టీడీపీ హయాంలో వ్యవస్థలు విచ్ఛిన్నం | Botsa Satyanarayana Criticizes Chandrababu & TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో వ్యవస్థలు విచ్ఛిన్నం

Published Mon, Aug 6 2018 11:20 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

Botsa Satyanarayana Criticizes Chandrababu & TDP Leaders - Sakshi

మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

చీపురుపల్లి  విజయనగరం : నాలుగేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని గాడి తప్పిన వ్యవస్థను సరి చేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఎంతైనా అవసరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని రాధామాధవ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఆ పార్టీ గుర్ల మండల బూత్‌ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం టక్కు, టమార విద్యలతో ప్రజలను మభ్యపెట్టి దుర్మార్గ పరిపాలన సాగించిందన్నారు.

గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయాలంటే కచ్చితంగా 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందాలని సూచించారు. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే హయాంలో నిష్పక్ష పాలన, చట్టానికి లోబడి, న్యాయబద్దంగా పరిపాలన అందించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీరు, మట్టిని కూడా అమ్ముకుని దోపిడి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం మిగిలిన కొద్ది నెలల్లో కూడా ఇష్టారాజ్యంగా దోపిడి చేసి రాబోయే ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిççస్తున్నట్టు చెప్పారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు బూత్‌ కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. బూత్‌ కమిటీలు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయన్నారు.  నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో బూత్‌ కమిటీలు ఐకమత్యంగా  రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. 

ఓటర్ల తొలగింపులపై అప్రమత్తమవ్వాలి..

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై ప్రతీ బూత్‌ కమిటీ సభ్యుడు అప్రమత్తం కావాలని సూచించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఓటర్లను తొలగించారని అందుకనే ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలు చూసి ఓటర్లు పేర్లు లేకపోతే అప్పుడేం చేయలేమని స్పష్టం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి చక్కని స్పందన లభిస్తోందన్నారు.  ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 

ప్రతీ ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డిని అనుకోవాలి..

పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతీ బూత్‌ కమిటీ సభ్యుడు జగన్‌మోహన్‌రెడ్డిని అనుకుని తానే ముఖ్యమంత్రిని అవుతానని కసితో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులను కష్టపడి గెలిపిస్తే ఆ తరువాత పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఓట్లుపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

ఓటర్ల జాబితాలు, ఓటర్లపై ప్రత్యేక దృష్టి బూత్‌ కమిటీలు పెట్టాలని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు.  ఓటరు నమోదు కార్యక్రమాన్ని బూత్‌ కమిటీలు దగ్గరుండి చేయించాలన్నారు.  నాలుగున్నర సంవత్సరాల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఇదే విషయాన్ని చర్చ జరపాలని సూచించారు. జిల్లాకు హామీ ఇచ్చిన మెడికల్‌ కళాశాల, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, అంబల్ల శ్రీరాములు, నారాయణమూర్తిరాజు, గుర్ల మండల పార్టీ అధ్యక్షుడు శీర అప్పలనాయుడు, మండల పార్టీ నాయకులు పొట్నూరు సన్యాశినాయుడు, వరదా ఈశ్వరరావు, తోట తిరుపతిరావు, అట్టాడ లక్షుంనాయుడు, జమ్ము సన్యాశినాయుడు, కెంగువ మధు, రాగోలు రామకృష్ణ, బూర్లె శ్రీను, బోల్ల సుబ్రమణ్యం, రవిబాబు, అట్టాడ రామకృష్ణ, కేశవరావు, పల్లి కృష్ణ, మంత్రి వెంకటరమణ, చీపురుపల్లి మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇపిలి తిరుమల, బెల్లాన త్రినాద్, గరివిడి మండల నాయకులు పొన్నాడ వెంకటరమణ, మీసాల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement