స్పీకర్‌కు అందజేసిన పార్టీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులో సవరించాల్సిన అంశాలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం గురువారం తన అభిప్రాయాలు, సూచనలను స్పీకర్‌కు తెలియజేసింది. 10 అంశాలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, పి.శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కె.హరీశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గంపా గోవర్ధన్, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, గడ్డం అరవింద్ రెడ్డి, జోగు రామన్న, కె.తారక రామారావు, ఎస్.సత్యనారాయణ, కె.విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, టి.రాజయ్య, మొలుగూరి భిక్షపతి, హనుమంత్ షిండే సంతకాలతో కూడిన పత్రాన్ని స్పీకర్‌కు అందించింది.
ఎమ్మెల్యేల బృందం సూచించిన సవరణలివీ..
1. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మూడేళ్ల కంటే ఎక్కువగా ఉంచకూడదు.
2. గవర్నర్‌కు శాంతి భద్రతలపై అధికారం వద్దు. గవర్నర్‌కు ఈ అధికారం లేకుంటే ప్రత్యేకంగా సలహా మండలి అవసరం ఉండదు.
3. రెండు రాష్ట్రాలకు వెంటనే వేర్వేరుగా హైకోర్టులను ఏర్పర్చాలి. వెంటనే సాధ్యం కాకుంటే మూడు నెలల గరిష్ట కాలపరిమితితో ఏర్పాటు చేయాలి.
4. జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా స్థానికత ఆధారంగా పెన్షనర్లను గుర్తించి, పెన్షన్ల భారాన్ని పంచాలి.
5. కార్పొరేషన్ల, కంపెనీల ఆస్తులను వెంటనే పంపిణీ చేయాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించిన సమయంలో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అనుసరించినట్టుగానే ఇక్కడా వ్యవహరించాలి.
6. ఉద్యోగుల విభజన కూడా స్థానికత ఆధారంగానే ఉండాలి.
7. పోలవరంతోపాటే ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి.
8. సమైక్య రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యుత్ ఒప్పందాల (పీపీఏ)లను సమీక్షించడానికి, కొత్తగా వచ్చిన అవకాశాలు, ఉత్పత్తి వనరులు, డిమాండ్, సరఫరా, విధానాలను అనుసరించి కొత్త విధానాలను అమలు చేయడానికి అనువుగా పార్లమెంటు బిల్లును సవరించాలి.
9. తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ స్థాయిలో ఆసుపత్రి, వైద్య శిక్షణా సంస్థ, ఐఐఎం, 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ ప్రాజెక్టును ఇవ్వాలి.
10. పదేళ్లపాటు ఉమ్మడి పరీక్షలు, అడ్మిషన్లు అసంబద్ధం. దీన్ని ఐదేళ్లకు కుదించాలి.
బిల్లుకు టీఆర్‌ఎస్ 10 సవరణలు
Published Fri, Jan 10 2014 4:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement