semester exams
-
మోడల్ పేపరే.. సెమిస్టర్ ప్రశ్నపత్రం!
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి అటానమస్ హోదా కలిగిన స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలను అధికారులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఐదు రోజుల క్రితం సెమిస్టర్–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీన రెండవ సంవత్సరం బీఎస్సీకి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా (టైటిల్ ఆఫ్ ది కోర్స్), బీ.కాం రెండవ సంవత్సరానికి సంబంధించి ఈ–కామర్స్, వెబ్ డిజైనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క పరీక్ష 75 మార్కులకు జరిపారు. అటానమస్ నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలు చేరొకచోట రూపొందించాల్సి ఉంది. అయితే, ఆ రెండు పరీక్షలకు ముందు విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ఇచ్చిన బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) ప్రశ్నపత్రాలనే సెమిస్టర్–3 పరీక్షలకు కూడా ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హోదా అధికారి అలసత్వం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని సమాచారం. పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్ సైతం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా, ఈ విషయంపై ప్రిన్సిపాల్ జీవనజ్యోతిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రశ్నపత్రాలు తమ కళాశాలలో ముద్రించడం లేదని తెలిపారు. ఏదైనా పొరపాటు జరిగిందేమో విచారణ చేస్తామని వెల్లడించారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారన్నారు. డిసెంబర్లో స్నాతకోత్సవం బాసర ట్రిపుల్ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహిస్తామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్సైట్లో వీసీ డాష్ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్ పోర్టల్‌ను ప్రారంభించారు. -
ముగిసిన వైవీయూ డిగ్రీ పరీక్షలు
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్షలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 10 రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం మీద 90 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. కాగా రాయచోటిలోని హెచ్ఎం డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటన మినహా మిగతా అన్ని చోట్ల పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఈ పరీక్షలకు 25,301 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా చివరిరోజు పరీక్షల్లో పలు కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, ఒంటిమిట్ట డిగ్రీ పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. శనివారం పరీక్షల్లో నలుగురు డీబార్ అయినట్లు ఆయన తెలిపారు. వీసీ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ మార్గదర్శనంలో పరీక్షలను సజావుగా, కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. -
ఎన్సీసీ విద్యార్థులకు వేరుగా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఎన్సీసీ క్యాడెట్లకు సెమిస్టర్ పరీక్షలను ప్రత్యేక తేదీల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు సూచనలు జారీ చేసింది. ఈ ప్రత్యేక పరీక్షలకు వచ్చే వారిని మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులుగా పరిగణించరాదని తెలిపింది. ‘ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో రిపబ్లిక్ డే క్యాంప్ కోసం ప్రిపరేషన్/ట్రైనింగ్ క్యాంపుల్లో క్యాడెట్లు పాల్గొంటున్నారని.. ఫలితంగా వారు సెమిస్టర్ తరగతులకు హాజరు కావడంలో, పరీక్షలు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్సీసీ విభాగం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో సంస్థ ఈ సూచనలు జారీచేసింది. వారికి ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక తేదీల్లో పరీక్షలకు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని యూజీసీ బుధవారం జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. -
29 నుంచి వన్‌టైం చాన్స్ డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ పూర్వవిద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ వన్‌టైం చాన్స్ నాన్సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29నుంచి ప్రారంభం కానున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వివిధ కాలేజీల్లో 1995 నుంచి నేటి వరకు బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే ఈ వన్‌టైం చాన్స్ పరీక్షలకు నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్ నుంచి లేదా ఓయూక్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి హాల్‌టికెట్లను పొందవచ్చన్నారు. -
ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి రెండో సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లో ఫలితాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు నిర్వహించనున్నట్లు వీసీ ప్రసాదరెడ్డి తెలిపారు. గౌరవ ఆచార్యుల నియామకం ఏయూలో పదవీ విరమణ చేసిన నలుగురు ప్రొఫెసర్లను గౌరవ ఆచార్యులుగా నియమిస్తూ ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొ.సత్యనారాయణ, ప్రొ.మధుసూదనరావు, ప్రొ.సుదర్శనరావు.. మేథమేటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొ.కేకేఎం శర్మ హానరీ ప్రొఫెసర్లుగా నియమించారు. -
సెమిస్టర్ పరీక్షలకు ‘వసతి’ గండం!
