టీడీపీ షాక్
- కంగుతిన్న గంటా బృందం
- ఉత్తరంలో పంచకర్ల బిత్తరపాటు
- రెండు ఎంపీ స్థానాలూ కమలానికే
- అడక్కుండానే అరకు
- కత్తులు దూస్తున్న తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పొత్తులతో జిల్లా టీడీపీ చిత్తయింది. రెండు ఎంపీ, రెండు ఎంఎల్‌ఏ సీట్లు బీజేపీకి దక్కడంతో టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. ఎన్నో ఆశలతో దేశం తీర్ధం పుచ్చుకొన్న గంటా బృందం కంగు తింది. ఇప్పటికే ఈ మాజీ మంత్రిని నమ్మి నట్టేటమునిగామని సహచర శాసనసభ్యులు గగ్గోలు పెడుతున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా బలపడాల్సిన టీడీపీ అందుకు విరుద్ధంగా గందరగోళంలో పడిపోయింది. తాము గెలవని స్ధానాలు, బలం లేని స్ధానాలు తమకు కట్టబెట్టి టీడీపీ మిత్రద్రోహానికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా అరకు ఎంపీ, పాడేరు ఎంఎల్‌ఏ స్ధానాల విషయంలో ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. విశాఖతో పాటు ఊహించని విధంగా అరకు ఎంపీ స్ధానం, విశాఖ ఉత్తరతో పాటు పాడేరు ఎంఎల్‌ఏ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.విశాఖ ఎంపీ సీటు పోవడంతో పార్లమెంటుకు వెళ్లాలనే గంటా ఆశలకు గండిపడింది. ఉత్తర నియోజక వర్గంపై కోటి ఆశలతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తిని వదిలి పంచకర్లకు సీటే లేకుండా పోయింది.
చింతలపూడి వెంకట్రామయ్య, కన్నబాబులకు సీట్లు లేవని ఇప్పటికే తేలిపోయింది. ఈ పరిణామాలు టీడీపీలో ముఖ్యంగా గంటా శిబిరంలో కల్లోలాన్నే రేపాయి. బీజేపీతో పొత్తు కుదరడంతో ఇంతకాలం సీట్లపై ఉన్న చిరు ఆశలు కూడా ఆవిరైపోవడం గంటా బృందంలో చిచ్చురేపింది. కన్నబాబు, పంచకర్ల తదితరులు బీజేపీతో పొత్తు కుదిరిన వెంటనే గంటాకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు టికె ట్‌లు ఇప్పించలేనప్పుడు నమ్మించి పార్టీ మార్పించడం, వెంటతిప్పుకోవడం ఎందుకని వీరు నిలదీసినటు తెలిసింది.
టీడీపీ లో టికెట్‌లు రావనే అభిప్రాయానికి వచ్చిన వీరు ఆదివారం నాడే హడావుడిగా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. తొందరపడి గంటా ట్రాప్‌లో పడి నష్టపోయామని, కొద్దిరోజులు ఆగివుంటే పరిస్ధితి మరో విధంగా వుండేదని గంటా బృందం శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గంటా ఒంటరైపోయారు. సాటి శానసభ్యులకు టికెట్ హామీలు ఇప్పించలేకపోయిన గంటా తన పరిస్ధితి ఏమిటో తెలియక నిర్వేదంలో పడిపోయారని తెలిసింది.
కాగా నగరంలోనూ ఏజెన్సీలో టీడీపీ శ్రేణులు పొత్తుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. బహిరంగంగా నిరసనలు వ్యక్తంచేశాయి. నగరంలోని పార్టీ కార్యలయం వద్ద భారీగా టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. పొత్తులతో తమకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం తీరును దుయ్యబట్టారు.
ఏజెన్సీలో నిరసన సెగలు
పాడేరు : బీజేపీతో పొత్తు మేరకు ఏజెన్సీలో కీలకమైన పాడేరు అసెంబ్లీ సెగ్మెంటును ఆ పార్టీకి కేటాయించారనే ప్రచారంతో స్థానిక టీడీపీ నేతల్లో అలజడి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ సీపీఐతో పొత్తుతో డీలా పడిన టీడీపీ నాయకులు ప్రస్తుత ఊహాగానాలను జీర్ణించుకోలేకపోతున్నారు. 2009వూ సీపీఐ ఓటమితో టీడీపీ నేతలంతా పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో విస్తృతం చేశారు. ఐదేళ్లుగా పాడేరు టికెట్‌ను మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ నేతలు బొర్రానాగరాజు, కొట్టగుల్లి సుబ్బారావు, ఎంవీఎస్ ప్రసాద్‌లు ఆశిస్తున్నారు.
వీరిలో ఎవరో ఒకరికి టీడీపీ సీటు ఖాయమని భావిస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు మాట వారందర్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ కూడా ఈ టికెట్‌ను ఆశించారు. ఆమె కూడా నిరాశకు గురవుతున్నారు. నియోజక వర్గంలోని టీడీపీ కేడర్ కూడా ఈ పొత్తును జీర్ణించుకోలేకపోతోంది. పొత్తు విషయం ఖరారయితే.. వెంటనే పార్టీనీ వీడేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అలాగే అధినేతతో తాడో పేడో తేల్చుకోవడానికి సీనియర్ నేతలంతా సిద్ధమవుతున్నారు.