సాక్షి, కర్నూలు: విద్యార్థుల జీవితాలతో విద్యా శాఖ చెలగాటం ఆడుతోంది. ముందుచూపు లేని పరీక్షలతో ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షిస్తోంది. అర్ధ సంవత్సర పరీక్షల విషయంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నాలుగు రోజుల ముందు షెడ్యూల్ ప్రకటించగా.. రెండు రోజులు సెలవులు పోను ఒక్క రోజులో ప్రశ్నపత్రం తయారీ ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశ్న పత్రాల తయారీకి ఒక్కో విద్యార్థికి రూ.2.50 చొప్పున కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. ఇందుకు ఐదారు రెట్లు ఎక్కువ వ్యయం అవుతుండటంతో ఎవరు భరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యేటా జిల్లా స్థాయిలో ‘పరీక్షల నిర్వహణ మండలి’ నేతృత్వంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలు తయారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మండళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం అర్ధ సంవత్సర పరీక్షలకు అయ్యే వ్యయం పాఠశాలలకు సర్వశిక్ష అభియాన్ గ్రాంట్ నుంచి సమకూర్చుకోవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. కాగా సమ్మెటివ్-1 పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాల తయారీకి ఒక్కో విద్యార్థికి రూ.2.50 చొప్పున వెచ్చించాలని ప్రభుత్వం పేర్కొంది. తాజాగా నిర్వహిస్తున్న సమ్మెటివ్-2 పరీక్షలకు మొదట ఎలాంటి నిధులు ఇవ్వబోమని ప్రకటించినా.. ఆ తర్వాత 1 నుంచి 8వ తరగతులకు మాత్రమే రూ.2.50 చొప్పున కేటాయించేందుకు ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని విద్యా శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. సోమవారం నుంచి అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలనే విద్యా శాఖ ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆ ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు.
ఇప్పటికిప్పుడు ప్రశ్నపత్రాలు రూపొందించి ప్రింటింగ్ లేదా జిరాక్స్ తీయించడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో కొందరు ఉపాధ్యాయులు కర్నూలు పాతబస్టాండ్ వద్దనున్న ఓ ఏజెన్సీ, ఎస్‌ఏపీ క్యాంపునకు సమీపంలోని మరో బుక్‌షెల్లర్స్ తయారు చేసిన ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసి పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 1 నుంచి 8వ తరగతులకు కూడా ఇలా కొనుగోలు చేసిన ప్రశ్నా పేపర్లను ప్రింటింగ్ లేదా జిరాక్స్ తీసి.. లేదా బోర్డుపై రాసి పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. అయితే ప్రాథమిక స్థాయి పిల్లలు బోర్డుపై రాసిన ప్రశ్నలను చూసి పేపరులో సమాధానాలు రాయలేరన్నది ఉపాధ్యాయుల మాట.
ఉపాధ్యాయులకు పరీక్ష
Published Mon, Dec 15 2014 3:47 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement