తోకపత్రిక దొంగ సర్వే | TDP Yellow Media Fake Survey | Sakshi
Sakshi News home page

తోకపత్రిక దొంగ సర్వే

Published Tue, Apr 2 2019 1:41 AM | Last Updated on Tue, Apr 2 2019 11:34 AM

TDP Yellow Media Fake Survey - Sakshi

తాము ఏపీలో సర్వే నిర్వహించలేదని, మీడియాలో వచ్చిందంతా అబద్ధమని ట్వీట్‌లో పేర్కొన్న లోక్‌నీతి –సీఎస్‌డీఎస్‌

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ ఎల్లో మీడియా ఎన్నికల సర్వే కుతంత్రం బెడిసికొట్టింది. ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు పన్నిన పన్నాగం అభాసుపాలైంది. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ప్రముఖ సంస్థ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వేలో వెల్లడైనట్లు ఎల్లో మీడియా ప్రచురించిన సర్వే బూటకమని తేటతెల్లమైంది. అసలు తాము ఎలాంటి సర్వే చేయలేదని ఆ సంస్థ స్పష్టం చేయడం.. తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చంద్రబాబు బాగోతం ప్రజలకు తెలిసివచ్చింది. మరోవైపు.. దొంగ సర్వేతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిన టీడీపీ, దాని తోక పత్రిక ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు పలువురు ఫిర్యాదులు చేశారు.

ఓటర్లను ప్రభావితం చేసేందుకే దొంగ సర్వే
ఎన్నికల్లో ఓటమి ఖాయమని స్పష్టమవుతుండటంతో చంద్రబాబు, టీడీపీ ఎల్లో సిండికేట్‌ బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో టీడీపీకి రెండు మూడుకు మించి ఎంపీ స్థానాలు వచ్చే అవకాశాల్లేవని, ఎమ్మెల్యే సీట్లు అయితే 40లోపేనని పలు జాతీయ చానళ్ల సర్వేల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దాంతో చంద్రబాబు, టీడీపీ మీడియా చివరి ప్రయత్నంగా ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు ఓ దొంగ సర్వే పేరుతో కుతంత్రానికి పాల్పడింది. టీడీపీ భారీ ఆధిక్యంతో ఎన్నికల్లో గెలవనుందని ఓ బోగస్‌ సర్వేను ప్రచురించి ప్రచారంలోకి తీసుకువచ్చి ఓటర్లను ప్రభావితం చేయొచ్చని చంద్రబాబు భావించారు. వెంటనే కాకి లెక్కలతో ఓ సర్వేను వండివార్చారు. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ఆ సర్వేను రూపొందించారు. ఈ సర్వేను ఓ సంస్థ పేరుతో విడుదల చేయాలనుకుని జాతీయస్థాయిలో ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ పేరును ఆ సర్వేకు ముసుగు వేశారు. అనంతరం ఆ సంస్థ పేరుతో సోమవారం ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ వెంటనే టీడీపీ వెబ్‌సైట్లు ఆ సర్వేకు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాయి. అంతా తాము అనుకున్నట్లు అయ్యిందని ఎల్లో బ్యాచ్‌ సంబరపడింది. కానీ కథ అడ్డం తిరిగింది.

మండిపడ్డ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌
సర్వేను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కొన్ని గంటల్లోనే లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ తీవ్రంగా స్పందించింది. అసలు తాము ఏపీలో ఎలాంటి సర్వే చేయనేలేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఇ.వెంకటేశన్‌ ట్వీట్‌ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ చానళ్లు, ఇతర వెబ్‌సైట్లు ప్రచారంలోకి తీసుకువచ్చిన ఆ సర్వేతో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత కాసేపటికే ఆ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అదే విషయాన్ని వెల్లడించింది.  

కఠిన చర్యలు తీసుకుంటాం :సంజయ్‌కుమార్‌
మరోవైపు.. ‘మా సంస్థ పేరుతో దొంగ సర్వేను ప్రచురించిన పత్రిక, ఇతర చానళ్లు, వెబ్‌సైట్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ హెచ్చరించారు. ‘సాక్షి’ప్రతినిధితో ఆయన సోమవారం ఫోన్లో మాట్లాడుతూ.. ఆ సర్వేతో తమకు సంబంధంలేదని అధికారికంగా ప్రకటన విడుదల చేశామని చెప్పారు. తాను ఢాకాలో ఉన్నానని.. ఢిల్లీకి రాగానే వారికి నోటీసులు జారీ చేయడమే కాక.. ఆయా సంస్థల మీద ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు చంద్రబాబు పన్నిన పన్నాగంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చంద్రబాబు తీరుపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, మేథావులతో పాటు సామాన్యులు కూడా తీవ్రంగా స్పందించారు. ఏపీలో చంద్రబాబు కొన్ని మీడియా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని.. అందుకే వైఎస్‌ జగన్‌ ఆంధ్రజ్యోతి పత్రికతోపాటు ఏబీఎన్, టీవీ 5 చానళ్లను బహిష్కరించారని కూడా పరిశీలకులు విశ్లేషించారు. ఏపీలో టీడీపీ అనుకూల మీడియా ఆగడాలకు అంతులేకుండాపోతోందని వారు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఎల్లో బ్యాచ్‌ ఇదే రీతిలో కుతంత్రానికి పాల్పడుతోందన్నారు. ఇందుకు ఉదాహరణగా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని గుర్తుచేశారు. అలాగే.. ఇటీవల విశాఖ జిల్లా గాజువాకలో ఓ ఇంటి యజమాని, అద్దెదారుని మధ్య అద్దె బకాయి వివాదాన్ని వక్రీకరించి ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేసిందని వివరించారు.  
టీడీపీ, ఎల్లో మీడియాపై