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన జి.సౌజన్య కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదివరకు ఇక్కడే ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకోగా, కోవిడ్–19 నేపథ్యంలో ఏడాదిగా ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ తరగతులకే పరిమితమైంది. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావడానికి రోజు తప్పించి రోజు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. దీంతో రోజుకు సగటున రూ. వెయ్యి ఖర్చవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, సంక్షేమ, కాలేజీ హాస్టళ్లు ఇంకా తెరచుకోకపోవడం, నగరంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వసతి పొందే పరిస్థితి లేకపోవడంతో సౌజన్య తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సాక్షి, హైదరాబాద్: ఆయా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న అనేకమంది విద్యార్థులు వసతిలేక సౌజన్య మాదిరిగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు (ఫస్టియర్ మినహా) సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బీటెక్, జనరల్ డిగ్రీ విద్యార్థులకు ఈనెలాఖరు వరకు, పీజీ జనరల్, టెక్నికల్ కోర్సులు, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆగస్టు రెండోవారం వరకు రోజు తప్పించి రోజు పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే వసతిగృహాల్లో ఉండి చదువు కొనసాగించిన విద్యార్థులు ప్రస్తుతం వసతిలేక ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలతోపాటు మూతపడిన సంక్షేమ, ప్రైవేటు హాస్టళ్లు ఇంకా తెరచుకోలేదు. దీంతో దూరప్రాంతాల్లో ఉండే మెజార్టీ విద్యార్థులు నిత్యం ఇంటి వద్ద నుంచి కాలేజీలకు వచ్చి పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఆయా సెమిస్టర్ పరీక్షలకు దాదాపు 4.72 లక్షలమంది హాజరవుతున్నారు. వీరిలో సంక్షేమ వసతిగృహాలు, ప్రైవేటు హాస్టళ్లలో, ప్రత్యేకంగా అద్దె గదుల్లో ఉండి చదువుకున్నవారి సంఖ్య 3 లక్షలు ఉన్నట్లు అంచనా. ఒకవైపు చార్జీలు, మరోవైపు తిండి ఖర్చులు విద్యార్థులకు భారంగా మారాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ... దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. యూనివర్సిటీ హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లు తెరిస్తే మేలు జరుగుతుందని విద్యార్థులు సూచించినా అధికార యంత్రాంగం స్పందించలేదు. హైదరాబాద్‌కు రెండ్రోజులకోసారి పరీక్షల కోసం వస్తున్నానని, దీంతో పరీక్షలపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నానని కోదాడకు చెందిన ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి కె.అవినాశ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో 5 వేల విద్యార్థి వసతిగృహాలు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులు వసతి పొందుతున్న హాస్టళ్లు 5 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతిగృహాలున్నాయి. వీటిల్లో పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం వెయ్యి హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో 2 లక్షలకుపైగా విద్యార్థులున్నారు. ప్రైవేటు హాస్టళ్లు దాదాపు మూడువేలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందేవారు. -
20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు, ఆయా విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 20 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు ప్రారం భమయ్యాక నవంబర్/ డిసెంబర్లో నిర్వహిం చుకోవాలని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను యూనివర్సిటీలకు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే వర్సిటీలు వాటిని తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, బోర్డు ఆఫ్ స్టడీస్‌లో ఆమోదం తీసుకొని అమలు చేయాలని వెల్లడించారు. మార్గదర్శకాలివే.. ► పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించాలి. అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని మార్పు చేయాలి. వీటి రూపకల్పన ఆయా యూనివర్సిటీలే చేసుకోవాలి. ► బ్యాక్‌లాగ్‌లతో సహా అన్ని యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 20వ తేదీ నుంచి నిర్వహించుకోవాలి. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు తెరిచాక నవంబర్, డిసెంబర్లో ఒక సెమిస్టర్ తర్వాత మరో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలి. బ్యాక్‌లాగ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మిగతా సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలి. ► సంప్రదాయ డిగ్రీల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలి. ఒక సెషన్లో బీకాం విద్యార్థుల్లో సగం మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇతర కోర్సుల (బీఏ, బీఎస్సీ) సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. మరొక సెషన్లో ఆయా కోర్సుల్లో మిగిలిన సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. ఈ కోర్సుల ప్రాక్టికల్స్ నిర్వహణను సంబంధిత కాలేజీలకు వదిలేయాలి. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను సంబంధిత ప్రిన్సిపాళ్లే నియమించుకుంటారు. ► ప్రాజెక్టులు, వైవా, సెమినార్స్ వంటికి ఆన్లైన్లోనే నిర్వహించాలి. పీహెచ్డీ విద్యార్థులకు సంబంధించి సెమినార్లు, వైవా విషయంలో యూజీసీ నిబంధనలను అమలు చేయాలి. ఆన్లైన్లోనే నిర్వహించాలి. -
స్టూడెంట్లకు వల..!
