రౌడీ రాజకీయం! | tdp poltical fight at jamiya maszid | Sakshi
Sakshi News home page

రౌడీ రాజకీయం!

Published Sat, Sep 13 2014 2:08 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

రౌడీ రాజకీయం! - Sakshi

రౌడీ రాజకీయం!

శుక్రవారం.. అది శ్రీకాకుళంలోని ప్రసిద్ధ జామియా మసీదు ప్రాంగణం.. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అదే సమయంలో అదే మతానికి చెందిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ప్రార్థనల పవిత్రతను సైతం పట్టించుకోకపోగా సాక్షాత్తు మతపెద్దలనే అడ్డుకొని ప్రార్థనకు భంగం కలిగించాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఒక యువకుడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. మసీదు కమిటీకి తమ వారినే ఎన్నుకోవాలన్నది ఆయన పంతం. అందుకే ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారైన, నేర చరిత్ర కలిగిన సదరు వ్యక్తి మరో రాజకీయ పార్టీకి చెందిన యువకుడిపై దాడికి తెగబడ్డాడు.మసీదు పవిత్రతను మంట గలిపాడు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పట్టణంలోని 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జామియా మసీదులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా జిలానీ అనే వ్యక్తి అక్కడికి వచ్చి మత పెద్దపైనా, మరో యువకుడిపైనా దౌర్జన్యానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదంతా మసీదు  కమిటీ ఎన్నిక నేపథ్యంలో జరిగిందని కొందరు చెబుతుం డగా, బాధితుడి సోదరుడు మాత్రం తమ సోదరుడు వైఎస్సార్‌సీపీ చెందిన వ్యక్తి కావడంతోనే టీడీపీ మద్దతుదారుగా ఉంటూ నేరచరిత్ర కలిగిన జిలానీ దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ మహ్మద్ అబ్దుల్ రఫీ అనే వ్యక్తి ఆరోపించారు.  
 
ఇదీ నేపథ్యం
జిల్లాలోనే ప్రముఖ మసీదుగా పేరుగాంచిన శ్రీకాకుళం జామియా మసీదు పాలక కమిటీ కొన్నాళ్ల క్రితం రద్దయింది. వక్ఫ్ బోర్డు అనుమతితో కొత్త కొత్త కమిటీని నియమించాల్సి ఉంటుంది. మసీదులో రెగ్యులర్‌గా ప్రార్థనలు చేస్తున్న సభ్యుల నుంచే పాలకవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. అయితే తమ వర్గీయులకే మసీదు బాధ్యతలు అప్పగించాలని టీడీపీకి చెందిన జిలానీ అనే వ్యక్తి కొన్నాళ్లగా పట్టుబడుతున్నాడు. తమకు స్థానిక ఎమ్మెల్యే అండదండలున్నాయని మాట వినకపోతే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్టు అబ్దుల్ షాజహాన్, తదితర పెద్దలు వాపోతున్నారు.
 
జిలానీ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని గతంలో అతడు చేసిన దురాగతాలపై పత్రికల్లో వార్తలు వచ్చాయని, బంద్ కూడా జరిగిందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రార్థనల్లో భాగంగా మత పెద్ద మెహతాబ్ ఆలం మౌలానా ప్రార్థన నిర్వహిస్తుండగా జిలానీ వచ్చి అడ్డుకున్నాడని, సుమారు 300 మంది సమక్షంలో అనరాని మాటలన్నాడని ముస్లిం పెద్దలు ఆరోపించారు. ఈ సందర్భంగా గొడవలొద్దన్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పట్టణాధ్యక్షుడు సిరాజుద్దీన్ (30)పై జిలానీ దౌర్జన్యానికి దిగాడు.
 
దీంతో ఆగ్రహం చెందిన ముస్లిం పెద్దలు జిలానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన సిరాజుద్దీన్‌ను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. అనంతరం ముస్లిం పెద్దలంతా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడ బైఠాయించారు. మసీదు ప్రాంగణంలో కొన్నాళ్ల నుంచి శాంతిభద్రతలు లోపించాయని, జిలానీ వంటి వీధి రౌడీలు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అతనిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. తనను జిలానీ భయపెట్టే ప్రయత్నం చేశాడని మత పెద్ద మౌలానా ఆరోపించారు.
 
ప్రభుత్వం మారిన తరువాతే..
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే మసీదులో వర్గపోరు మొదలైందని, నేరచరిత్ర కలిగిన జిలానీ కొన్నాళ్లుగా ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తున్నాడని సిరాజుద్దీన్ సోదరుడు మహ్మద్ అబ్దుల్ రఫీ ఆరోపించారు. ప్రార్థనలు జరుగుతుండగా మరో వ్యక్తి ఫోన్ చేసి జిలానీని రప్పించారని, వచ్చీ రావడంతోనే ప్రార్థనలను అడ్డుకొని కర్రలతో సిరాజుద్దీన్‌పై దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. మసీదు కార్యకలాపాల కు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదని తాము ఎంత కోరుకుంటున్నా కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా, రాష్ర్ట పెద్దల దృష్టికి తీసుకువెళ్లామని, పోలీసులకు ఫిర్యాదిచ్చామని రఫీ తెలిపారు.
 
కేసు నమోదు చేశాం:సీఐ
మసీదులో జరిగిన ఘటనపై సీఐ తాతారావును వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మసీదు కమిటీ ఎన్నికకు సం బంధించే గొడవలు తలెత్తినట్టు ఓ వర్గం చెబుతోందన్నారు. పార్టీలకు దీనికి సంబంధం లేద ని తమ విచారణలో తేలిందన్నారు. బాధ్యులపై చర్యలు చేపడతామని, భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. సిరాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిలానీతో పాటు అతనికి సహకరించిన కరీముల్లాఖాన్, అన్వర్‌లపై కేసు నమోదు చేశామని తెలిపారు.
 
‘ముస్లింలంతా శాంతియుతంగా ఉండాలి’
రిమ్స్‌క్యాంపస్: జిల్లాలోని ముస్లింలంతా అందరితో సోదరభావంతో ఉండాలని జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ ప్రదాన కార్యదర్శి మహిబుల్లా ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. జామియా మసీదుకు గతంలో సహాయ కార్యదర్శిగాను, ఉపాధ్యక్షుడిగాను పనిచేశానని పేర్కొన్నారు.

 తన తరువాత ఈ ఏడాది జూన్ 28వ తేదీ వరకు మాజీ కౌన్సిలర్ రఫీ మసీదుకు అధ్యక్షుడిగా కొనసాగారని, అరుుతే అకౌంటు అప్పజెప్పకపోవటం, వక్ఫ్‌బోర్డు చట్ట ప్రకారం నడపకపోవటం వల్ల రాష్ట్ర  వక్ఫ్‌బోర్డు ఆయన్ని తప్పించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు వంద మంది ముస్లింలకు రఫీ షెల్టరు ఇచ్చి పోషిస్తున్నారని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చిన ముస్లింల చిరునామాలు, వారితో ఉన్న సం బంధాల గురించి అడిగి తెలుసుకున్నా మన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement