జీ(వి)తానికి కనాకష్టం! | Teacher in problem | Sakshi
Sakshi News home page

జీ(వి)తానికి కనాకష్టం!

Published Fri, Aug 21 2015 3:07 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

జీ(వి)తానికి కనాకష్టం! - Sakshi

జీ(వి)తానికి కనాకష్టం!

- వృత్తి.. బోధన, మిగిలేది.. ఆవేదన
- సమస్యల సుడిగుండంలో ఎయిడెడ్ టీచర్లు
- అరచేతిలో వైకుంఠం చూపించిన ప్రభుత్వం
- నెలల తరబడి వేతనాల బకాయిలు
- ఇతర సదుపాయూలకూ నోచని కొలువు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
బుజ్జిబాబు... కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. తన సర్వీసులో ఎంతోమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఇప్పుడు మూత్రపిండాలు పాడై, ఇలాంటి సమస్యతోనే భార్య రెండు నెలల క్రితం శాశ్వతంగా దూరమై.. గంపెడు దుఖంలో కూరుకుపోయారు. మరోవైపు భార్యను దక్కించుకోవాలని చేసిన దాదాపు రూ.12 లక్షల అప్పు గుదిబండలా మారింది. మరోవైపు పిల్లల చదువులు ఎలా కొనసాగించాలో అర్థం కాని పరిస్థితి!
   
ఇది బుజ్జిబాబు సమస్యే కాదు జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి. మరి ‘వీరికి హెల్త్‌కార్డు ఉంటుంది కదా? ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది కదా?’ అనే సందేహం రావచ్చు. కానీ వీరంతా ప్రభుత్వోపాధ్యాయుల్లాగే సేవలందిస్తున్న ఎయిడెడ్ పాఠశాలల  ఉపాధ్యాయులు. కానీ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు సమకూర్చకుండా తమ జీవితాలతో ఆటలాడుతోందని వాపోతున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక అమలుపై శీతకన్ను వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు బడ్జెట్ నిధులనూ విడుదల చేయకుండా జీతాలను తొక్కిపెడుతున్నారని వాపోతున్నారు. తమ సమస్యల్ని ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాలకు దిగుతున్నారు.
 
దారి కానరాని ‘బ్లైండ్’ స్కూలు టీచర్లు
జిల్లాలో ఎయిడెడ్ పద్ధతిన నడిచే స్కూళ్లు 15 ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న 730 మంది టీచర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవు. సెకండరీ హైస్కూళ్ల టీచర్లకైతే గత రెండు నెలలుగా జీతాలు పడట్లేదు. ఇక మండపేటలోని బ్లైండ్ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లది మరీ దయనీయమైన పరిస్థితి. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల జీతాలు ఇప్పటికీ ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే బకారుు జీతాలు ఇవ్వకుండానే మార్చి నెల నుంచి మళ్లీ కొనసాగించారు. సరే ఇదైనా దక్కిందిలే అని ఊపిరి పీల్చుకొనే లోపే జూలై నెల నుంచి జీతం ఆగిపోయింది. జిల్లాలోనున్న 400 మంది టీచర్లకు రూ.15 లక్షల వరకూ ఎరియర్స్ రావాలి. వీటి కోసం గత మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
 
బడ్జెట్‌లో కోత!
వాస్తవానికి ఎయిడెడ్ టీచర్ల జీతాలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఏటా జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి పంపిస్తుంది. మళ్లీ త్రైమాసికానికి ఒకసారి చొప్పున మళ్లీ పంపిస్తుంది. అయినా సగానికి సగం కోత విధిస్తుండటంతో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
భవిష్యత్తు ఆగమ్యగోచరం...
ఉద్యోగి భవిష్యనిధి (ఈపీఎఫ్)కి తన వాటా మొత్తం చెల్లించని ఏ ప్రైవేట్ సంస్థనైనా మూయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాంటిది ప్రభుత్వమే 730 మంది ఎయిడెడ్ పాఠశాలల టీచర్లకు కొన్నేళ్లుగా ఆ మొత్తాన్ని ఎగవేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సాకుగా చూపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వోద్యోగులకు టీపీఎఫ్ అవసరం లేదన్నదే ఆ ఆదేశాల సారాంశం. కానీ ఎయిడెడ్ టీచర్లను అసలు ప్రభుత్వోద్యోగులుగా పరిగణించని ప్రభుత్వం.. పీఎఫ్‌ను మాత్రం రద్దు చేసేసింది. దీంతో ఆ మొత్తం ఆదాయపన్ను కోతకు పోతోంది. అటు భవిష్యనిధి భరోసా లేక, ఇటు జీతానికి చిల్లు పడుతోందని ఎయిడెడ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
హెల్త్‌కార్డులు హుళక్కే...
పేదలకు ఆరోగ్యశ్రీ, ప్రభుత్వోద్యోగులకు హెల్త్‌కార్డులు ఉన్నాయి. కానీ ఎయిడెడ్ టీచర్లకు ఆ రెండూ వర్తింపజేయట్లేదు. దీంతో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వేలకు వేలు ఖర్చుచేసుకోవాల్సిన పరిస్థితి. అటు జీతం సరిగా అందక, ఇటు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులతో పాటు అనారోగ్యం పాలైతే వైద్యానికీ అప్పుల బాట పట్టాల్సిన పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement