నకిరేకల్, న్యూస్‌లైన్
సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నినా త్రెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, డిసెంబర్ 2013లోగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ప్రచారం అక్కడి ప్రజలను మోసం చేయడానికేనని ఆరోపించారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న రోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని వెల్లడైందన్నారు. రాజ్యాంగపరంగా తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి తప్పు పట్టడం తగదన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా సీఎం వైఖరిని తప్పుపట్టారని, అయినా అదే విధంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. వారంలోపే తెలంగాణపై క్యాబినెట్ నోట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడి స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకుల సీమాంధ్రుల అడుగు, నీడల్లో పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. నేర చరిత్ర కలిగిన వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదనే బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్‌గాంధీ వాక్యానించడం హర్షణీయమన్నారు. ప్రజలను మోసం చేసే వారికి, మాఫియా లీడర్లకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వద్దని కోరారు. సమావేశంలో మంగళపల్లి, బోప్పారం సర్పంచ్‌లు ప్రగడపు నవీన్‌రావు, లింగయ్య ఉన్నారు.
డిసెంబర్‌లోగా తెలంగాణ రాష్ట్రం
Published Sat, Sep 28 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement