మాఫీ చేయండి.. లేదా ఇక ఓట్లేయం
- అధికారంలోకి రాగానే మారిపోతారా?
- వ్యవసాయ రుణాలపై నారా లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
పుంగనూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్‌కు చిత్తూరు జిల్లా పుంగనూరులో మహిళలు తెగేసి చెప్పారు. మంగళవారం పుంగనూరులో లోకేశ్ పర్యటించారు. ఉదయం 11 గంటలకు పుంగనూరుకు చేరుకోవాల్సిన లోకేశ్ మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు. పర్యటన ప్రారంభమైన తర్వాత పలు సమస్యలపై మహిళలు ఆయన్ను నిలదీశారు.
డ్వాక్రా, రైతు రుణాలను షరతులు లేకుండా మాఫీ చేయాలని, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.‘‘పదినెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు. అధికారంలోకి రాగానే ఇలా మారిపోతారా? ఓట్లేయించుకుని మోసం చేస్తారా? పూర్తిగా రుణమాఫీ చేయకపోతే ఇక మీకు ఓట్లు వేయం’’ అంటూ మహిళలు లోకేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో విస్తుపోయిన లోకేశ్.. మహిళలను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనిపై స్థానిక నేతలపై లోకేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పట్టిసీమను పూర్తిచేస్తాం..:ఎవరేమనుకున్నా పట్టిసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం పూర్తి చేస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. పుంగనూరు రోడ్డుషోలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా నీరు అవసరమన్నారు.