ప్రేమకు నో చెప్పిందని... అత్యాచారయత్నం
కోల్ కతా: పరీక్ష రాసేందుకు వెళ్తోన్న ఓ టీనేజీ విద్యార్థినిపై ఓ అల్లరి మూక దాడిచేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి ఏరియాలో మంగళవారం చోటుచేసుకుంది. దాడి చేసిన వారి గ్రూపులో మహిళలు ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... ఓ విద్యార్థిని బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకని దూప్ గురి ఏరియాకి వెళ్తోంది. దారిలో ఓ గ్యాంగ్ ఆ బాలికను అడ్డుకుంది. అందులోని ఓ యువకుడు తనను ప్రేమించాలంటూ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ విద్యార్థిని అతడి ప్రేమకు నో చెప్పింది.
ఆవేశానికి లోనైన ఆ గ్యాంగ్ సభ్యులు ఆ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. అందులోని ఓ మహిళ బాధిత విద్యార్థినిపై తిట్ల పురాణం మొదలెట్టగా, యువకులు అమెను కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశారు. చివరికి ఆ విద్యార్థిని వారి నుంచి తప్పించుకోగా.. పంచాయతీరాజ్ అధికారి ఆ విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. బాధితురాలు ఆస్పత్రి బెడ్ మీద నుంచే బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ దాడికి పాల్పడ్డ అసలు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జల్పాయ్ గురి ఎస్పీ ఆకాశ్ మేఘారియా తెలిపారు. బాధితురాలిపై దాడి చేసి అత్యాచారానికి యత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేసు విచారణ త్వరగా పూర్తిచేస్తామని వివరించారు.