వివాహితకు ఉపాధ్యాయుడి వేధింపులు
సాలూరు: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, పదిమందికీ మంచీ చెడు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే తప్పుదారిలో వెళ్లి చావుదెబ్బలు తిన్నాడు. సదరు ఉపాధ్యాయుడు ఓ గృహిణిని సెల్‌ఫోన్లో లైంగిక వేధింపులకు గురిచేయడంతో విషయం బయటపడింది. బాధిత మహిళతోపాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన ఐ. గున్నరాజు, మామిడిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
పట్టణంలోని కోటవీధికి చెందిన ఓ వివాహితపై నిందితుడు కన్నేశాడు. ఆమె భర్తకు దూరంగా కుమారునితో కలిసి తల్లివద్ద ఉంటోందని తెలుసుకున్న గున్నరాజు కొద్దిరోజులుగా ఆమెకు ఫోన్‌చేస్తూ లైంగికంగా వేధించసాగాడు. ఎప్పటిలాగే గున్నరాజు ఆదివారం రాత్రి ఆమెకు ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన సమీప బంధువులు, స్నేహితులకు చెప్పి బోరుమంది.
నిందితుడు ఎక్కడున్నాడో తెలుసుకుని బాధితురాలి బంధువులు, స్నేహితులు అక్కడకు వెళ్లి ఉపాధ్యాయుడిని చితకబాదారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గృహిణి, ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.