ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు టీడీపీ దూరం?
ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీకీ టీడీపీ దూరంగా ఉండాలని భావిస్తోందా. మానవతాదృక్పథంతో అభ్యర్థిని బరిలోకి దింపకూడదని టీడీపీ ఆలోచిస్తోందా. అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీ ప్రకటించిన తర్వాత దీనిపై టీడీపీ అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నందిగామ, మెదక్ ఉప ఎన్నికలతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా న్యాయపరమైన సమస్యల వల్ల కుదరలేదు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోటీపై ఆసక్తి నెలకొంది.
మానవతా దృక్పథంతో నందిగామ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ పోటీకి దిగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడంతో పోలింగ్ నిర్వహించాల్సివచ్చింది. ఇక ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు తమ పార్టీ దూరంగా ఉండడమే మంచిదని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. నందిగామలో వైఎస్సార్‌సీపీ చూపిన వైఖరిని ఆళ్లగడ్డలో టీడీపీ చూపాల్సిన అవరముందని ఆయన అభిప్రాయపడ్డారు. శోభా నాగిరెడ్డి కుటుంబంపై సానుభూతి బాగా ఉన్నందున తమ పార్టీ రిస్క్ చేయకపోచ్చునని చెప్పారు.
మరోవైపు ఆళ్లగడ్డలో సరైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ వెనుకంజ వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు పోటీ చేసిన ఓడిపోయిన గంగుల ప్రభాకర్ రెడ్డి మాత్రం మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పెద్దలు మాత్రం రిస్క్ చేయడానికి సిద్దంగా లేరని సమాచారం.