
చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వింత పరిస్థితి
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి అటానమస్ హోదా కలిగిన స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలను అధికారులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఐదు రోజుల క్రితం సెమిస్టర్–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీన రెండవ సంవత్సరం బీఎస్సీకి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా (టైటిల్ ఆఫ్ ది కోర్స్), బీ.కాం రెండవ సంవత్సరానికి సంబంధించి ఈ–కామర్స్, వెబ్ డిజైనింగ్ పరీక్షలు నిర్వహించారు.
ఒక్కొక్క పరీక్ష 75 మార్కులకు జరిపారు. అటానమస్ నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలు చేరొకచోట రూపొందించాల్సి ఉంది. అయితే, ఆ రెండు పరీక్షలకు ముందు విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ఇచ్చిన బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) ప్రశ్నపత్రాలనే సెమిస్టర్–3 పరీక్షలకు కూడా ఇచ్చారు.
ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హోదా అధికారి అలసత్వం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని సమాచారం. పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్ సైతం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా, ఈ విషయంపై ప్రిన్సిపాల్ జీవనజ్యోతిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రశ్నపత్రాలు తమ కళాశాలలో ముద్రించడం లేదని తెలిపారు. ఏదైనా పొరపాటు జరిగిందేమో విచారణ చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment