- జాడలేని ‘ఉపకార వేతనాల’దరఖాస్తు ప్రక్రియ
- ముగుస్తున్న విద్యాసంవత్సరం
- ఇప్పటికీ స్పష్టత ఇవ్వని సర్కార్
- ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్న కళాశాల యాజమాన్యాలు
- ఆందోళనలో లక్షలాది విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా కందుకూరుకుచెందిన పి.మమతకు ఇబ్రహీంపట్నంలోని కళాశాలలో బీటెక్ (మెకానికల్) సీటు వచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు రావడంతో నాలుగేళ్ల కోర్సు ఉచితంగా చదవొచ్చని భావించింది. కానీ తొలిఏడాది పూర్తికావస్తున్నా.. ఇప్పటివరకు ఉపకారవేతనం, ఫీజు రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తు సైతం చేసుకోలేదు. మరోవైపు కళాశాల యాజమాన్యం ట్యూషన్ ఫీజు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేస్తే తిరిగి చెల్లిస్తామంటూ ఒత్తిడి చేస్తోంది. దీంతో నాలుగేళ్లు సాఫీగా సాగుతుందనుకున్న మమతకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.
మెదక్‌జిల్లా సిద్దిపేటకు చెందిన ఆశిష్ రంగారెడ్డిజిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కోర్సు ముగుస్తున్న తరుణంలో పట్టుదలతో చదివి మంచి మెరిట్‌తో ఉద్యోగం సంపాదించాలనేది అతని లక్ష్యం. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది ఉపకార వేతనం అందలేదు. దీంతో హాస్టల్‌లో బకాయి పేరుకుపోయింది. మరోవైపు ప్రభుత్వం ఫీజు రాయితీ స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యం సైతం ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ఫలితంగా ఒత్తిడికి గురైన ఆశిష్.. చదవుపై ధ్యాస పెట్టలేకపోతున్నాడు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కళాశాల విద్యార్థులు కష్టాల్లో పడ్డారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటుతో ఉన్నత విద్యను సాఫీగా పూర్తిచేయాలని భావించగా.. ప్రస్తుత పరిస్థితులు అందుకు ప్రతిబంధకంగా మారాయి. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఉపకార వేతన దరఖాస్తుల ప్రక్రియే ప్రారంభించలేదు. వార్షిక సంవత్సరం ముగుస్తుండగా.. దరఖాస్తులే స్వీకరించకపోవడంతో ఈ ఏడాది ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ అందుతాయా, లేదా? అని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8.6 లక్షల మంది విద్యార్థులు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్నారు.
అర్హులా.. కాదా..?
సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు, మూడు నెలల్లో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి వివరాలను ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుంది. దాదాపు నెలరోజుల గడువుతో ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం వచ్చిన దరఖాస్తులను సంక్షేమాధికారులు కళాశాలల వారీగా క్షేత్రపరిశీలన చేస్తారు. ఈ సందర్భంలోనే వడపోత చేపట్టి అర్హులైన విద్యార్థులను ధ్రువీకరిస్తారు.
ఈ క్రమంలో ఆయా విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధిస్తారు. ఈ ప్రక్రియ దాదాపు రెండున్నర నెలలపాటు సాగుతుంది. గత విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 8,56,422 మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 7,78,565 మందిని అర్హులుగా గుర్తిం చారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో దరఖాస్తుల ప్రక్రియే ఇంకా ప్రారంభం కాకపోవడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం విధించే నిబంధనలతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తాము అర్హులమవుతామా, లేదా? అనే సందేహం వారిని తొలచివేస్తోంది. మరోవైపు కళాశాల యాజమాన్యాలు కూడా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామంటూ తేల్చిచెప్పడం విద్యార్థులకు భయాందోళన కు గురిచేస్తోంది.
ఈ ఏడాది కష్టమే..!
విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించినప్పటికీ.. ఈ వార్షిక సంవత్సరం ముగిసేనాటికి విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం కష్టమే. ఎందకంటే దరఖాస్తుల ప్రక్రియకు గరిష్టంగా నెలరోజుల గడువు అవసరం. అనంతరం వాటిని పరిశీలించి ధ్రువీకరించడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. ఈలోపు ప్రస్తుత వార్షిక సంవత్సరం సైతం పూర్తి కానుండడంతో ఈ ఏడాదిలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రాయితీ పొందే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు వార్షిక పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ముంచుకొస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియ విద్యార్థులకు సైతం తలనొప్పి కానుంది.
ఇంతవరకు ఏమీ రాలేదు
నేను కాలేజీలో చేరిన దగ్గరినుంచి ఇప్పటివరకు రూపాయి రాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మొదట్లో ఏమీ అనకపోయినా కళాశాల వర్గాలు ఇప్పుడు ఫీజు కట్టమంటున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్‌గా ఉంది. కళాశాల యాజమాన్యం ఇప్పుడు ఒత్తిడి చేయకపోయినా పరీక్షల సమయంలో చేస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- పి. అరుణ్, డిగ్రీ ఫస్టియర్, డీజీఆర్‌ఎం డిగ్రీ కళాశాల, తుంగతుర్తి, నల్లగొండ
త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తాం
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో మార్పు లేదు. గతేడాది విధానాన్నే ఈ సారి కూడా అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో త్వరలో దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలిస్తుంది.
- వి.వి.రమణారెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఉప సంచాలకులు