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయంలో పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్‌లో రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సెమిస్టర్ పరీక్షలు కీలకం. 2019 సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ కన్సల్టెన్సీలు విద్యార్థులను సర్వేల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ సమయంలో తాయిళాలకు ఆశ పడితే విద్యార్థుల భవిష్యత్ దారుణంగా దెబ్బ తింటుంది. రోజుకు రూ.700 సైతం ఇచ్చేందుకు కన్సల్టెన్సీలు సిద్ధమవుతుండడంపై చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి తోడు ఇదివరకు ఎప్పుడూ ఇంత ఉద్ధృతంగా విద్యార్థులతో సర్వేలు ఎవరూ జరిపించలేదు. దీంతో ఈ కన్సల్టెన్సీల వెనుక అధికార పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నివేదిక ఆధారంగా ఎన్నికలకు సిద్ధం కావచ్చన్నది రాజకీయ పార్టీల ప్రధాన వ్యూహం. వర్సిటీలో సర్వే సామర్థ్యం, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న ఎంబీఏ, ఎంకాం, ఎకనామిక్స్, సోషల్ వర్క్ వంటి విభాగాల విద్యార్థులపై ఎక్కువగా సర్వే కన్సల్టెన్సీలు దృష్టి పెడుతున్నాయి. అధ్యాపకులు కూడా ఈ సర్వేలకు వ్యతిరేకంగానే ఉన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో సామాజిక అనుసంధాన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శనివారం సర్వేలు నిర్వహిస్తుంటారు. వర్సిటీ బోధన సిబ్బంది సమక్షంలో ఈ సర్వేలు జరగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ అధికారులు మాత్రం ప్రైవేటు సర్వేలకు విద్యార్థులకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. అధికారులకు సంబంధం లేకుండా సర్వేలకు వెళితే మాత్రం నియంత్రించటం కష్టం. ప్రస్తుతం గ్రామాల్లో సర్వే బృందాలకు, అధికార పార్టీ అనుకుల సర్వేలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర కేసుల్లో ఇరుక్కుంటారు సర్వేలకు వెళ్లటం వల్ల విద్యార్థులు అనవసర కేసుల్లో ఇరుక్కుం టారు. అధికార పార్టీ యువతను ఎక్కువగా సర్వేలు పేరుతో వాడుకుంటుంది. ప్రైవేట్ సంస్థలకు సర్వేలు అప్పగిస్తుంది. విద్యార్థులు అప్రమతంగా ఉండాలి. గ్రామాల్లో సమస్యలు ఎదురు కావచ్చు. పోలీస్ కేసులు నమోదు కావచ్చు. భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని సర్వేలకు విద్యార్థులు దూరంగా ఉండాలి.– మొదలవలస చిరంజీవి, హైకోర్టు న్యాయ వాధి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థులను పిలుస్తున్నారు విద్యార్థులను ప్రెవేట్ కన్సల్టెన్సీ లు సర్వేల కోసం పిలుస్తున్నాయి. అయితే విద్యార్థులు మాత్రం ఆసక్తి చూపించటం లేదు. విద్యార్థి యూనియన్‌గా విద్యార్థులకు సర్వేలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నాం. విద్యాసంస్థల్లో విద్యార్థులను సర్వేలకు ఆహ్వానించటం మంచి పద్ధతి కాదు.– బి.నరేంద్ర చక్రవర్తి, ఏబీవీపీ యూనియన్ నాయకులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. చదువు పై దృష్టిపెట్టాలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. విద్యార్థులు వారి వద్దకు వెళ్లవద్దు. తరగతులకు హాజరై చదువు ప్రాధాన్యమివ్వాలి. విలువైన సమయం దుర్వినియోగం అవుతుంది. సర్వేల కోసం ప్రైవేట్ సంస్థలు విద్యార్థులను నేరుగా కలిస్తే సమస్య మా దృష్టికి తీసుకురావాలి.– ప్రొఫెసర్ కె.రఘుబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం -
మనీతో మార్కులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడ్డారు. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు మార్కులు వేసి పాస్ చేశారు. ఇలా ఏళ్లుగా సాగుతున్న ఈ దందా మెరిట్ విద్యార్థుల ఫిర్యాదుతో బయటపడింది. అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.240 కోట్లు ఉంటుందని దర్యాప్తులో తేలింది. ఇంజినీరింగ్, మెడికల్ తదితర ప్రధాన కోర్సులు చదివే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైనా, ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినా పునః మూల్యాంకనం (రీవాల్యుయేషన్) కోసం దరఖాస్తు చేస్తారు. గత ఏడాది 12 లక్షల మంది సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 3,02,380 మంది రీవాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశారు. రీవాల్యుయేషన్ చేపట్టిన అధికారులు అదనంగా 73,733 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు 16,630 మందికి అదనపు మార్కులొచ్చాయి. మొత్తంగా 90,369 మంది లబ్ధి పొందారు. ఈ విషయమై పలువురు విద్యార్థులు అవినీతినిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ముడుపులు అందుకుని అదనపు మార్కులు వేస్తున్నట్లు కొందరు దళారుల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు రహస్య విచారణ చేపట్టగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తేలింది. ఈ దందా 2011 నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు. 