
తెలంగాణ ఎంసెట్ ప్రశాంతం
5,085 మంది గైర్హాజరు
పెనమలూరు : తెలంగాణ ఎంసెట్ విజయవాడ రీజియన్‌లో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు. కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎవీ రత్నప్రసాద్ వివరాలు తెలిపారు. విజయవాడ రీజియన్‌లో తెలంగాణ ఎంసెట్‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని చెప్పారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరిగిన ఇంజినీరింగ్‌కు 8,954 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6,345 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
2,609 మంది గైర్హాజరైనట్లు వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన మెడికల్ పరీక్షకు 11,247 మందికి గాను 8,771 మంది పరీక్ష రాశారని, 2,476 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌కు 19 పరీక్ష కేంద్రాలు, మెడికల్‌కు 22 మొత్తం కలిపి 41 కేంద్రాల్లో పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు.