
రాకరాక వచ్చింది.. మాకేంటి..?
రాజ్యసభ ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్యేలకు పంట పండిస్తోందట. గతంలో ఎప్పుడో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. మధ్యలో అన్ని ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యేలెవరూ ఓటు వేసే అవకాశం రాలేదు. ఈసారి ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు బరిలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యేలందరినీ పలకరిస్తున్నారు.
టీడీపీ నుంచి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఒక రికి సుదీర్ఘ కాలం నిరీక్షించిన తర్వాత పార్టీ టికెట్ దక్కింది. మరొకరికి ఊహించని విధంగా అవకాశం వచ్చింది. త్వరలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న కాంగ్రెస్ నేత ఏడో అభ్యర్థిగా రంగంలో నిలవడంతో టీడీపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైందట. మరోవైపు ప్రాంతీయ ఉద్యమాల ప్రభావం, ఒక ప్రాంతం వారు ఇంకొకరు చెబితే వినే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేలను ఎలాగైనా ప్రసన్నం చేసుకోండని నాయకత్వం ఆదేశించిందట.
దాంతో వారు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నప్పుడు.. మేం ఓట్లు వేస్తే మీరేమో ఎంపీలవుతారు.. త్వరలో ఎన్నికలొస్తున్నాయి.. మేం మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తామో లేదో అనుమానమే.. ఖర్చులుంటాయి కదా.. అని ఒక తమ్ముడు నిర్మొహమాటంగా చెప్పేశాడట. ఎన్నికలను ఎదుర్కోడానికి ఎంతో కొంత ఇవ్వండి.. అవతల ఇండిపెండెంట్ కూడా ఫోన్ చేస్తున్నారు అని కూడా అన్నాడట. మరి కొందరూ ఇదే మాట అంటున్నారట. దీంతో చేసేది లేక ఆ అభ్యర్థులు ‘తాయిలాలతో’ రాజీకొస్తున్నారట.