
బాలుడి జననాంగంపై కొట్టిన ఉపాధ్యాయుడు
రాజమండ్రి : ఓ ఉపాధ్యాయుడు అయిదో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో అతడి జననాంగానికి గాయమై నెత్తురోడింది. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రిలోని సొసైటీ బిల్డింగ్ ప్రాంతానికి చెందిన ఆర్. శ్యామ్, దేవి దంపతుల కుమారుడు పృథ్వీరాజ్ స్థానిక నారాయణ స్కూలులో అయిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూలు అయిపోయాక పృథ్వీరాజ్ మెట్లైపై నుంచి వేగంగా దిగుతుండడంతో ఆంగ్ల ఉపాధ్యాయుడు జి. సురేంద్ర శ్రీనివాస్ ఆగ్రహించి విద్యార్థి జననాంగంపై చేతితో కొట్టడంతో గాయమై, రక్తం స్రవించింది. ఇంటికి వచ్చిన కుమారుడి నిక్కరు రక్తంతో తడి సి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
జరిగింది తెలుసుకుని కుమారునికి వైద్యం చేయించారు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్ల గతంలో పిల్లలు గొడవపడి తమ బిడ్డ తలకు తీవ్రగాయమైందని, కొద్దిపాటిలో కన్ను పోయి ఉండేదని శ్యామ్, దేవి మీడియా వద్ద వాపోయారు. విషయం తెలిసిన డీఐ ఎ. తులసీదాస్ స్కూలుకు వచ్చి తల్లిదండ్రులు, స్కూలు నిర్వాహకులతో మాట్లాడారు. జరిగిన సంఘటనకు బాధ్యుడైన ఉపాధ్యాయుడిపైనా, స్కూలుపైనా తగిన చర్యలు తీసుకుంటామని డీఐ హామీ ఇచ్చారు. కాగా ఉపాధ్యాయుడు కొట్టడం వాస్తవం కాదని, విద్యార్థే మెట్ల మీంచి పడిపోయాడని స్కూలు నిర్వాహకులు అంటున్నారు.