టీడీపీపీ నేత ఎంపిక అధికారం చంద్రబాబుకే
బాబు అధ్యక్షతన భేటీలో టీడీపీ ఎంపీల తీర్మానం
టీడీపీపీ నేతగా అశోక్‌గజపతిరాజుకు అవకాశం?
లేదంటే శివప్రసాద్, కొనకళ్ల, నిమ్మల, రాయపాటిల్లో ఒకరికి చాన్స్
సుజనాకు కేంద్రమంత్రి పదవి ఇస్తామన్న బాబు!
హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నాయకుడిని ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఎంపీలు కట్టబెట్టారు. టీడీపీపీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీడీపీపీ నేత ఎంపిక అంశం చర్చకు రాగానే ఆ అధికారాన్ని చంద్రబాబుకు కట్టబెడుతూ పార్టీ ఎంపీలు తీర్మానం చేశారు. గత సభలో టీడీపీపీ నేతగా నామా నాగేశ్వరరావు వ్యవహరించగా రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా టి.దేవేందర్‌గౌడ్ కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఆయన్ను కొనసాగిస్తారు. ఈసారి నామా ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో కొత్త నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. టీడీపీపీ నేతగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజును నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లేదంటే ఆయన్ను లోక్‌సభలో పార్టీ పక్ష నేతగా నియమించి, టీడీపీపీ నేతగా ఎన్.శివప్రసాద్, వై.సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, రాయపాటి సాంబశివరావుల్లో ఒకరిని నియమించే అవకాశముందని సమాచారం.
మరో మంత్రి పదవి వస్తుంది
టీడీపీకి కేంద్ర కేబినెట్‌లో మరో మంత్రి పదవి దక్కుతుందని టీడీపీపీ సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అయితే అది కేబినేట్ హోదా లేదా సహాయ మంత్రి పదవా అనేది చెప్పలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో టీడీపీకి మళ్లీ అవకాశమిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనతో అన్నారని.. ఈ పదవిని సుజనాచౌదరికి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు కొందరు చె ప్పగా అలాంటిదేమీ లేదని మరి కొందరు పేర్కొన్నారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణం వల్ల ఏర్పడిన రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే సమయంలో బీజేపీకి కేటాయించాల్సి రావచ్చని చంద్రబాబు తెలిపారు. ఈ సీటు వారికి కేటాయించటం వల్ల గతంలో జరిగిన ఒప్పందం మేరకు కేటాయించాల్సిన మూడు శాసనమండ లి సీట్లలో కోత విధించవచ్చని తెలిపారు.
ముండే మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్‌ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముండే అందించిన సేవలు మరువలేనివని.. ఆయన మృతి దేశానికి తీరని లోటని సంతాపం తెలిపారు.