
'జీవోఎంకు ఒకే నివేదిక పంపాలని బొత్సకు సూచన'
హైదరాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నాక... జీవోఎంకు రెండు వేర్వేరు నివేదికలు పంపాల్సిన అవసరమేంటని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. దీనిపై సీమాంధ్ర నేతలతో విడిగా ఎందుకు సమావేశమవుతున్నారని వారు నిలదీశారు.
బొత్సతో సోమవారం సమావేశమైన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర విభజన విషయంలో 11 కీలక అంశాలపై జీవోఎంకు సమర్పించాల్సిన నివేదిక గురించి చర్చించారు. భేటీ అనంతరం బొత్స మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమైన తర్వాత రాష్ట్రవిభజనపై జీవోఎంకు ఇవ్వాల్సిన నివేదికపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కాగా ఈ సమావేశం తర్వాత తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా నివాసంలో మరోమారు సమావేశమయ్యారు.