దరి పైన కూడా దాడిచేసి, తీవ్రంగా గాయపర్చారు. టీడీపీ వర్గీయుల దాడితో గ్రామం వణికిపోయింది. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అక్క లక్ష్మమ్మ, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో 30 మంది టీడీపీ వర్గీయులు కత్తులు, బరిసెలు, వేటకొడవళ్లతో ఒక ట్రాక్టర్, రెండు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పెద్దగా కేకలు వేస్తూ చినగార్లపాడు గ్రామ కూడలికి వచ్చారు.
వెంటనే సెంటర్‌లో నిల్చుని ఉన్న ఈవూరి శివారెడ్డిపై దాడి చేశారు. దీంతో అక్కడున్న వారు, దుకాణాల యజమానులు భయాందోళనకు లోనై పరుగులు తీశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని వైఎస్సార్‌సీపీ నేత వేంపాటి గోవిందరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇది గమనించిన గోవిందరెడ్డి పారిపోయేందుకు ప్రయత్నించగా అందరూ చూస్తుండగానే నడి బజారులో ఆయన్ని అతి కిరాతకంగా పొడిచి చంపారు. అడ్డు వచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మపై దాడి చేయగా తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డిని కూడా కత్తులు, బరిసెలతో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం నిందితులు గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే నరికేస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. అయితే, నిందితులందరి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు గ్రామానికి వెళ్లి, వివరాలు తెలుసుకున్నారు.