చర్యలు తీసుకోండి..
కాగా, తప్పుడు సర్వేను ప్రచారంలోకి తేవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని కుట్రపన్నిన టీడీపీ, ఎల్లో మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కేంద్ర ఎన్నికల సంఘం, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సోమవారం ఫిర్యాదులు చేశారు. దీనిపై త్వరలోనే టీడీపీకి, ఎల్లో మీడియా సంస్థలకు నోటీసులు జారీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ పన్నాగం బెడిసికొట్టడంతో చంద్రబాబు, టీడీపీ ఎల్లో సిండికేట్‌ తేలుకుట్టిన దొంగలా మౌనం వహించారు.

ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
తప్పుడు సర్వేలు ప్రచురిస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురించిన సర్వేను తాము చెయ్యలేదని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ అధికారికంగా ప్రకటించినందున దానిని ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి      ద్వివేదికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి 150 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను పెయిడ్‌ ఆర్టికల్స్‌గా పరిగణించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న టీడీపీపై సాక్ష్యాలతో సహా ద్వివేదికి ఫిర్యాదు చేశారు. 

‘లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ ’ సర్వే పేరిట ఆంధ్రజ్యోతి కథనం అనైతికం
సాక్షి, హైదరాబాద్‌: ‘టీడీపీదే అధికారం’ పేరిట లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌ సర్వే అంచనా అంటూ సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ఆంధ్రజ్యోతి కథనాన్ని తప్పుడు కథనంగా పేర్కొంటూ లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ ఈ.వెంకటేశు ఖండించారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) మాజీ సభ్యులు అమర్‌నాథ్‌ ప్రెస్‌ కౌన్సిల్‌తో పాటు, కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం కమిషనర్‌ సునీల్‌ అరోరాతో పాటు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌కు అమర్‌నాథ్‌ లేఖ రాశారు. ఓ పార్టీకి అనుకూలంగా ఏపీలోని ఓటర్లను ప్రభావితం చేసేలా ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని అనైతికమైనదిగా పేర్కొంటూ, ప్రజాస్వామికంగా జరిగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేదిగా ఈ కథనం ఉందని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం, ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు అమర్‌నాథ్‌ రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది. ‘సర్వే సంస్థ లోక్‌నీతి – సీఎస్‌డీఎస్‌ సర్వేలో ఏప్రిల్‌ 11న ఏపీలో జరిగే ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ‘టీడీపీదే అధికారం’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తా కథనం వెలువడిన గంటల వ్యవధిలోనే లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ ఈ.వెంకటేశు ట్విటర్‌లో ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించారు. ఏపీలో తమ సంస్థ ఇటీవల కాలంలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టత ఇవ్వడంతో పాటు ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా అవాస్తవమని, సదరు పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీట్‌ చేశారు.’ అని అమర్‌నాథ్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11న జరిగే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓ పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ప్రచురించిందన్నారు. ప్రజాస్వామిక ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ కథనం ‘పెయిడ్‌ న్యూస్‌’ గా అనుమానం కలుగుతోందన్నారు. లేఖతో పాటు ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం, లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ ఈడీ ట్వీట్‌ను జత చేశారు.

‘ఎల్లో మీడియా సర్వేలు నమ్మొద్దు’
సాక్షి, హైదరాబాద్‌ : ఎన్ని అడ్డదారులు తొౖక్కైనాసరే అధికారంలోకి రావాలనే తలంపుతో సీఎం చంద్రబాబునాయుడు కుతంత్రాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కానుమాను రాజశేఖర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన జేబు సంస్థ అయిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన సర్వే పూర్తిగా బోగస్‌ అన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న సర్వేలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. వెంటిలేటర్‌పై ఉన్న చంద్రబాబు సర్కారును బతికించుకోవాలనే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement