తెలంగాణ పండుగలపై సర్కార్ శీతకన్ను | Telangana Festivals lossing by united andhra, says Harish rao | Sakshi
Sakshi News home page

తెలంగాణ పండుగలపై సర్కార్ శీతకన్ను

Published Thu, Oct 3 2013 12:13 AM | Last Updated on Thu, Sep 6 2018 3:03 PM

Telangana Festivals lossing by united andhra, says Harish rao

బతుకమ్మ పండుగ కోసం నియెజకవర్గానికి రూ. 50 లక్షలు కేటాయించాలి
ఎమ్మెల్యే హరీష్‌రావు

 
 సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ పండుగలు సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఎమ్మెల్యే హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా పూలను పూజించే బతకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికే సొంతమన్నారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు, ఎర్ర చెరువు, మచ్చవానికుంట వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను ఆయన బుధవారం మున్సిపల్ కమిషనర్ రాంబాబు, శానిటరి ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి, ఏఈలు ఇంతియాజ్, లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. బతుకమ్మ పండగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తే ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయించి తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
 
 గత సంవత్సరం బతుకమ్మ పండగ నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.లక్ష విడుదల చేసిందని అవి గ్రామంలో రెండు విద్యుత్ బుగ్గలకు కూడా సరిపోవన్నారు. ఈ సంవత్సరం వాటిని కూడా విడుదల చేయకుండా సీఎం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారన్నారు.  పండుగ నిర్వహణ కోసం నియోజక వర్గానికి రూ.50 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు.  చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.  
 
 బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిధుల కోసం వెనుకంజ వేయకుండా పండగ ఏర్పాట్లు చేయాలన్నారు. కోమటిచెరువు, ఎర్రచెరువుల వద్ద దోభీఘాట్ల నిర్మాణం కోసం రూ.6 లక్షల చొప్పున రూ.12 లక్షలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ నిధులతో వాటిని సత్వరమే నిర్మించి అందుబాటులోకి తేవాలని, రజకుల సౌకర్యం కోసం నిర్మించిన హాల్‌ను సద్దుల బతుకమ్మరోజు ప్రారంభించేలా చూడాలన్నారు.ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, వేణుగోపాల్‌రెడ్డి, నయ్యర్ పటేల్, గుండు శ్రీనివాస్‌గౌడ్, బూర మల్లేశం, కిషన్‌రావు, బర్ల మల్లికార్జున్, నందు, తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement