పిల్లలంటే అలుసా..?
♦ విద్యార్థుల వైద్య పరీక్షలపై టీడీపీ సర్కార్ నిర్లక్ష్య దొరణి
♦ సంబంధిత సిబ్బందికి నియామక ఉత్తర్వులు ఇవ్వని వైనం
♦ సిబ్బందిని నియమించి ఏడాది కావస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
♦ ప్రతీ నెలా వైద్య పరీక్షలు నిర్వహిస్తే వ్యాధుల
♦ బారిన పడకుండా పిల్లల్ని కాపాడే అవకాశం
విజయనగరం ఫోర్ట్ : బాలలు.. భావి భారత పౌరులు. వారే దేశానికి ఆస్తి, వారే దేశ మేధా శక్తి. ఈ వ్యాక్యాలు అన్నీ అవసరం వచ్చినపుడల్లా సర్కారు పెద్దలు వల్లే వేసే మాటలు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి వారి ఆరోగ్యం గురించి పట్టించుకునే నాథుడే ఉండడు. అసలు వారిని గుర్తుంచుకునే తీరిక ప్రభుత్వ పెద్దలకు అసలు ఉండదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే జిల్లాలోని పిల్లలకు ప్రతీ నెలా వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం.
నిర్లక్ష్య దోరణిలో సర్కారు..
పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలి. దానికోసం రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు పిల్లలకు వైద్య సేవలందించేందుకు పలువురు అభ్యర్థుల్ని ఎంపిక చేశారు ఉన్నతాధికారులు. కానీ వారికి ఇప్పటికీ నియామక పత్రాలు అందించ లేదు. దీంతో ఏడాది కావస్తున్నా వారు ఎదురుచూపులకే పరిమితమయ్యారు. పిల్లల ఆరోగ్యాలను గాలికొదిలేశారు ప్రభుత్వ పెద్దలు. అదే వారు సేవలందించి ఉంటే శనివారం పట్టణంలో జరిగిన సంఘటనలు లాంటివి పునరావృతం అయ్యేవి కావేమో. ఆర్‌బీఎస్‌కే కింద అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలి.
నియామకాలు చేపట్టి.. ఉత్తర్వులు ఇవ్వని వైనం..
ఆర్‌బీఎస్‌కే పథకాన్ని అమలు చేసేందుకు సిబ్బంది నియామక ప్రక్రియను వైద్య ఆరోగ్య అధికారులు ఏడాది క్రితమే చేపట్టారు. కానీ నేటి వరకు నియామక పత్రాలు ఇవ్వలేదు. 2016లో జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి జూలై నెలాఖరుకు ఎంపికలను పూర్తి చేసి జాబితాను గోడకు అతికించారు. ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఉద్యోగం వచ్చినట్టా, రానట్టా అన్న సందేహంలో వారు ఉన్నారు.
సేవలందడం లేదు..
జిల్లాలో 48 మంది వైద్యులు, 24 మంది ఫార్మసిస్టులను, 24 మంది ఏఎన్‌ఎంలను ఆర్‌బీఎస్‌ఏ కింద ఎంపిక చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఒక ఫార్మసిస్టు, ఒక ఏఎన్‌ఎం చొప్పన పాఠశాలలు, హాస్టళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలి. అక్కడ వ్యాధి నిర్ధారణ అయిన వారిని సీహెచ్‌సీలకు గానీ, రిఫర్ ఆస్పత్రులకు గానీ పంపించాలి. ఈ పక్రియ జరగలాంటే సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందించాలి. అది ఇంతవరకు జరగలేదు. చంద్రబాబు సర్కార్ ఎప్పుడు ఇస్తుందో కూడ తెలియని పరిస్థితి నెలకొంది. మరో వైపు విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు అవుతుంది. ఇంతవరకు పిల్లలకు వైద్య పరీక్షలు జరగ లేదు. చాలా మంది విద్యార్థులు వివిధ వ్యాధుల బారిన పడి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.