2011–16కాలంలో దాదాపు 12 లక్షల మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 5 లక్షలమందికి అదనపు మార్కులొచ్చాయి. ఈ ఐదు లక్షల మందిలో ఎంత మంది విద్యార్థులు లంచాలు ఇచ్చి లబ్ధి పొంది ఉంటారని ఆరాతీస్తున్నారు. ఒక్కో సెమిస్టర్‌కు రూ.45 కోట్ల వరకు విద్యార్థుల నుంచి అధికారులు వసూలు చేసినట్లు తేలింది. మార్కుల పునఃపరిశీలన పేరుతో గత మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకుగాను దాదాపు రూ.240 కోట్లు స్వాహా చేసినట్లు భావిస్తున్నారు. దీంతో అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ శాఖలో ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు అన్నా యూనివర్సిటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 2015–18 మధ్యకాలంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా వ్యవహరించిన ఉమ సహా పదిమందిపై కేసులు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్లు, వర్సిటీ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయగా అదనపు మార్కుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, స్థిరాస్తుల పత్రాలు లభించాయి. మరిన్ని ఆధారాలను వర్సిటీ అధికారులు ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. -
మళ్లీ అదే తప్పిదం
మారని ఎస్వీయూ పరీక్షల విభాగం తీరు బీకాం మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం కూర్పులో నిర్లక్ష్యం ఒకటే నమూనా... రెండు ప్రశ్నలు! అయోమయంలో విద్యార్థులు పుత్తూరు: ఎస్వీయూ డిగ్రీ పరీక్షల నిర్వహణను ఆషామాషీగా తీసుకున్నట్లుంది. సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులు గందరగోళానికి గురవుతూనే ఉన్నారు. మొదట సిలబస్‌కు విరుద్ధంగా ఇంగ్లిష్ ప్రశ్నపత్రంతో మొదలైన తప్పుల పరంపర మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకూ పాకింది. గత సంవత్సరం పుస్తకం నుంచి ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు గగ్గోలుపెట్టారు. నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్వీయూ మాట నిలబెట్టుకోలేకపోరుుంది. శుక్రవారం జరిగిన బీకాం (జనరల్) మొదటి సెమిష్టర్ ఫైనాన్షియల్ ఎకౌంటెన్సీ పరీక్షకు రూపొందించిన ప్రశ్నపత్రం విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టింది. ఒకే నమూనాతో సెక్షన్, సంఖ్య మారి రెండు ప్రశ్నలు రావడం, ఒకే నమూనాతో మూడు మార్కుల ప్రశ్న, 12 మార్కుల ప్రశ్న రావడం, 2వ సెమిస్టర్ సిలబస్‌కు సంబంధించి 3 మార్కుల ప్రశ్న రావడంతో విద్యార్థులు బిక్కమొహం వేశారు. విద్యార్థులు తెలిపిన మేరకు ప్రశ్నపత్రం వివరాలు.. ►{rరుుల్ బ్యాలెన్స సంబంధించి 2వ యూనిట్లో 4వ ప్రశ్న - రమేష్ యొక్క అంకణాను తయారుచేయండి (12 మార్కులు) ఇదే నమూనాతో 3వ యూనిట్లో 6వ ప్రశ్న - క్రింది వివరాల ఆధారంగా అంకణాను తయారు చేయండి(12 మార్కులు) ఇచ్చారు. ►{తికాలం క్యాష్ బుక్కు సంబంధించి 1వ యూనిట్లో 3వ ప్రశ్న - క్రింది వివరాల ఆధారంగా 3 వరుసల నగదు చిట్టాను తయారు చేయండి (12 మార్కులు).. ఇదే నమూనాతో 2వ యూనిట్లో 5వ ప్రశ్న (12 మార్కులు) వచ్చింది. ►అడ్జెస్ట్మెంట్ ఎంట్రీస్‌కు సంబంధించి 5వ యూనిట్లో 10వ ప్రశ్న (3 మార్కులు) ఇదే నమూనాతో 12 మార్కుల ప్రశ్న కూడా వచ్చిందని విద్యార్థులు వివరించారు. ►రెండో సెమిస్టర్ సిలబస్‌కు సంబంధించిన కన్సైన్మెంట్ అనగానేమి? (3 మార్కులు) ప్రశ్న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రంలో ఎలా కూర్పు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రశ్నపత్రం సులభంగానే ఉన్నా ప్రశ్నల సరళి ఒకే నమూనాతో రావడంవల్ల యూనిట్ టెస్టులు రాస్తున్న భావన కలుగుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. డిగ్రీ స్థారుు ప్రశ్నపత్రం రూపకల్పనలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని ఎస్వీయూ అధికారులు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో అభాసుపాలు కాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. -
నివ్వెరబోయూరు..
► ఇంగ్లిష్‌లో బీఈడీ ప్రశ్నపత్రం ► ఆందోళన చెందిన విద్యార్థులు ► ఏం రాయూలో తెలియక అయోమయం కమాన్‌చౌరస్తా : బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు నివ్వెరబోయూరు. గతంలో మాదిరిగా కాకుండా కేవలం ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఉండడంతో కొందరు విద్యార్థులు కేవలం హాల్‌టికెట్ నంబర్ మాత్రమే రాసి బయటకు వెళ్లిపోయూరు. ప్రశ్నాపత్రం గతంలో మాదిరిగా తెలుగులోనే ఇవ్వాలని కోరుతున్నారు. 5 కేంద్రాల్లో 1400 మంది బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఎస్సారార్ కళాశాల, వివేకనందా డిగ్రీ, పీజీ కళాశాల, వాగేశ్వరీ డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా బీఈడీ కళాశాలలకు చెందిన 1400 మంది విద్యార్థులు హాజరయ్యూరు. ఇక నుంచి ఇంతే ! శాతవాహన యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులకు మొదటిసారిగా సెమిస్టర్ విధానం అమలు చేయడంతో నిబంధనలు మారారుు. బీఈడీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. మొదటి పరీక్షనే కాదు ఇక ముందు జరుగబోయే పరీక్షలన్నింటీ ప్రశ్నపత్రాలు ఆంగ్లమాధ్యమంలోనే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే ఉండాలి గతంలో బీఈడీ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో వచ్చేది. కానీ ఇప్పుడు సెమిస్టర్ విధానం అమలవడంతో కోర్సు నిబంధనలు మారి ఇంగ్లిష్ మీడియంలోనే వస్తున్నారుు. తెలుగు మీడియం విద్యార్థులు మాత్రం కేవలం హాల్‌టికెట్ నంబర్ రాసి పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని మరో సెంటర్లో ప్రశ్నపత్రాన్ని తెలుగులో అనువదించి చెప్పడంతో అక్కడి విద్యార్థులు గట్టెక్కారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో వచ్చినప్పటికీ సమాధానాలు మాత్రం తెలుగులో రాసుకునే వెసులుబాటు ఉందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. -
డిగ్రీలోనూ సెమిస్టర్ పరీక్షలు
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లోని కోర్సులకు ఆధునిక హంగులతో సరి కొత్త విధానాలను రూపొందించనున్నారు. సాంప్రదాయ కోర్సులకు విద్యా సంవత్సరం ముగింపున రాత, ప్రాక్టికల్ పరీక్షల ద్వారా ప్రతిభను గుర్తించేవారు. ఇక నుంచి ఈ విధానాలకు స్వస్తి పలికి సెమిస్టర్ విధానాన్ని అమలుపరచనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి సీడీసీ (కళాశాల అభివృద్ధి కమిటీ) కసరత్తు చేస్తోంది. బుధవారం ఎస్కేయూలోని సీడీసీ కార్యాలయంలో జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశాన్ని సీడీసీ డీన్ ఆచార్య ఎంసీఎస్ శుభ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ , రాష్ర్ట ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు రాష్ర్ట వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో నూతన విధానాన్ని అవలంబించనున్నారు. నిన్న ఎస్వీ యూనివర్సిటీలో 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాల సీడీసీ డీన్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేడింగ్‌తో పాటు మార్కులు : నూతన సెమిస్టర్ విధానం 2015-16 విద్యా సంవత్సరంలో మెదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయిస్తారు. 75 మార్కులు రాత పరీక్షలు, 25 మార్కులు సైన్స్ వారికి ప్రాక్టికల్స్ . ఆర్ట్స్ వారికి 25 మార్కులు ఇంటర్నల్ మార్కులు కేటాయించారు. మాదిరి ప్రశ్నాపత్రాలు కూడా ఎస్కేయూలో జరిగిన సమావేశంలో ఆమోదించారు. సిలబస్ రూపకల్పన పూర్తి అయింది. సెమిస్టర్ విధానానికి తగ్గట్టుగా రూపొందించారు. సైన్స్ సబ్జెక్టులలో కొన్ని ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. ఆంత్రోపాలజీ, జియాగ్రఫి, జియాలజీ వంటి సబ్జెక్టుల సిలబస్ రూపకల్పన చేయనున్నారు. కార్యక్రమంలో యూజీ డీన్ ఆచార్య ఎ.మల్లి ఖార్జున రెడ్డి, జువాలజీ బీఓఎస్ చైర్మన్ నాగలింగ రెడ్డి, జ్ఞానేశ్వర్ ,బోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపకారం’ ఊసేది..?
జాడలేని ‘ఉపకార వేతనాల’దరఖాస్తు ప్రక్రియ ముగుస్తున్న విద్యాసంవత్సరం ఇప్పటికీ స్పష్టత ఇవ్వని సర్కార్ ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్న కళాశాల యాజమాన్యాలు ఆందోళనలో లక్షలాది విద్యార్థులు రంగారెడ్డి జిల్లా కందుకూరుకుచెందిన పి.మమతకు ఇబ్రహీంపట్నంలోని కళాశాలలో బీటెక్ (మెకానికల్) సీటు వచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు రావడంతో నాలుగేళ్ల కోర్సు ఉచితంగా చదవొచ్చని భావించింది. కానీ తొలిఏడాది పూర్తికావస్తున్నా.. ఇప్పటివరకు ఉపకారవేతనం, ఫీజు రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తు సైతం చేసుకోలేదు. మరోవైపు కళాశాల యాజమాన్యం ట్యూషన్ ఫీజు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేస్తే తిరిగి చెల్లిస్తామంటూ ఒత్తిడి చేస్తోంది. దీంతో నాలుగేళ్లు సాఫీగా సాగుతుందనుకున్న మమతకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. మెదక్‌జిల్లా సిద్దిపేటకు చెందిన ఆశిష్ రంగారెడ్డిజిల్లా ఘట్కేసర్ సమీపంలోని కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కోర్సు ముగుస్తున్న తరుణంలో పట్టుదలతో చదివి మంచి మెరిట్‌తో ఉద్యోగం సంపాదించాలనేది అతని లక్ష్యం. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది ఉపకార వేతనం అందలేదు. దీంతో హాస్టల్లో బకాయి పేరుకుపోయింది. మరోవైపు ప్రభుత్వం ఫీజు రాయితీ స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యం సైతం ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ఫలితంగా ఒత్తిడికి గురైన ఆశిష్.. చదవుపై ధ్యాస పెట్టలేకపోతున్నాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: కళాశాల విద్యార్థులు కష్టాల్లో పడ్డారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటుతో ఉన్నత విద్యను సాఫీగా పూర్తిచేయాలని భావించగా.. ప్రస్తుత పరిస్థితులు అందుకు ప్రతిబంధకంగా మారాయి. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఉపకార వేతన దరఖాస్తుల ప్రక్రియే ప్రారంభించలేదు. వార్షిక సంవత్సరం ముగుస్తుండగా.. దరఖాస్తులే స్వీకరించకపోవడంతో ఈ ఏడాది ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ అందుతాయా, లేదా? అని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8.6 లక్షల మంది విద్యార్థులు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్నారు. అర్హులా.. కాదా..? సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు, మూడు నెలల్లో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి వివరాలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుంది. దాదాపు నెలరోజుల గడువుతో ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం వచ్చిన దరఖాస్తులను సంక్షేమాధికారులు కళాశాలల వారీగా క్షేత్రపరిశీలన చేస్తారు. ఈ సందర్భంలోనే వడపోత చేపట్టి అర్హులైన విద్యార్థులను ధ్రువీకరిస్తారు. ఈ క్రమంలో ఆయా విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధిస్తారు. ఈ ప్రక్రియ దాదాపు రెండున్నర నెలలపాటు సాగుతుంది. గత విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 8,56,422 మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 7,78,565 మందిని అర్హులుగా గుర్తిం చారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో దరఖాస్తుల ప్రక్రియే ఇంకా ప్రారంభం కాకపోవడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం విధించే నిబంధనలతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తాము అర్హులమవుతామా, లేదా? అనే సందేహం వారిని తొలచివేస్తోంది. మరోవైపు కళాశాల యాజమాన్యాలు కూడా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామంటూ తేల్చిచెప్పడం విద్యార్థులకు భయాందోళన కు గురిచేస్తోంది. ఈ ఏడాది కష్టమే..! విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించినప్పటికీ.. ఈ వార్షిక సంవత్సరం ముగిసేనాటికి విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం కష్టమే. ఎందకంటే దరఖాస్తుల ప్రక్రియకు గరిష్టంగా నెలరోజుల గడువు అవసరం. అనంతరం వాటిని పరిశీలించి ధ్రువీకరించడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. ఈలోపు ప్రస్తుత వార్షిక సంవత్సరం సైతం పూర్తి కానుండడంతో ఈ ఏడాదిలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రాయితీ పొందే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు వార్షిక పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ముంచుకొస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియ విద్యార్థులకు సైతం తలనొప్పి కానుంది. ఇంతవరకు ఏమీ రాలేదు నేను కాలేజీలో చేరిన దగ్గరినుంచి ఇప్పటివరకు రూపాయి రాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మొదట్లో ఏమీ అనకపోయినా కళాశాల వర్గాలు ఇప్పుడు ఫీజు కట్టమంటున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్‌గా ఉంది. కళాశాల యాజమాన్యం ఇప్పుడు ఒత్తిడి చేయకపోయినా పరీక్షల సమయంలో చేస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. - పి. అరుణ్, డిగ్రీ ఫస్టియర్, డీజీఆర్ఎం డిగ్రీ కళాశాల, తుంగతుర్తి, నల్లగొండ త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తాం పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పద్ధతిలో మార్పు లేదు. గతేడాది విధానాన్నే ఈ సారి కూడా అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో త్వరలో దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలిస్తుంది. - వి.వి.రమణారెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఉప సంచాలకులు -
పబ్లిక్ పరీక్ష రద్దు?
టెన్త విద్యార్థులకు ఇక త్రైమాసిక పరీక్షలు వచ్చే ఏడాది నుంచి అమలు చెన్నై, సాక్షి ప్రతినిధి: తొమ్మిదో తరగతి వరకే ఉన్న త్రైమాసిక పరీక్షల విధానాన్ని పదోతరగతికి సైతం విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్స రం నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరో తరగతి వరకు త్రైమాసిక పరీక్షల విధానాన్ని గతంలో 8వ తరగతికి, ఆ మరుసటి ఏడాది తొమ్మిదో తరగతికి విస్తరించారు. త్రైమాసిక విధానాన్ని దశలవారీగా ఇతర తరగతులకు అమలు చేస్తామని గతంలోనే ప్రకటించి ఉన్న ప్రభుత్వం తాజాగా పదో తరగతిని కూడా త్రైమాసిక విధానంలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో సెమిస్టిర్ విధానంలా సెప్టెంబరు, జనవరి, ఏప్రిల్ నెలలకు సిలబస్‌ను విభజించి ఆయా విద్యా సంవత్సరాల్లో మూడునెలల, ఆరునెలల, సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. ఇందుకోసం మెట్రిక్, ఆంగ్లో ఇండియన్, స్టేట్ సిలబస్‌ను క్రోఢీకరించి ఒకే సిలబస్‌గా గతంలో తయారు చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని విద్యాసంస్థలు ఈ కొత్త విధానాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. రానున్న విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తున్నందున ఇందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు ముద్రణాలయాల్లో ముద్రణ దశలో ఉన్నారుు. అయితే త్రైమాసిక విధానాన్ని అమలుచేస్తున్న తరుణంలో వచ్చే ఏడాది పదోతరగతికి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్రైమాసికంతోపాటూ పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించిన పక్షంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను మూడుసార్లు దిద్దడం కష్టతరమైన వ్యవహారంగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన పక్షంలో త్రైమాసికంలో వచ్చిన మార్కులు ఎక్కడ, ఎలా కలపాలనే అనుమానాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి నుంచి త్రైమాసిక పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున వచ్చే విద్యాసంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు ఉండవని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పైకి ప్రకటించకున్నా కేవలం విద్యార్థుల హాజరీపైనే ఆధారపడి పైక్లాసుకు ప్రమోట్‌చేసేందుకు సిద్ధమైపోయింది. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పరిమితమై ఉన్న త్రైమాసిక పరీక్షల విధానం పదోతరగతికి చేరుకున్నట్లుగానే వచ్చే ఏడాదికి పదకొండో తరగతికి కూడా విస్తరించే అవకాశం లేకపోలేదని ఒక ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. -
తెయూ వీసీపై విద్యార్థుల నిరసనాగ్రహం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తుంటే, ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్‌అలీఖాన్‌పై గురువారం విద్యార్థులు నిరసనాగ్రహం ప్రదర్శించారు. డిచ్పల్లిలోని తెయూ బాలుర వసతి గృహ ం ఎదుట విద్యార్థులు వీసీకి పిండ ప్రదానం చే సి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనను పట్టించుకోకుండా వీసీ ఏకపక్షంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం తగదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డిచ్పల్లిలోని వర్సిటీ మెయిన్ క్యాంపస్, భిక్కనూరులోని సౌత్ క్యాంపస్‌తో పాటు వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో కనీసం 3 శాతం విద్యార్థులు కూడా పరీక్షలు రాయడం లేదన్నారు. మెజార్టీ విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా, వీసీ తన మొండి వైఖరికి పోవడం తగదన్నారు. వెంటనే పరీక్షల రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చెట్టుకు ఉరి కామారెడ్డి : పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని టీజీవీపి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు తెయూ వీసీ అక్బర్ అలీఖాన్ దిష్టిబొమ్మను చెట్టుకు ఉరితీశారు. అనంతరం కళాశాల ఎదుట దహనం చేశారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్, నాయకులు లక్ష్మణ్, వేణు, కిరణ్, తిరుపతి, హజాం, విద్యార్థులు పాల్గొన్నారు. సౌత్ క్యాంపస్‌లో పరీక్షల బహిష్కరణ భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను గురువారం విద్యార్థులు బహిష్కరించారు. పరీక్షలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ విద్యార్థులను కోరగా, విద్యార్థులు నిరాకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ నెలలో నెట్ పరీక్షలు ఉన్నందునే సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వీసీని కోరినా పట్టించుకోవడం లేదని. గత్యంతరం లేక పరీక్షలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. పరీక్షలను తిరిగి పది రోజుల తర్వాత నిర్వహించేందుకు రీ నోటిఫికేషన్ వేయాలని విద్యార్థులు కోరారు. దీంతో ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని విదార్థులకు తెలిపారు. -
బందోబస్తు మధ్య సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూరు సౌత్క్యాంపస్తో పాటు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్(ఏడు)లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం 1,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ నెల 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి, తరువాత మాట మార్చి సోమవారం నుంచి ప్రారంభించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భిక్కనూరు సౌత్ క్యాంపస్‌తో సహా ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ పరీక్షా కేంద్రాల్లో ఒక్కరు కూడా పరీక్షలు రాయకుండా బహిష్కరించారు. డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లోని పరీక్షా కేంద్రంలో 325 మందికి గాను కేవలం 27 మంది విద్యార్థులు మా త్రమే పరీక్షలకు హాజరయ్యారు. మిగతా 298 మంది బహిష్కరించారు. పరీక్షలు బహిష్కరించాలని విద్యార్థులు ముందస్తు పిలుపు నివ్వడంతో వర్సిటీ ఉన్నతాధికారులు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వచ్చింది. డిచ్పల్లి సీఐ శ్రీశైలం, ఎస్సై నరేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై రవికుమార్‌ల ఆధర్వంలో పోలీసులను మెయిన్ క్యాంపస్ వద్ద మోహరించారు. ఆరు కేం ద్రాల్లో విద్యార్థులు సంపూర్ణంగా పరీక్షలు బహిష్కరిం చగా కేవలం మెయిన్ క్యాంపస్‌లో మాత్రం ఉర్దూ విభాగం విద్యార్థులు 14 మంది, తెలుగు ఒకరు, ఎల్ఎల్బి కి చెందిన 12 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్ క్యాంపస్‌లోనే కొందరు విద్యార్థి సంఘాల జిల్లా స్థాయి నాయకులు పరీక్షలకు హాజరు కావడం క్యాంపస్‌లోని విద్యార్థుల మధ్య చర్చకు దారి తీసింది. ఈ విషయమై పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల వెన్నంటి ఉండాల్సిన సంఘాల నాయకులే ఇలా పరీక్షలకు హాజరు కావడం సమంజసంగా లేదన్నారు. వర్సిటీ ఉన్నతాధికారులు క్యాంపస్‌లోని విద్యార్థుల మద్య కుల రాజకీయాల చిచ్చు పెడుతున్నారని ఆరోపిం చారు. తాము మూడు రోజుల పాటు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ధర్నా చేపట్టగా, ఈ నెల 16 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వీసీ మాట మార్చి సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభించడం శోచనీయమన్నారు. వీసీ ఒంటెత్తు పోకడలకు నిరసనగా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చించి వేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు అదనపు సమయం.. వర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో ప్రారంభమైన సెమిస్టర్ పరీక్షలకు ఉన్నతాధికారులు కొందరు విద్యార్థులకు అదనపు సమయం ఇచ్చారు. కొందరు విద్యార్థులు పరీక్షా హాలు వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో వారికి అదనంగా సమయం ఇవ్వాలని ప్రిన్సిపాల్ ధర్మరాజు ఇన్విజిలేటర్లకు సూచించారు.