నిరవధిక సమ్మె’లో ఉపాధ్యాయులు
Published Thu, Aug 22 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని రద్దు చేసుకునే వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు. ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా గురువారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నందున ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి(జేఏసీ) జిల్లా చైర్మన్, కో-చైర్మన్ హెచ్.తిమ్మన్న, వి.కరుణానిధి మూర్తి కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని పొదుపు భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత నెల 30న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటించినప్పటి నుంచి 13 సీమాంధ్ర జిల్లాల ఉపాధ్యాయులంతా సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితిగా ఏర్పాటయ్యాయన్నారు.
విభజనను నిరసిస్తూ వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నామని, గురువారం నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెలోనూ ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాల ఉద్యమ కార్యాచరణ పాటిస్తూ అన్ని మండల, తాలూకా, జిల్లా కేంద్రంలో జరిగే ఉద్యమాల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన పని దినాలను రాబోయే రోజుల్లో శని, ఆదివారాలు, దసరా, సంక్రాంతి సెలవుల్లోనూ పనిచేసి సిలబస్ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ (1938), ఏపీటీఎఫ్ (257), ఆపస్, హెచ్‌ఎంఏ, పీఈటీఏ, ఆర్‌యూపీపీ, ఏపీటీజీ, ఎస్‌ఎల్‌టీఏ, జీటీఏ, ఎస్సీఎస్టీటీఎఫ్, టీఎన్‌యూఎస్, ఎస్‌టీఎఫ్, ఆర్‌జేయూపీ, వైఎస్సార్‌టీఎఫ్, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంఏ, బీసీటీయూ, ఎల్టీఏ, వీసీటీఎఫ్ సంఘాల నాయకులు విక్టర్ ఇమ్మానియేల్, ఎం.రమేష్, విజయ భాస్కర యాదవ్, మాణిక్యం రాజు, సుబ్బరాయుడు, ముత్తోజు వీరబహ్మం, కమలాకర్‌రావు, కృష్ణారెడ్డి, రమణయ్య, రాజసాగర్, రఘు, నాగేంద్రుడు, శ్రీనివాసులు, ఆనంద్, సాయిబాబా, దాదాపీర్, ఇస్మాయిల్, తులసిరెడ్డి, యోగీశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement