తాడోపేడో!
తాడోపేడో!
Published Wed, Feb 26 2014 3:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
టీడీపీ అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు అసంతృప్త నేతలు సిద్ధమవుతున్నారు. ఐదేళ్లుగా కష్టపడిన వారికి కాకుండా ఎన్నికల వేళ డబ్బుతో ముడిపెట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ మేరకు జిల్లాలో జరిగే ‘ప్రజా గర్జన’కు బుధవారం వస్తున్న అధినేత ముందు తమ ఆవేదన వెళ్లగక్కాలన్న ఆత్రుతతో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో బాహాటంగా తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే నిలదీయాలని యోచిస్తున్నారు. డీవీజీ శంకరరావు, బొబ్బిలి చిరంజీవులు, పడాల అరుణ ...ఇలా ఒక్కొక్కరు చెప్పుకుని పోతే చాంతాడంత జాబితా కనిపిస్తోంది. వీరంతా అధినేతకు ఎలాంటి సవాల్ విసురుతారో చూడాలి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :అరకు ఎంపీ టిక్కెట్ వస్తుందన్న ఆశతో పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుకు ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి పోటీ చేస్తారని చంద్రబాబు తొలుత ప్రకటించగా, ఆమె కాదనడంతో శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటించాలని, పార్టీ నేతలను కలుసుకోవాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచనప్రాయంగా ఆదేశించారు. దీంతో ఆమె జోరు పెంచారు. ఈ క్రమంలో పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన డీవీజీ శంకరరావు తీవ్ర నిరాశతో ఉన్నారు. రాజధాని వెళ్లి, అధినేతను కలిసి తేల్చుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈలోపే చంద్రబాబు ప్రజాగర్జనలో పాల్గొనేందుకు బుధవారం జిల్లాకు వస్తుండడంతో ఇక్కడే తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ పడిన కష్టానికి ఇదేనా ఫలితం అని ప్రశ్నించాలని యోచిస్తున్నారు.
సొమ్ములే కే...చిరంజీవులకు చెక్
ఇదే పరిస్థితిలో పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు ఉన్నారు. డబ్బు ఉన్నోడికే టిక్కెట్ అని తేల్చి చేప్పేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా నిరాశ చెందకుండా పార్టీ కోసం పని చేస్తూ.. వస్తున్నా.. ఆర్థిక బలంతో ముడిపెట్టి పక్కకు నెట్టేయడాన్ని చిరంజీవులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించే అవకాశం ఉంది. అధిష్టానాన్ని శాసించే స్థాయిలో లేకపోయినా ఎన్నికల్లో ప్రభావం చూపగల సత్తా తనకుందని పరోక్షంగా చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవులతో పాటు ఆయన అనుచరులు కూడా అధినేత ముందు గళం విప్పే అవకాశం ఉంది.
ఆగ్రహంతో అరుణ
మాజీ మంత్రి పడాల అరుణ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీని ముందుకు నడిపించిన అరుణకు ఈసారి మొండిచేయి ఎదురవుతోంది. ఇప్పటికే గజపతినగరం టిక్కెట్‌ను కొండపల్లి అప్పలనాయుడుకి ఇస్తున్నట్టు అధినేత సంకేతాలు ఇచ్చారు. దీంతో కొండపల్లి జోరు పెంచారు. ఈ నిర్ణయం అరుణకు మింగుడు పడడం లేదు. ఐదేళ్లుగా పార్టీ భారం మోసిన తనను కాదని ఇటీవల నియో జకవర్గానికి వచ్చిన నాయకుడికి టిక్కెట్ ఇవ్వడమేమిటన్న ఆవేదనతో ఉన్నారు.హైదరాబాద్ వెళ్లి తన గోడు వ్యక్తం చేయాలని భావించారు. కానీ ఈలోపే చంద్రబాబు జిల్లాకు వస్తుండడంతో ఏదొకటి ఇక్కడే తేల్చుకోవాలనే యోచనలో ఉన్నారు.
కొత్తవారికిస్తే మా గతేంటి?
ఇదే తరహాలో విజయనగరం నియోజకవర్గ నాయకులు కూడా తమ ఆవేదన వెళ్లగక్కే అవకాశం ఉంది. పార్టీకి వెన్నంటే ఉండి, కష్టనష్టాలు చవి చూసిన తమని కాదని కొత్తగా వచ్చే నేతకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అశోక్‌ను కాదంటే తమను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలని ఇప్పటికే ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు వెంకట నర్సింగరావు తదితరులు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇక, కొత్త నేత రాక నేపథ్యంలో ప్రసాదుల రామకృష్ణ తమ అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. ఆ నేతకు ప్రాధాన్యం ఇస్తే ఏదొక నిర్ణయం తీసుకో వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాంతాండంతా ఆశావహుల జాబితా ఉన్నా తమను కాదని పార్టీలు మారే వ్యక్తిని, వేరొక జిల్లాకు చెందిన నేతను ఆలోచించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సామాజిక వర్గం ఆదారంగా టిక్కెట్ ఇవ్వాలని, అది కూడా పార్టీ కోసం పనిచేసే వారికే కట్టబెట్టాలని పట్టుబట్టే అవకాశం ఉంది. చెప్పాలంటే అధినేత ముందు పెద్ద పంచాయతీయే జరగవచ్చు. అయితే, ఇవన్నీ ముందే తెలిసిన అధినేత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
Advertisement
Advertisement