టీడీపీ పంచాయతీలకు ఝలక్! | TDP Panchayats shok | Sakshi
Sakshi News home page

టీడీపీ పంచాయతీలకు ఝలక్!

Published Mon, Feb 15 2016 10:04 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీ పంచాయతీలకు ఝలక్! - Sakshi

టీడీపీ పంచాయతీలకు ఝలక్!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జాతీయ ఉపాధి హామీ (ఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులకు సంబంధించి పనులు జరగాలంటే పంచాయతీ తీర్మానాలవసరం. మండలపరిషత్‌కు వచ్చిన ఆయా తీర్మానాల్ని అక్కడి అధికారులు జిల్లా పరిషత్‌కు, తరువాత కలెక్టర్ కార్యాలయానికి పంపించిన తరువాత అన్ని రకాల ఆమోదం లభిస్తేనే పనులు ప్రారంభించాలి. కానీ రాజకీయ కక్షలతో టీడీపీ అధికారం చెలాయిస్తున్న పంచాయితీలకు ఎలాంటి తీర్మానాలు లేకుండానే రూ.11.6 కోట్ల విలువైన రోడ్డు పనులకు ఉపాధి హామీ పథకం పేరిట నిధులు మంజూరు చేయడం, ఇందుకు జిల్లా కలెక్టర్ సహా జెడ్పీ, ఎంపీడీవో సై అనడంతో పొందూరు ఎంపీపీ కోర్టుకెళ్లారు. విషయమే తమ వద్దకు రాలేనప్పుడు పనులకు నిధులెలా మం జూరు చేస్తారని, వైఎస్సార్‌సీపీ బాధ్యత వహిస్తున్న పంచాయతీల్ని కాదని ఇతర పంచాయితీల్లో అభివృద్ధి పనులెలా చేస్తారని కలెక్టర్ సహా పలు విభాగాల్లో ఫిర్యాదిచ్చినా ఫలితం లేకపోవడంతో ఎంపీపీ కోర్టుకెళ్లారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఆయా పనులపై స్టే విధించినట్టు ఎంపీపీ ప్రతినిధి సువ్వాడ గాంధీ సాక్షికి స్పష్టం చేశారు.ఆది నుంచీ అంతే

పొందూరు మండల పరిధిలో 29గ్రామ పంచాయితీలున్నాయి. అందులో 14 మాత్రమే టీడీపీకి దక్కాయి. మెజార్టీ పంచాయతీలు వైఎస్సార్‌సీపీకి దక్కడంతో అక్కడి ఎంపీపీ పదవి సువ్వారి దివ్యను వరించింది. రాజకీయ కక్షతో ప్రభుత్వ అండదండలు చూసుకుని అక్కడి టీడీపీ నేతలు ఆదినుంచీ వైఎస్సార్‌సీపీకి అడ్డు తగులుతూ వస్తున్నారనే అభియోగాలున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో తాము చెప్పిందే వేదం అంటూ స్థానిక అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అక్కడి ఎంపీడీవో కూడా టీడీపీ నాయకుల వైపే మొగ్గుచూపుతున్నారన్న విమర్శ ఉంది. వీటిపైనా కోర్టు స్పందించింది. అక్కడి అభివృద్ధి పనులకు ఎంపీపీ ముందుకు వెళ్తున్నా ఏవో కారణాలు చూపుతూ స్థానిక టీడీపీ నాయకులు, ప్రభుత్వ విప్ అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సహాయంతో ఎన్నో పనుల్ని అడ్డుకుంటున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.

 జెడ్పీ తీర్మానం సరిపోతుందా?
గతేడాది డిసెంబర్ 29న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ తీర్మానాల్లేకుండానే 584 జెడ్పీ తీర్మానం మేరకు రూ.7.37 కోట్లుతో 42 పనులకు, 627 తీర్మానం మేరకు రూ.3.69 కోట్లు విలువైన 30 పనులకు అంగీకారం తెలిపినట్టు జెడ్పీ సీఈవో సైతం నోట్ జారీ చేసేశారు. ఇదే విషయమై పొందూరు ఎంపీపీ అప్పట్లోనే జెడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్‌లకు లిఖితపూర్వవక ఫిర్యాదిచ్చినా స్పందన లేదు. సెక్షన్ 4-(5) ప్రకారం ఎలాంటి తీర్మానాలూ లేకుండానే వ్యక్తిగత హోదాతోనే అధికారులు నిధుల మంజూరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని, గ్రామ పంచాయతీలుగానీ, ఎంపీడీవో కార్యాలయ పరిధిలో పనులకు సంబంధించి కూడా ఎజెండా రూపకల్పన జరగలేదని స్పష్టం చేసినా సంబంధిత అధికారుల్లో చలనం రాలేదు. నిధుల మంజూరీకి సంబంధించి జనవరి 11, 2016లో టీడీపీ సర్పంచ్‌లున్నచోటే పనులకు అంగీకరిస్తూ జిల్లా యంత్రాంగం ఆమోదం తెలపడాన్ని ప్రతిపక్ష ైవె ఎస్సార్‌సీపీ సభ్యులూ ఖండించారు.


ప్రభుత్వం (2917-ఈజీఎస్-టీ-పీఈ3)పేరిట సెప్టెంబర్ 13, 2014లోనే సర్క్యులర్ జారీ చేసినా జిల్లా యంత్రాంగం నుంచి మాత్రం జనవరిలో అన్ని రకాల తీర్మానాలకూ సంతకాలు చేసేయడం గమనార్హం. దీంతో పంచాయితీ రాజ్ కమిషనర్‌కూ ఇక్కడ జరుగుతున్న తంతును పొందూరు ఎంపీపీ ఈనెల 2న ఫిర్యాదిచ్చారు. చట్ట ప్రకారం అన్ని పంచాయతీలకూ ఒకేలా అభివృద్ధి పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. దీంతో కోర్టునాశ్రయించాల్సివచ్చిందని బాధితులు చెబుతున్నారు. 
   
 స్టే వచ్చింది
 రాష్ట్ర సర్వోన్నత న్యాయంస్థానం ఇక్కడి 14 టీడీపీ పంచాయతీలకు నిధులు పంపిణీ చేయొద్దంటూ స్టే విధించింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రోద్భలంతోనే ఎంపీడీవో సహా అధికారులంతా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్తు తెస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. పంచాయితీల్లో ఎలాంటి తీర్మానాలు లేకుండా చాలా ఏళ్లు పనులు జరిపించేసి ఏళ్ల క్రితం భారీగా సొమ్ముకాజేసిన వైనాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తాం. సువ్వారి గాంధీ, పొందూరు ఎంపీపీ ప్రతినిధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement