బందోబస్తు మధ్య సెమిస్టర్ పరీక్షలు | telangana university exams under security | Sakshi
Sakshi News home page

బందోబస్తు మధ్య సెమిస్టర్ పరీక్షలు

Published Tue, Dec 10 2013 6:27 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

telangana university exams under security

 తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం  డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూరు సౌత్‌క్యాంపస్‌తో పాటు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్(ఏడు)లో కేంద్రాలు  ఏర్పాటు చేశారు. సోమవారం 1,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది.
 
 వర్సిటీ ఉన్నతాధికారులు ఈ నెల 16  నుంచి పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి, తరువాత మాట మార్చి సోమవారం నుంచి ప్రారంభించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భిక్కనూరు సౌత్ క్యాంపస్‌తో సహా ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ పరీక్షా కేంద్రాల్లో ఒక్కరు కూడా పరీక్షలు రాయకుండా బహిష్కరించారు. డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్‌లోని పరీక్షా కేంద్రంలో 325 మందికి గాను కేవలం 27 మంది విద్యార్థులు మా త్రమే పరీక్షలకు హాజరయ్యారు. మిగతా 298 మంది బహిష్కరించారు. పరీక్షలు బహిష్కరించాలని విద్యార్థులు ముందస్తు పిలుపు నివ్వడంతో వర్సిటీ ఉన్నతాధికారులు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వచ్చింది. డిచ్‌పల్లి సీఐ శ్రీశైలం, ఎస్సై నరేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై రవికుమార్‌ల ఆధర్వంలో  పోలీసులను మెయిన్ క్యాంపస్ వద్ద మోహరించారు.
 
 ఆరు కేం ద్రాల్లో విద్యార్థులు సంపూర్ణంగా పరీక్షలు బహిష్కరిం చగా కేవలం మెయిన్ క్యాంపస్‌లో మాత్రం ఉర్దూ విభాగం విద్యార్థులు 14 మంది, తెలుగు ఒకరు, ఎల్‌ఎల్‌బి కి చెందిన 12 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్ క్యాంపస్‌లోనే కొందరు విద్యార్థి సంఘాల జిల్లా స్థాయి నాయకులు పరీక్షలకు  హాజరు కావడం క్యాంపస్‌లోని విద్యార్థుల మధ్య చర్చకు దారి తీసింది. ఈ విషయమై పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల వెన్నంటి ఉండాల్సిన సంఘాల నాయకులే ఇలా పరీక్షలకు హాజరు కావడం సమంజసంగా లేదన్నారు. వర్సిటీ ఉన్నతాధికారులు క్యాంపస్‌లోని విద్యార్థుల మద్య కుల రాజకీయాల చిచ్చు పెడుతున్నారని ఆరోపిం చారు.  తాము మూడు రోజుల పాటు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ధర్నా చేపట్టగా, ఈ నెల 16 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వీసీ మాట మార్చి సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభించడం శోచనీయమన్నారు. వీసీ ఒంటెత్తు పోకడలకు నిరసనగా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చించి వేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
 
 పరీక్షలకు అదనపు సమయం..
 వర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో ప్రారంభమైన సెమిస్టర్ పరీక్షలకు ఉన్నతాధికారులు కొందరు విద్యార్థులకు అదనపు సమయం ఇచ్చారు.   కొందరు  విద్యార్థులు పరీక్షా హాలు వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో వారికి అదనంగా సమయం ఇవ్వాలని ప్రిన్సిపాల్ ధర్మరాజు ఇన్విజిలేటర్లకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement