కొట్టేశారు.. కట్టేశారు..! | TDP Office Illegal Construction In Srikakulam | Sakshi
Sakshi News home page

కొట్టేశారు.. కట్టేశారు..!

Published Sat, Aug 17 2019 10:10 AM | Last Updated on Sat, Aug 17 2019 10:56 AM

TDP Office Illegal Construction In Srikakulam - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాత శ్రీకాకుళం పరిధిలోని 80 అడుగుల రోడ్డులో ఎన్టీఆర్‌ భవన్‌ పేరుతో కొనసాగుతున్న టీడీపీ కార్యాలయమిది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సుందరంగా నిర్మించారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రెండెకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. స్థలాన్ని కొనుగోలు చేసి కార్యాలయం నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఖాళీగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన స్థలమిది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన పార్టీ కార్యాలయం కోసం ఎంతో విలువైన భూమిని 99 సంవత్సరాలకు లీజు కింద కట్టబెట్టేశారు. ఈ భూమిని కేటాయించిన 2015 నాటికి రిజిస్ట్రేషన్ల ప్రకారం ఇక్కడ ఎకరా విలువ సుమారు రూ.4.01 కోట్లు. అనధికారికంగానైతే రూ.6 కోట్ల వరకు పలికేది. మార్కెట్‌ రేటు ప్రకారం టీడీపీ కార్యాలయం కోసం కేటాయించిన రెండెకరాల భూమి విలువ రూ.12 కోట్లు దాటే ఉంటుంది. ఇంతటి విలువైన భూమిని సంవత్సరానికి కేవలం రూ.25 వేల ఫీజుతో 99 సంవత్సరాల లీజుకింద ధారాదత్తం చేశారు. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో... కోట్లాది రూపాయల విలువైన భూమిని ఎలా అప్పనంగా దక్కించుకున్నారో.. ఈ కథనం చదివితే అర్థమవుతుంది.

రైతుల నుంచి సేకరించిన భూమిపై టీడీపీ కన్ను..
పాత శ్రీకాకుళం పరిధిలోని 80 అడుగుల రోడ్డులో షెడ్యూల్‌ కులాల ఇళ్ల స్థలాలు, ఇతరత్రా అవసరాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ కొన్నేళ్ల క్రితం భూమిని రైతుల నుంచి సేకరించింది. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అందులో వివిధ అవసరాలకు వినియోగించగా రెండెకరాల భూమి మిగిలి ఉంది. కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. ఇంతలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ నేతల కన్ను ఖాళీ భూమిపై పడింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పథక రచన చేశారు. ఇంకేముంది చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూమిని కొట్టేసేందుకు పావులు కదిపారు. కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు వత్తాసు పలికారు. చకచకా పైలు కదిపి 2015 సెప్టెంబర్‌ 4వ తేదీన టీడీపీ కార్యాలయం కోసం కేటాయించేశారు. టౌన్‌ సర్వే నెంబర్‌ 700–1లో 1.29 ఎకరాలు, టౌన్‌ సర్వే నెంబర్‌ 701–1లో 71 సెంట్ల భూమిని టీడీపీకి అప్పగించేశారు.

జీవోలు మార్చి రెండెకరాల కేటాయింపు..
పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందుకోసం తగు నిబంధనలు కూడా ఉన్నా యి. గుర్తింపు కలిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా  కార్యాలయాల కోసం ఒక ఎకరా భూమిని 30 సంవత్సరాల నామినల్‌ లీజు కింద కేటాయించొచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ జీవోను కాదని కొన్ని షరతుల పెట్టి మరో జీవో కింద ఏకంగా రెండెకరాలు కేటాయించింది. వాస్తవానికి తొలుత ఎకరా భూమి కోసమే జిల్లా పార్టీ తరపున దరఖాస్తు చేశారు. అక్కడున్న మొత్తం భూమిని తీసేసుకుంటే భవి ష్యత్‌లో ఎవరూ రారని, ఎలాంటి ఇబ్బందులుండవని కొందరు అధికారులు, మరికొంద రు పార్టీ నేతలు సూచించడంతో రెండో దరఖాస్తుచేశారు. ఖాళీగా ఉన్న రెండెకరాల భూమి ని తమకే ఇవ్వాలని దరఖాస్తు చేయడం, దాని కి అధికారులు వత్తాసు పలికుతూ చకాచకా ఫైలు కదపడం జరిగింది. తమ ప్రభుత్వమే ఉండటంతో రాజధాని స్థాయిలో ఆమోద ముద్ర వేయించారు.

పేదలకు సెంటు స్థలం ఇవ్వకపోయినా..
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పేదవాళ్లకు సెంటు స్థలం కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. అక్కడక్కడా ప్రభుత్వ స్థలంలో తమకు లాభసాటిగా ఉండేలా అపార్ట్‌మెంట్ల నిర్మాణం ద్వారా ప్లాట్లు కేటాయించే కార్యక్రమం మాత్ర మే చేపట్టింది. ఇది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. కాంట్రాక్టర్లకు ఇచ్చి, వాటిలో కమిషన్లు తీసుకునే కార్యక్రమాన్నే ఎక్కువగా చేపట్టింది. ఇలా... ఏ ఒక్కరికీ సెంటు స్థలమివ్వని టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయం కోసం మాత్రం నగరంలో ఎంతో విలువైన రెండు ఎకరాల భూమిని కేటాయించింది.

మూడింతల దోపిడీ..
టీడీపీకి కేటాయించిన భూమి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. పార్టీ కార్యాలయానికి కేటాయించిన నాటికి 2015లో చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారం ఎకరా రూ.4.01 కోట్లు. అనధికారికంగా దాని విలువ రూ.6 కోట్లు పైబడి ఉండేది. ఈ లెక్కన రెండెకరాల భూమి విలువ రిజిస్ట్రేషన్ల ప్రకారం రూ.8 కోట్ల మేర పలికగా మార్కెట్‌ రేటు ప్రకారం రూ.12 కోట్ల పైబడి ఉండేది. ఇప్పుడైతే దాని విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర ఉంది. దాదాపు రూ.12 కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ.25 వేల లీజు చొప్పున 99 సంవత్సరాలకు కట్టబెట్టారు. సాధారణంగా 30 సంవత్సరాల లీజుకు కేటాయిస్తుంటారు. కానీ అధికారం చేతిలో ఉండటంతో తమ పార్టీ కార్యాలయం కోసం ఏకంగా 99 సంవత్సరాల లీజుకిచ్చేశారు. అంటే ఆ స్థలం టీడీపీ చేతిలోకి వెళ్లిపోయినట్టే. దీన్నిబట్టి టీడీపీ ఘరానా దోపిడీ ఏ స్థాయిలో ఉందో, పార్టీ ఎలా లాభపడిందో అర్థం చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement