భవిష్యత్తుపై టి.టీడీపీ ఆందోళన
పట్టు సాధించాలని వ్యూహం... భారీ సభకు సన్నాహాలు
నేడు అధినేత చంద్రబాబుతో భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల కన్నా వెనుకబడిపోయామనే ఆవేదన ఆ ప్రాంత టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తాము లేఖ ఇచ్చినప్పటికీ ఈ విషయాన్ని అనుకున్నంత స్థాయిలో ప్రజలకు వివరించలేకపోయామని నేతలు బాహాటంగానే వెల్లడిస్తుండడం దీనికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పుంజుకునేందుకుగాను తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై ఈ ప్రాంత టీడీపీ నేతలు బుధవారం సమావేశమై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గురువారం సమావేశమై తదుపరి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, జీ జైపాల్‌యాదవ్, ఎనుముల రేవంత్‌రెడ్డి, హన్మంత్‌షిండే తదితరులు పాల్గొన్నారు. దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు అనివార్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, అయితే ప్రక్రియలో కొంత జాప్యం జరగొచ్చన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ దాన్ని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయామని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా, తమవల్లే అధికార పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోడంలో వెనుకబడి పోయామన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమైంది. ఈ నెలాఖరులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అదేస్థాయిలో టీడీపీ కూడా భారీసభ నిర్వహించాలని యోచించారు. తాము తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సుముఖమని, గతంలో ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోలేదని, తీసుకోబోమని కూడా ఈ సభలో చంద్రబాబుతో చెప్పించాలని కూడా నేతలు చర్చించారు.
వెనుకబడిపోయాం!
Published Thu, Sep 12 2013 3:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement