ఆటోలో ప్రసవించిన గిరిజన మహిళ(ఫైల్)
ఆపదలో ఆదుకునే సంజీవినిపై సర్కారు కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టుంది. ఎన్ని పేర్లు మార్చినా... ఆ వాహనం నడవగానే అందరి మదిలోతలచేది ఆ మహానేతే. అందుకే కాబోలు ఎలాగైనా దానిని నిర్వీర్యం చేయాలనే కుట్ర దాగున్నట్టుంది. అవసరానికి వాహనాలు అందుబాటులో ఉండట్లేదు. అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే వారిపై కక్షసాధింపు ఎక్కువవుతోంది.
పార్వతీపురం : మహానేత మరణంతో 108 వాహనాలను సర్కారు పట్టించుకోవడం మానేసింది. ప్రతిపక్షాల పోరాటంతో ప్రభుత్వం అరకొర నిధులు కేటాయిస్తూ మొక్కుబడిగా నిర్వహిస్తోంది. 2017 డిసెంబర్ 13నుంచి జీవీకే నుంచి భారత వికాస్‌గ్రూప్ దీని బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వాహన సేవలు రోగులకు దూరమైపోతున్నాయి. చాలా చోట్ల అంబులెన్సులు లేకపోవడం, కొన్ని చోట్ల మరమ్మతులతో మూలకు చేరడం, కొన్ని చోట్ల డీజిల్ కూడా వేయలేకపోవడంతో
వాటి సేవలు మృగ్యమైపోతున్నాయి. దీనికి తోడు అందులో పనిచేసే సిబ్బందికి సక్రమంగా వేతనాలు అందివ్వక ఇబ్బందులు పెడుతోంది. ఇటీవల 108 ఉద్యోగులు మెరుపు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం, బీవీజీ యాజమాన్యం ఉద్యోగులతో చర్చలు జరిపి తాత్కాలికంగా సమ్మెను నిలిపివేశారు. నాటి చర్చల్లో ఇచ్చిన హామీలను మాత్రం నేటికీ నెరవేర్చలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా అందని వేతనాలు
ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. నెలకు ఒక్కొక్కరికి రూ.12,500లు బీవీజీ ఇవ్వాలి. ఈ వేతనాన్ని రెండు నెలలుగా ఇవ్వలేదు. అలాగే 108 వాహన సేవలను గుర్తిస్తూ సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహంగా ఇస్తామన్న రూ. 4వేలు కూడా మే నెలనుంచి చెల్లించలేదు. బీవీజీ సంస్థ 5శాతం ఇంక్రిమెంట్ ఇస్తామన్నా దానికీ దిక్కులేదు. ఇక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఉద్యోగుల్లో వేతన వ్యత్యాసాలను సరిచేయడం లేదు. ఒకరికి రూ. 12,500లు వేతనం వస్తే, మరొకరికి రూ. 9,500 వస్తుంది. ఈ వ్యత్యాసాలను సరిచేయాలని, సెలవు రోజులకు కూడా వేతనం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
సక్రమంగా అందని వాహనసేవలు
పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో రెండు అంబులెన్సులు ఉన్నప్పటికీ వాటి ద్వారా అత్యవసర కేసులను విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు తరలించడం లేదు. ఐఎఫ్‌టీ(ఇంటర్‌ఫెసిలిటీ ట్రాన్స్‌పోర్టు) పేరుతో 108 వాహనాల్లోనే అత్యవసర కేసులను విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడకు వెళ్లి రావాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. ఈ లోపు పార్వతీపురం మండలంలో వివిధ గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితిలో 108కు ఫోన్‌చేస్తే వాహనం అందుబాటులోకి రావడం లేదు. ఇతర మండలాల వాహనాలను పంపించాలని యాజమాన్యం ప్రయత్నించినప్పటికీ అవీ వేరే కేసులతో బిజీ కావడంతో రాలేకపోతున్నారు.
ఇటీవల లిడికివలస గ్రామానికి చెందిన తాడంగి వరలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్ చేశారు. అప్పటికే వాహనం అత్యవసర పరిస్థితిలో ఒక రోగిని విజయనగరం తీసుకుని వెళ్లింది. ఎప్పటికీ వాహనం రాకపోవడంతో ఆమెను ఆటోలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలో తాళ్లబురిడి వద్దకు వచ్చేసరికి ఆటోలోనే ప్రసవం జరిగింది. అదృష్టవశాత్తూ సహజ ప్రసవం జరిగి తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక వేళ జరగరాని నష్టం జరిగితే ఎవరు బా«ధ్యత వహిస్తారన్నది ప్రశ్న.
కుదించిన ఫ్యూయల్ కార్డు కెపాసిటీ
ప్రతీ 108 వాహన ఫైలెట్‌కు నెలవారీ ఫ్యూయల్ కార్డును సంస్థ ఇస్తుంది. ఈ కార్డుద్వారా గతంలో రోజుకు రూ.2,500 వరకు ఆయిల్ కొట్టుకొనే వెసులుబాటును కల్పించారు. అయితే ప్రస్తుతం బీవీజీ యాజమాన్యం రూ.500లు తగ్గించి కార్డు విలువ రూ. 2వేలు చేసింది. ఐఎఫ్‌టీ కేసులను విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు తీసుకువెళ్లి తిరిగి వచ్చేసరికి వాహనంలో ఆయిల్ పూర్తిగా అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఫోన్ కాల్స్ వచ్చినా వాహనం తీసుకెళ్లలేరు. ఇలా 108 సేవలు రోగులకు దూరమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment