టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిర్ణయం
శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేదాకా సభను స్తంభింపజేయాలని ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నివాసంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి, విప్‌లు ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్య, మిత్రసేన్, కుంజా సత్యవతి, ప్రతాపరెడ్డి, అబ్రహం, కె.శ్రీధర్, ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, కె.ఆర్.ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బిల్లును అడ్డుకుంటామని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను నేతలు ప్రస్తావించగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ‘‘బిల్లును ఎవడు అడ్డుకుంటాడో చూద్దాం. బిల్లు వచ్చిన వెంటనే బీఏసీ నిర్వహించి సభలో ప్రవేశపెట్టకపోతే ఊరుకునేది లేదు’’ అని తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నుంచి బిల్లు కేంద్రానికి వెళ్లేవరకు అందరం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమావేశం కావాలని ప్రతిపాదించారు. ఇప్పటివరకు దూరంగా ఉంటున్న హైదరాబాద్ మంత్రులు, ప్రజాప్రతినిధులను కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు. వారిని సమావేశానికి తీసుకొచ్చే బాధ్యతను జిల్లా ఇన్‌చార్జి మంత్రి గీతారెడ్డికి అప్పగించారు. విభజన బిల్లు అందిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన వెంటనే ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అందుకు అవసరమైతే అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నేతలతో కలిసి అసెంబ్లీని స్తంభింపజేసేందుకూ వెనుకాడకూడదని పేర్కొన్నారు.
తొలి ప్రాధాన్యం బిల్లుకే ఇవ్వాలి: గండ్ర
సమావేశానంతరం మంత్రులు డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, బసవరాజు సారయ్యతో కలిసి చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిర్దేశిత ఆరు వారాల గడువు వరకు చూడకుండా తక్షణమే విభజన బిల్లును సభలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నుంచి వచ్చినందున తొలి ప్రాధాన్యతగా ఈ బిల్లును తీసుకురావాలని సమావేశంలో కోరామన్నారు. శుక్రవారం డీకే అరుణ నివాసంలో తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా సమావేశమవుతామని చెప్పారు.
టీ మంత్రులతో టీఆర్‌ఎస్, టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
అసెంబ్లీ ఆవరణలోని మంత్రులు కె.జానారెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి ఛాంబర్‌లో విప్‌లు గండ్ర వెంకటరమణా రెడ్డి, ఈరవత్రి అనిల్, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్, టీడీపీ ఎమ్మెల్యేలు పి.రాములు, జైపాల్ యాదవ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ఐక్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుందా మని నిర్ణయించుకున్నారు. సభలో బిల్లు ఎప్పుడు చర్చకు వచ్చినా సీమాంధ్ర ఎమ్మెల్యేల దూకుడును అడ్డుకునే వ్యూహం, సమన్వయం తీరుపై చర్చించారు.