
కన్నీటి వీడ్కోలు
- మచిలీపట్నం చేరిన ఎనిమిది మృతదేహాలు
- అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
- చిలకలపూడిలో విషాదం
- కన్నీరుమున్నీరైన బంధువులు
- షోలాపూర్‌లోనే చికిత్స పొందుతున్న ఐదుగురు
మచిలీపట్నం :తీర్థయాత్ర విషాదయాత్రగా ముగిసింది. ఆనందంగా వెళ్లిన వారు అనంతలోకాలకు చేరారు. మధురజ్ఞాపకాలతో వస్తారనుకున్న ఆత్మీయులు విగత జీవులుగా రావడం చూసి కన్నీరు కట్టలు తెగింది. బందరు కన్నీటి సంద్రమైంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పండరీపురం సమీపంలో కవిటిగావ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బందరుకు చెందిన ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను ఐదు అంబులెన్స్‌లలో బుధవారం ఉదయం ఇక్కడికి తీసుకువచ్చారు. పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
అంతటా రోదనలు, వేదనలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చలమలశెట్టి రంగనాథరావు(61), నూకల జగన్మోహనరావు(55), ఆయన భార్య కృష్ణకుమారి(50), బీరం శేషుమణి(45), జొన్నలగడ్డ వెంకటేశ్వరమ్మ అలియాస్ పాల లక్ష్మి(55), గోళ్ల వెంకటేశ్వరమ్మ(45), గోళ్ల రేష్మ(20), గేదెల వెంకటేశ్వరమ్మ (45) మృతదేహాలను అంబులెన్స్‌లలో తీసుకువచ్చారు. మృతదేహాలను గుర్తించి తీసుకువెళ్లాలని మృతుల బంధువులకు అధికారులు సూచించారు. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను కప్పి ఉంచిన వస్త్రాలను తొలగించి తమ బంధువులను గుర్తించిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ‘మాకెవరు దిక్కు..’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టారు. రంగనాథరావు, జగన్మోహనరావు, కృష్ణకుమారిల మృతదేహాలను చిలకలపూడి సెంటరులో బంధువులకు అప్పగించారు. సర్కారుతోటకు చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరమ్మ మృతదేహాన్ని ఆమె గృహం వద్ద అప్పగించారు. గేదెల వెంకటేశ్వరమ్మ, గోళ్ల వెంకటేశ్వరమ్మ, గోళ్ల రేష్మ మృతదేహాలను సుకర్లాబాద్‌లోని గేదెల వెంకటేశ్వరమ్మ గృహం వద్ద దించారు. ఆ సమయంలో వారి గృహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
రాత్రంతా పడిగాపులే..
మృతులంతా చిలకలపూడి పరిసర ప్రాంతాలకు చెందిన వారు కావటంతో మంగళవారం రాత్రంతా బంధువులు స్థానిక సెంటరులోనే పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం అంబులెన్స్‌లు వచ్చే వరకు మూడు స్తంభాల సెంటరు వద్ద మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎస్పీ జి.విజయకుమార్, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య తదితరులు కూడా వేచి ఉన్నారు. అనంతరం మృతదేహాలను చిలకలపూడి సెంటరుకు తరలించారు. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించి వారిని ఓదార్చారు.
మృతదేహాలను ఇళ్లకు చేర్చిన అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని), ఆ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్, సలార్‌దాదా తదితరులు మృతుల ఇళ్లకు వెళ్లి నివాళులర్పించారు. మృతదేహాలపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మృతుల అంత్యక్రియలను బంధువులు అశ్రునయనాల నడుమ నిర్వహించారు.
ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది
బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తీర్థయాత్రలకు వెళ్లిన బందరు వాసులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవటం దురదృష్టకరమన్నారు. మృతదేహాలను త్వరగా వారి బంధువులకు అప్పగించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, వారి మృతదేహాలను, స్వల్పంగా గాయపడిన వారిని మచిలీపట్నం తీసుకువచ్చామని చెప్పారు.
తీవ్రంగా గాయపడిన ఐదుగురు షోలాపూర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారికి సహాయకులుగా మరో ఆరుగురు ఉన్నారని పేర్కొన్నారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వివరించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు తెలిపారు.