ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అడ్మిషన్లలోపే స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లోపే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశం తేల్చకపోతే అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులెవ్వరూ సాహసించరని, దీనిపై గవర్నర్ తక్షణం స్పందించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళవారం ఇందిర భవన్‌లో పీసీసీ నేతలు సి.రామచంద్రయ్య, రుద్రరాజు పద్మరాజు, బొత్స సత్యనారాయణ, అహ్మదుల్లా, కన్నా లక్ష్మీనారాయణ, సుధాకర్ తదితరులతో కలసి విలేకరుల సమావేశంలో రఘువీరా మాట్లాడారు.
కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫీజులు ఎవరు భరిస్తారనేది పేద కుటుంబాల్లోని విద్యార్థులకు శేష ప్రశ్నగా మిగిలిందన్నారు. 95వ సెక్షన్‌లోని 371 డి ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ విద్యార్థులు పదేళ్లపాటు తెలంగాణలో కూడా అడ్మిషన్లు పొందేవిధంగా కేంద్రం చట్టం చేసిందన్నారు. దీనిపై జోక్యాన్ని కోరుతూ గవర్నర్‌కు త్వరలోనే లేఖ ఇస్తామని తెలిపారు. గవర్నర్ సమక్షంలో భుజాలు తట్టుకొని మాట్లాడుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు, ఆ సమయంలో విద్యార్థుల సమస్యలపై ఒక క్షణం మాట్లాడలేకపోయారా అని ప్రశ్నించారు. హామీ మేరకు షరతుల్లేకుండా అన్ని రకాల రుణాలు రద్దు చేయాలని చంద్రబాబును రఘువీరా డిమాండ్ చేశారు.