ఆత్రేయపురం (కొత్తపేట) : విద్యార్థినులపై లైగింక వేధింపులకు పాల్ప డుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడిపై రామచంద్రపురం డీవైఈవో జేఎస్ ప్రకాష్ విచారణ నిర్వహించారు. ఆత్రేయపురం మండలం ర్యాలి రామకృష్ణ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు వై.రాజీవ్ వ్యవహారశైలిపై ‘సాక్షి’లో ‘వ్యామోహ’ ఉపాధ్యాయుడు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆ ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కార్తిక వనసమారాధనలో భాగంగా హైస్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయుడు రాజీవ్ ఆధ్వర్యంలో ఆదివారం మారేడుమిల్లి వనవిహార యాత్రకు రెండు బస్సుల్లో వెళ్లారు.
అక్కడ విద్యార్థినులను ఉపాధ్యాయుడు రాజీవ్ లైంగికంగా వేధించడంతో వారు ఇంటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయంపై సోమవారం గ్రామపెద్దలు చర్చించుకుని హైస్కూల్ హెచ్‌ఎంకు, ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలంటూ మంగళవారం డీఈవో రామచంద్రపురం డీవైఈవో జేఎస్ ప్రకాష్‌ను ఆదేశించారు. దీంతో ప్రకాష్ మంగళవారం హైస్కూల్‌కు వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, ఎంఈవో వరప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు.
హెచ్‌ఎం టి. సుబ్బలక్ష్మి తీరుపై డీవైఈవో మండిపడ్డారు. నివేదికను డిఈవోకు అందజేస్తామని వ్యాయామ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ విద్యార్థినులు, ఉపాధ్యాయులను విచారించి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మద్దూరి సుబ్బలక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మద్దూరి సుబ్బారావు, యూటీఎప్ జిల్లా కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, స్టాఫ్ సెక్రటరీ కె.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment