
అనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో మూకుమ్మడి సెలవుకు దరఖాస్తు చేస్తున్న ఉపాధ్యాయులు
రాయవరం (మండపేట): సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. మూకుమ్మడి సెలవుకు దరఖాస్తు చేసి శనివారం జిల్లా కేంద్రమైన కాకినాడకు చలో కలెక్టరేట్ పిలుపుతో తమ సత్తాను చాటుకొనేందుకు పిడికిలి బిగిస్తున్నారు. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బాసటగా పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా సెలవుకు దరఖాస్తు చేసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు కలెక్టరేట్‌కు తరలిరావడానికి అడుగులేస్తుండడంతో జిల్లాలో వందలాది పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అలా మూతపడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
ముందుగానే టెలి యాప్‌లో నమోదుఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ రోజు సెలవు పెడితే అదే రోజు ఏపీ టెలి యాప్‌లో సెలవుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి భిన్నంగా ఉపాధ్యాయులంతా ఒకటి రెండు రోజులు ముందుగానే ఏపీ టెలి యాప్‌లో సెప్టెంబరు 1న సెలవుకు దరఖాస్తు చేసుకోవడం విశేషం.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విద్యాశాఖఉపాధ్యాయులు మాస్ లీవ్ పెట్టేందుకు సిద్ధపడిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు మూత పడకుండా చూసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. శనివారం పాఠశాలలు యథావిధిగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాకాధికారులకు ఆదేశాలు వచ్చాయి. మాస్ లీవ్ పెట్టిన పాఠశాలల ఉపాధ్యాయుల సెలవు చీటీలతో పాటుగా, ఆయా పాఠశాలల తాళాలు కూడా ఎంఆర్‌సీ కార్యాలయంలో అప్పగించాల్సిందిగా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంగన్‌వాడీ టీచర్ల పర్యవేక్షణలో అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది ఉపాధ్యాయులు, మరో ఐదువేల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారు. సీపీఎస్ ఉపాధ్యాయులకు మద్దతుగా మరో ఆరు వేల మంది ఉపాధ్యాయులు మాస్ లీవ్ పెట్టినట్లు తెలిసింది. వీరు కాకుండా సీపీఎస్, ఓపీఎస్‌కు చెందిన ఉద్యోగులు కూడా మాస్ లీవ్ పెట్టినట్లు సమాచారం.
అన్ని సంఘాల మద్దతు...
సీపీఎస్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరు కానున్నట్లు సమాచారం. ఫ్యాప్టొ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చలో కలెక్టరేట్ జిల్లా జేఏసీ కూడా మద్దతు పలకడం విశేషం.
వివిధ కార్మిక సంఘాలు కూడా చలో కలెక్టరేట్‌కు మద్దతునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చలో కలెక్టరేట్‌కు దాదాపుగా 30 వేల మంది హాజరవుతారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంచనా వేస్తున్నాయి.
అడ్డుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు
శనివారం చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం శాంతియుతంగా సాగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకే కలెక్టరేట్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చాం. సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – డీవీ రాఘవులు, ఫ్యాప్టొ చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment