ఇవ్వాల్సింది.. ఇచ్చేయండి...!
‘సార్! నేను... ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్‌కు బదిలీ అవుతుందంటున్నారు. మీరు మాకు కారు పెట్టారు కదా! దానికి సంబంధించిన నాలుగు నెలల బిల్లు.. సార్ పెట్టేశారట! మీకు తరువాత అవుతాయంటున్నారు. దీనికి సంబంధించి సార్‌కు ఇవ్వాల్సిన పర్సంటే జీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా! సార్‌కు బదిలీ అయిపోతే వచ్చే వారెవరో తీసుకుంటారు.. కానీ ఈయనకు అందదుగా! అందుకే మంగళవారం వచ్చి మిమ్మల్ని కలవమన్నారు. లేకుంటే నన్ను ఎక్కడికైనా రమ్మంటే వస్తాను... ఏమంటారు? సరేనా?’ అని ఒక కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగి నుంచి ఒక వ్యక్తికి వెళ్లిన ఫోన్ సమాచారం ఇది. జిల్లాలో ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యాలయూల కింది స్థాయి సిబ్బంది నుంచి వేర్వేరు వ్యక్తులకు వెళ్తున్న ఫోన్ల సమాచారం తంతు ఇది! వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం కంటోన్మెంట్ : ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో జిల్లాలో బదిలీలు తప్పవన్న అధికారుల్లో చాలా మంది పై విధంగా తమకు వివిధ పద్దుల కింద అందాల్సిన పర్సంటేజీల్లో ముందుగానే తమ వాటాలను తీసేసుకునేందుకు కింది స్థాయి సిబ్బందితో ఫోన్లు చేయిస్తున్నారు. ఈ విషయూన్ని జిల్లాలోని ఆయా పద్దులను చెల్లించే వారే చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ బిల్లులను పెట్టేందుకు సంతకాలు చేయాలంటే నెలల తరబడి పెండింగ్ పెట్టే వారు కూడా బదిలీల జీఓ వచ్చేసరికి అప్రమత్తమయ్యూరు. ఎన్ని నెలల బిల్లులు పెండింగ్ ఉంది? ఎప్పటిలోగా చేయాలి? అన్న అంశాలను బేరీజు వేసుకుని వాటికి వెంటనే బిల్లు పెట్టేస్తున్నారంట! బిల్లులు చెల్లించేందుకు కొన్ని శాఖల్లో మాత్రమే ఇప్పుడు ఆన్‌లైన్ విధానం అందుబాటులో ఉంది. కొన్నింటికి ఇంకా పాత పద్ధతిలోనే చెక్కులు అందిస్తున్నారు. చెక్కులను కూడా కొంత మంది సిబ్బంది తమ వద్ద ఉంచుకుని రావాల్సిన పర్సంటేజీలను తమకు అందేలా దిగువ స్థాయి సిబ్బందితో చేయించుకుంటున్నారు.
కొన్ని ఆన్‌లైన్ ఖాతాలైతే వారి వద్ద నుంచి ముందుగానే ఒప్పందాలు చేసుకుని నగదును అందుకున్న తరువాత వారికి బిల్లు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పర్సంటేజీలో వాటా తగ్గించమంటే మాత్రం ససేమిరా అంటున్నారని ఒక కారు యజమాని పేర్కొన్నారు. జిల్లాలో బదిలీలకు మార్గదర్శకాలు విడుదలైన నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. పలు శాఖ ల్లో అధికారులు, ఇతర ఉద్యోగులు తమ వాటాలు తమకు దక్కాల్సిందేనంటున్నారనీ, ఇదేం బదిలీల గోలని కొందరు కింది స్థాయి ఉద్యోగు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అధికారులు తనకు బదిలీ తప్పదని తెలిసిన తరువాత వేగంగా పర్సంటేజీల పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు, సిబ్బందికి కాసులే కాసులని పలువురు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే నచ్చిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు అయ్యే ఖర్చును ఈ పర్సంటేజీల ద్వారానే పొందాలని కొందరు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో సాధారణంగా ఇచ్చే పర్సంటేజీల కంటే ఎక్కువ మొత్తం పొందాలని ఆశిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగేందుకు అవకాశం వస్తే ఎటువంటి ఖర్చు ఉండదు. అలా కాకుండా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేస్తే కోరుకున్న ప్రదేశం కావాలంటే ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేయూల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పర్సంటేజీలు ముందుగానే వసూలు చేసుకుంటే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారని సమాచారం.