‘దేశం’ అయోమయం
Published Wed, Oct 30 2013 4:21 AM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM
సాక్షి, తిరుపతి: జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా మా రింది. పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఇన్‌చార్జ్‌లను నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఎవరితో కలసి పనిచేయాలో తెలియక తికమకపడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా లేకపోవడంతో చిన్నచిన్న కార్యక్రమాలను కూడా మదనపల్లె నుంచి వచ్చి చేపడుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో చదలవాడ కృష్ణమూర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయినా ఆయన్ను పార్టీ కార్యకర్తలు విశ్వసించడం లేదు.
ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని నాయకులు అంటున్నారు. ఇటీవల సోనియాకు సమాధి కట్టిన ఘటనలో అనేకమంది పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసినా ఆయన పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పలమనేరులో అమరనాథరెడ్డి స్థానా న్ని భర్తీ చేసే బాధ్యతను చంద్రబాబు రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్‌కు ఇచ్చినట్లు తెలిసింది. ఆయన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. చంద్రబాబునాయుడు సూచన మేరకు రెడ్డెప్పరెడ్డి సోదరుడు విజయభాస్కర్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇంతవరకు పార్టీకి ఇన్‌చార్జ్ లేరు.
తెలుగుదేశానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి మదనపల్లె నుంచి మల్లికార్జుననాయుడు రావాల్సి వస్తోంది. ఆయన కూడా పార్టీ కార్యకర్తలను కలుసుకుని సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లె గురించి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్‌ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఆయన ఆసక్తి కనబరచకపోవడంతో మదనపల్లె నుంచి తెలుగుదేశం నాయకులు శివకుమార్ లేదా జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు కొండా నరేంద్రను తీసుకురావాలని జిల్లా నాయకులు సూచించినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement