అధికారులను ఘోరావ్ చేస్తున్న అధ్యాపకులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేసినందుకు చెల్లించే భత్యం (డీఏ) మంజూరులో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ అధికారులతో అధ్యాపకులు గొడవకు దిగారు. ఇందులో భాగంగా అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. 50 కిలోమీటర్ల పైబడిన దూరం నుంచి స్పాట్ విధులకు వస్తున్న అధ్యాపకులకు రూ. 450 ఇవ్వాల్సి ఉందన్నారు.
అలాగే 50 కిలోమీటర్ల లోపు దూరం నుంచి వచ్చేవారికి రూ. 300 ఇవ్వాల్సి ఉందన్నారు. రూ. 300ను రూ. 120కు తగ్గించినట్లు సామాజిక మాద్యమాల్లో మెసేజ్‌లు వస్తున్నాయని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. గతంలో కంటే ధరలు పెరిగాయని ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచాల్సిందిపోయి డీఏ తగ్గించడం అన్యాయమని వాపోయారు. స్థానికంగా (లోకల్) ఉంటూ స్పాట్‌కు వచ్చే అధ్యాపకులకు గతంలో రూ. 130 దాకా ఇచ్చే రెమ్యూనరేషన్ ఈసారి రద్దు చేసినట్లు తెలిసిందని దీనిపై కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ పరీక్షల విధుల్లో పాల్గొన్నవారికి డీఏ మొత్తంలో తగ్గించారు తప్ప స్పాట్ విధుల్లో పాల్గొన్నవారికి తగ్గించాలనే సమాచారం తమకు రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment