
పట్టు కోసం ఫైట్
మహబూబ్‌నగర్: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం మరిం త దూకుడు పెంచిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు విమనార్శస్త్రలు సంధిస్తూ ప్రజలదృష్టిలో పడేందుకు పోరాటాలు చేస్తున్నారు.
తమ ఉద్యమాల వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్‌ఎస్.. కేంద్రంలో మా మద్దతు ఉండటం వల్లే తెలంగాణ వస్తోందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల నినాదం ఇలా ఉంటే ఇచ్చేది.. మేమే తెచ్చేది తామే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే జైత్రయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్‌లో అన్నీతానై ముందుకెళ్తున్న జిల్లా మంత్రి డీకే అరుణ స్పీడుకు బ్రేకులు వేసేందుకు ఇటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం.. అటు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు బ్రేకులు వేసే ప్రయత్నిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కొంతమేర టీఆర్‌ఎస్, బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మంత్రి అరుణ పాల్గొని ఆయా పార్టీలను విమర్శిస్తూనే కాంగ్రెస్ విజయాలను చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
టార్గెట్ జూపల్లి!
మొదటి నుంచీ రాజకీయ శత్రువుగా ఉన్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును రాజకీయంగా ఎదుర్కొని భవిష్యత్తులో దెబ్బతీయాలనే ఉద్దేశంతో మంత్రి డీకే అరుణ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇటీవల మంత్రి బస్సుయాత్ర నిర్వహించిన సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటూనే ఓ దశలో రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ అందులోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును లక్ష్యంగా చేసుకుని కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపడేందుకు వీలుగా ఆ పార్టీ నాయకులను మంత్రి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే జూపల్లి స్పీడును తగ్గించేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని వేదిక గా ఉపయోగించుకుంటున్నారు.
ఇందులో భాగంగానే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలంలో గత గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ క్రెడిట్ మాదంటే..మాదే అంటూ మంత్రి అరుణ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు ఒకరిపై మరొకరు వాదనలకు దిగిన విషయం తెలిసిందే. దీనికితోడు ఎమ్మెల్యేను అన్నివిధాలుగా ఎదుర్కొనేందుకు అవసరమైన స్పీడును పెంచేందుకు కాంగ్రెస్ కొల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి విష్ణువర్థన్‌రెడ్డికి మంత్రి అరుణ అంతర్గతంగా మద్దతిచ్చినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే వీపనగండ్ల మండలంలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అధికారులు ఆహ్వానించకపోయినా విష్ణువర్ధన్‌రెడ్డి వేదికపైకి ఎక్కడాన్ని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తప్పుపట్టడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ప్రత్యేకాధికారి గోపాల్‌పై కూడా చేయి చేసుకున్నారు.
టార్గెట్ మంత్రి అరుణ!
ఇక బీజేపీ నుంచి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మాత్రం మంత్రి డీకే అరుణను టార్గెట్ చేసి మాట్లాడుతూ.. ఆయన కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు. అయితే జిల్లా అంతటా పార్టీ బలపడేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి అరుణ ప్రాతినిథ్యం వహిస్తున్న గద్వాలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు లోలోపల అన్ని రాజకీయపార్టీల ముఖ్య నాయకులతో నాగం జనార్దన్‌రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా కాంగ్రెస్‌లో మంత్రి అరుణకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మరోవర్గాన్ని తయారుచేస్తున్నారు. వీటికి మరింతబలం చేకూర్చేవిధంగా గద్వాలలో మంత్రి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ జైత్యయాత్ర సభకు ఎస్.జైపాల్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి హాజరుకాలేదు. ఏదేమైనా తెలంగాణ పేరుతో పట్టుకోసం రాజకీయనేతలు తంటాలు పడుతున్నారు.