సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఒత్తిడి లేని విద్యావిధానం అమలే తన లక్ష్యమని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. ‘గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుచేశాననే సంతృప్తి ఉంది.
మిగిలిన హామీలు, ఉపాధ్యాయులు ఆశిస్తున్న పలు సమస్యల పరిష్కారించేందుకు నిరంతరం శ్రమిస్తాను’ అన్నారు. గతంలో తన గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉపాధ్యాయవర్గాలకు ఈసారి కొత్తవారు తోడవడంతో మరింత సానుకూలపవనాలు వీస్తున్నాయన్నారు. గత ఎన్నికల హామీల అమలు, మరోసారి గెలిపిస్తే ఉపాధ్యాయులకు చేసే మేలు అనే దానిపై తన అంతరంగాన్ని ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు.
సాక్షి: రెండోసారి ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
చైతన్యరాజు: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి ఉపాధ్యాయుల రుణం తీర్చుకోవాలని.
సాక్షి: రాజకీయంగా ఎదుగుదలకు అనేక మార్గాలుండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలనే ఎందుకు ఎంచుకున్నట్టు?
చైతన్యరాజు: ఒక ఉపాధ్యాయుడు వంద మంది విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తారు. అలాంటి వారు ఇచ్చే తీర్పు సమాజంలో మేలుకొలుపవుతుందనే విశ్వాసం.
సాక్షి: బలమైన యూటీఎఫ్ బరిలో ఉండటంతో పోటీ ఎలా ఉంటుందనుకుంటున్నారు?
చైతన్యరాజు: గత ఎన్నికల్లో ఆ సంఘంతో పాటు మిగిలిన సంఘాలు కూడా నాకు సపోర్టు చేయబట్టే ఎమ్మెల్సీ కాగలిగాను. చివరకు నా కుమార్డు రవికిరణ్ ఎమ్మెల్సీ అవడంలో వారి సహకారం చాలానే ఉంది.
సాక్షి: పీఈటీ అసోసియేషన్ మీకు సహకరించడం లేదంటున్నారు?
చైతన్యరాజు: అలాంటిదేమీ లేదు. అసోసియేషన్ ప్రతినిధులు ఎలా ఉన్నా పీఈటీలంతా నాకు మద్దతు ఇస్తున్నారు. నా వెంటే ఉన్నారు.
సాక్షి: ఉపాధ్యాయులు మీకే ఎందుకు
ఓటు వేస్తారనుకుంటున్నారు?
చైతన్యరాజు: గత ఆరేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలను శక్తివంచన లేకుండా పరిష్కరించడంతో ఆ నమ్మకం కలుగుతోంది.
సాక్షి: మీ ఆరేళ్ల ప్రస్థానంలో ఉపాధ్యాయులకు ఏం చేశారో చెబుతారా?
చైతన్యరాజు: జేఏసీ పిలుపు మేరకు చేసిన 13 రోజుల సమ్మె కాలానికి వేతనం మంజూరు చేయించి, సర్వీస్ నష్టపోకుండా ప్రభుత్వ ఉత్తర్వులకు కృషి చేశా. మున్సిపల్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలను ‘010’లో చెల్లింపులకు ఉత్తర్వులు జారీకి కృషి చేశాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉపాధ్యాయుల సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. 2010 పీఆర్‌సీలో 2 శాతం హెచ్‌ఆర్‌ఏ పెంపుదలలో తోడ్పాటు అందించాను. 9వ వేతన సవరణ ద్వారా 39 శాతం ఫిట్‌మెంట్ కోసం జీఓ: 52 తెచ్చాము. అప్రెంటీస్ ఉపాధ్యాయులకు, మున్సిపల్, ఎయిడెడ్, గిరిజన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ల ఉత్తర్వులకు కృషి చేశాను. అప్రెంటీస్ ఉపాధ్యాయుల నియామకాలను నిలుపుదల చేస్తూ ఉత్వర్వుల జారీ సంతృప్తినిచ్చింది.
సాక్షి: భవిష్యత్‌లో ఏమి చేయదలుచుకున్నారు?
చైతన్యరాజు: 398 స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్‌లు, ఎయిడెడ్ అధ్యాపకులకు హెల్త్‌కార్డులు, 010లో జీతాలు, ఎయిడెడ్‌లో పనిచేసే అన్‌ఎయిడెడ్ వారికి కూడా హెల్త్‌కార్డులు ఇప్పిస్తాను. ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్‌లకు ఉద్యోగ భద్రతకు త్వరలో నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తాను. ఎంఈఓ, డీవైఈఓ, డైట్ లెక్చరర్‌లలో అర్హులైన వారికి పదోన్నతులు, కామన్ సర్వీసు రూల్స్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న డీఐ, డీవైఈఓలకు పదోన్నతులు సాధిస్తాను. ఇందుకోసం వేసిన కమిటీల్లో నా కుమారుడు ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మతో పాటు నేను కూడా ఉన్నాను.
సాక్షి:పేదలకు మీరు చేసిన సేవలేమైనా ఉన్నాయా?
చైతన్యరాజు: 14 ఏళ్లుగా అమలాపురం కిమ్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు, బెడ్‌చార్జీలు లేకుండా ఉచితంగా పేదలకు వైద్యం అందిస్తున్నాం. 270 గ్రామాల ప్రజలకు వైద్యం అందించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఉచితంగా మందులు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. 36 వేల మంది గర్భిణులకు ఉచితంగా వైద్యం, ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటుచేశాం. కిమ్స్‌లో పురుడుపోసుకున్న బిడ్డకు ఏడేళ్లు వచ్చే వరకు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తున్నాం. 800 పడకలకు సరిపడా రోగులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉచితంగా భోజనం పెడుతున్నాం. ఏడాదికి 3500 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాం. ఇంతవరకు ఉచితంగా 40వేల మందిని చదివించాం.
సాక్షి: గతంలో స్వతంత్రునిగా పోటీ చేసి ఇప్పుడెందుకు టీడీపీ మద్దతుతో బరిలో దిగారు?
చైతన్యరాజు: అధికార పార్టీ సహకారం ఉంటే
పెండింగ్‌లో ఉన్న, కొత్త హామీలను అమలు చేయవచ్చనే!