ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ సాగు నీరందించలేదు : మంత్రి ఉత్తమ్
మరోమంత్రి జూపల్లితో కలిసి పాలమూరు ప్రాజెక్టుల సందర్శన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘దశాబ్దాల తరబడి కరువు, వలసల జిల్లాగా ఖ్యాతికెక్కిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తాం. ఇదే శాసనసభ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తిచేసి సాగు నీరందిస్తాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డితోపాటు పలు ప్రాజెక్టులను మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం నాగర్‌కర్నూల్‌లోని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించినట్టు తెలిపారు.
బీఆర్‌ఎస్ పెద్ద మనిషి ఇటీవల పాలమూరు ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ సాగు నీరివ్వలేక పోయారన్నారు. ఈ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా చిత్తశుద్ధితో ముందుకెళుతున్నామని చెప్పారు. రెండు నెలలకోసారి ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
కృష్ణా నీటిని ఇప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాం..: జూపల్లి
కృష్ణా నీటి కేటాయింపులున్నా, వాటిని ఇప్పటికీ వినియోగించుకోలేక పోతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 18 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటిదాకా కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కాగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు వస్తే.. తమకు అవకాశం ఇవ్వలేదంటూ ఉదండాపూర్ నిర్వాసితులతోపాటు కానాయపల్లి నిర్వాసితులు మంత్రులు వెళ్లిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment