రేటును బట్టే సీటు
తహశీల్దార్ బదిలీల్లో అవినీతిపర్వం
చక్రం తిప్పిన కీలక నేత బంధువు
‘ఇది కౌన్సెలింగ్‌ల సీజన్... రేటును బట్టే సీటు అని ‘గంట’ మోగించి మరీ చెబుతున్నారు ఓ కీలక నేత. కాలేజీల్లో మేనేజ్‌మెంట్ సీట్లకే కాదు తహశీల్దార్ పోస్టులకు కూడా అదే నీతిని వర్తింపజేస్తున్నారు ఆయన సమీప బంధువు. జిల్లాలో తహశీల్దార్‌ల బదిలీల్లో సర్వం తానై చక్రం తిప్పుతున్నారు ఆయన. ఆయన చెప్పిన ప్రకారమే ఉన్నతాధికారులు కూడా జీహుజూర్ అంటున్నారు.
-సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక నేతకు ఆయన సమీప బంధువు. ఆ కీలక నేత రాజకీయ, వ్యాపార వ్యవహారాలకు ఓ రకంగా చెప్పాలంటే పవార్ ఆఫ్ అటర్నీ పొందినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా తహశీల్దార్‌ల బదిలీల్లో ఆయన చెప్పిందే వేదంగా సాగిందని రెవెన్యూ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. రెండు తప్పా అన్ని పోస్టింగులు ఆయన చెప్పినట్లే ఇచ్చారని తెలుస్తోంది. అందుకు అనువుగా తమ వర్గంలోని ప్రజాప్రతినిధులతో మాట్లాడి ‘ఉభయతారకంగా’ అంతా సర్దుబాటు చేసేశారు. జీవీఎంసీ పరిధిలోనే కాకుండా రూరల్ జిల్లా పరిధిలోనూ ఆయన అనుకున్నట్లుగానే బదిలీల ప్రహసనంగా సాగింది.
దాదాపు వేలమే..!: ఆ కీలక నేత బంధువు ముందే వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. తమ నియోజకవర్గ పరిధిలోని పోస్టుకు దాదాపు వేలంపాట మాదిరిగా వ్యవహారం సాగించారు. ఆ మండల పరిధిలో పెద్ద ఎత్తున వివిధ ప్రాజెక్టులు, సంస్థలు రానున్నాయి. భారీ భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. దాంతో పలువురు అధికారులు ఆ పోస్టు కోసం కీలక నేత సమీప బంధువును కలిశారు. ఇదే అదనుగా ఆశావాహుల మధ్య పోటీ పెంచి జేబులు నింపుకున్నారని తెలుస్తోంది. తాజా బదిలీల్లో అత్యధికంగా ఆ పోస్టుకే చెల్లించడం గమనార్హం.
త్వరలో విశాఖ - చెన్నై కారిడార్ కోసం భారీ భూసేకరణ జరగనున్న రెండు కీలక మండలాల పోస్టింగుల కోసం కూడా అధికంగా ఆ కీలక నేత బంధువుకు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది. వ్యూహాత్మకంగా తమకు అనుకూలమైన అధికారులను అక్కడ పోస్టింగు వేయించుకున్నారు.
మరో భారీ ప్రాజెక్టు రానున్న ఓ మండలంలో పోస్టింగు కోసం కూడా కీలక నేత బంధువు పెద్ద మొత్తమే డిమండ్ చేసి రాబట్టుకున్నారు.
రెండో దశపై మరింత గురి: జిల్లాలో కీలకమైన రెవెన్యూ విభాగంలో తమ అనుయాయులు ఉండేలా కీలక నేత వ్యూహం పన్నారు. తొలి దశ బదిలీల్లో అంతా తాము అనుకున్నట్లే సాగడంతో రెండో దశపై గురిపెట్టారు. అందుకోసం ఇప్పటికే అనుకున్న రేటు చెల్లించడంతోపాటు తమకు అనుకూలంగా ఉండే వారి జాబితాను సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా కీలక నేతకు తందాన అంటుంటంతో రెవెన్యూ యంత్రాంగం దాదాపుగా నిర్వీర్యమైపోంందని ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.