రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనకు నిరసనగా టీఆర్‌ఎస్ పిలుపు మేరకు గురువారం జిల్లా బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు స్వయంగా బంద్‌లో పాల్గొని పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూసివేశారు. జాతీయ రహదారులతో పలుచోట్ల రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలతో నిరసన హోరెత్తింది. పలుచోట్ల సీపీఐ, బీజేపీ, టీజేఏసీ అనుబంధ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లావ్యాప్తంగా 151 మందిని ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
టీఆర్‌ఎస్ పిలుపు మేరకు జరిగిన బంద్ పిలుపులో పార్టీ ముఖ్య నేతలు గురువారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్‌రావు, దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు గజ్వేల్, సంగారెడ్డి ఆర్టీసీ డిపోల ఎదుట తెల్లవారుజామునే బైఠాయించారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సంగారెడ్డిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్ బంద్‌ను పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యులు విధులు బహిష్కరించి, ఆసుపత్రి ఎదుట రాస్తారోకోలో పాల్గొన్నారు. సంగారెడ్డి శివారులోని కల్పగూరు మంజీర డ్యాంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జలదీక్షకు దిగారు.
మెదక్‌లో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీఎన్జీవోలు నిరసన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేటలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అడ్వకేట్ జేఏసీతో పాటు పలు సంఘాలు నిరసన తెలిపాయి. పట్టణంలో టీఆర్‌ఎస్, బీజేపీ భారీగా ర్యాలీ నిర్వహించాయి.
పటాన్‌చెరు పారిశ్రామికవాడలో బంద్ ప్రభావం సంపూర్ణంగా కనిపించింది. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే పటాన్‌చెరు బస్టాండు బస్సులు లేక బోసిపోయింది. పరిశ్రమల్లో కార్మికులు లేక ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు.
నర్సాపూర్, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది.
తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోహీర్ చౌరస్తా, దిగ్వాల్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై తెలంగాణవాదులు బైఠాయించారు. రాజీవ్ రహదారిపై ములుగు, కుకునూరుపల్లి వద్ద రాస్తారోకో చేశారు. జోగిపేటలోనూ సుమారు రెండు గంటల పాటు నాందేడ్-అకోలా రహదారిపై రాస్తారోకోకు దిగారు. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మెదక్ రీజియన్ పరిధిలోని 7 డిపోల పరిధిలో 570 బస్సులు నిలిచిపోవడంతో ఆర్టీసీకి రూ.40లక్షల మేర ఆదాయం కోల్పోయింది.
తెలంగాణ బంద్ సంపూర్ణం
Published Fri, Dec 6 2013 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement