డోన్‌టౌన్/డోన్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారం చేపట్టడమే తరువాయి.. అసలు రంగు బయటపెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు అధికారంలో లేకపోవడంతో మౌనందాల్చిన ‘పచ్చ’దండు ఎన్నికలు ముగియగానే ఇతర పార్టీలపై తమ ప్రతాపం చూపుతోంది. తమకు అనుకూలంగా ఓటు వేయలేదని.. మరో పార్టీకి సహకరించారనే కారణాలతో బౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా టీడీపీ శ్రేణులు చెలరేగిపోతున్నారు.
తాజాగా ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంపీటీసీ అభ్యర్థులతో బేరాలకు దిగుతున్నారు. దారికి రాకపోతే కిడ్నాప్ చేసేందుకూ వెనుకాడటం లేదు. మంగళవారం ప్యాపిలి మండలంలో ఓ మహిళా ఎంపీటీసీని ఈ కోవలోనే కిడ్నాప్‌నకు యత్నించడం కలకలం రేపింది. డోన్ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభ్యునిగా ఎంపికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైనా ఆయన గెలుపును నిలువరించలేకపోయాయి. ప్రాదేశిక పోరులోనూ ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ పైచేయి సాధించింది.
ప్యాపిలి మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ఆర్‌సీపీ అత్యధికంగా 12 స్థానాల్లో గెలుపొందగా.. టీడీపీ 9 స్థానాలను దక్కించుకుంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానిక నాయకులు ప్యాపిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్యాపిలి ఎంపీటీసీ-2 స్థానంలో గెలుపొందిన అలివేలమ్మను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. ససేమిరా అనడంతో భయభ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న మండల జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి, అంకిరెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి తదితరులు ఆమెకు రక్షణ కల్పించారు.
అయినప్పటికీ ఓ పోలీసు అధికారి ప్రమేయంతో మంగళవారం అలివేలమ్మను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. రక్షణ పేరిట ఆమెతో పాటు కుటుంబ సభ్యులను సదరు పోలీసు అధికారి పత్తికొండ నియోజకవర్గానికి తన వాహనంలో తరలించారు. ఈ విషయమై వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆమెను ఇంటికి చేర్చారు. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.
టీడీపీ హైడ్రామా
Published Wed, May 21 2014 2:25 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement